ప్రగతి జోష్...


Tue,September 4, 2018 12:56 AM

-ప్రగతి నివేదన సభ సక్సెస్‌తో టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం
-చారిత్రక సభలో భాగస్వామ్యం అంటూ సంబురాలు
-పెద్ద జాతరకు పోయొచ్చినట్లే ఉందంటున్న కార్యకర్తలు
-ఎటూ చూసినా జనమేనంటూ అడుగడుగునా ముచ్చట్లు
-సీఎం కేసీఆర్ ప్రసంగంతో నేతల్లో రెట్టింపు ఆనందం

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ ;జన ప్రవాహం పోటెత్తింది. సీఎం కేసీఆర్ ప్రసంగం ఉత్సాహ పరిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన ప్రగతి నివేదన సభ సరికొత్త జోష్‌ను నింపింది. ఆ పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛందంగా తరలి వెళ్లిన ప్రజలు.. వెరసి కొంగర కలాన్ సభ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను తలపించిందని కలిసిన ప్రతి ఒక్కరికీ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. సభకు ముందు ఎంత ఆసక్తి రేకెత్తిందో.. అనంతరం కూడా అంతకు మించిన చర్చను లేవనెత్తింది. నభూతో నభవిష్యత్ అంటూ ఎక్కడ చూసినా ప్రత్యక్షంగా సభలో పాల్గొన్న వాళ్లే కాదు.. టీవీల్లోనూ జన ప్రభంజనాన్ని ఆసాంతం వీక్షించిన వాళ్లు సైతం చర్చించడం కన్పించింది. చరిత్రలో నిలిచిపోయేలా టీఆర్‌ఎస్ మరోసారి నిర్వహించిన భారీ బహిరంగ సభలో తామూ భాగస్వామ్యం అయినందుకు.. నాలుగేండ్ల తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రత్యక్షంగా విన్నందుకు సంతోషంగా ఉందని సభకు తరలివెళ్లిన ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సందడి వాతావరణాన్ని నింపింది. సభకు ముందు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ప్రగతి నివేదన సభ.. సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగంతో పూర్తయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా జిల్లా అంతటా వినిపిస్తోంది. జాతరకు వెళ్లి వచ్చిన అనుభూతిని మిగిల్చిందని కార్యకర్తలు.. చారిత్రక సభలో భాగస్వామ్యంతో సంతోషంగా ఉందని ప్రజలు సంబుర పడుతుండడం గమనార్హం.

చిమ్మ చీకటిలో పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఎదుర్కొన్న కష్టాలను, పోరాడిన పంథాను సీఎం కేసీఆర్ వివరించిన తీరు సభలో పాల్గొన్న వారిలో సరికొత్త స్ఫూర్తిని నింపింది. ప్రతిపక్ష పార్టీల అవరోధాలను అధిగమిస్తూ.. నాలుగేండ్ల తెలంగాణలో సాధించిన ప్రగతిని, అద్భుత కార్యక్రమాలను సవివరంగా పూసగుచ్చిన విధానం భవిష్యత్ తెలంగాణకు ఏది అవసరమో స్పష్టంగా వివరించిందని టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంతోషంగా చెప్తున్న పరిస్థితి సర్వత్రా నెలకొంది.

రహీంకు నివాళి...
సభకు వెళ్తూ ప్రమాదానికి గురై మృతిచెందిన అబ్దుల్ రహీం మృతదేహాన్ని మంత్రి గుంటకండ్ల సందర్శించారు. ఎమ్మెల్యేలు కిశోర్, వీరేశం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్‌తో కలిసి నివాళులర్పించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అతిత్వరలో అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

పేరుపేరునా కృతజ్ఞతలు
చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన ప్రజలకు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. విజయవంతమైన ప్రగతి నివేదన సభతో ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...