మత్స్యకారుల్లో ఆనందం


Tue,September 4, 2018 12:52 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : నాగార్జునసాగర్.. అపార జలరాశులకు నిలయం. ముఖ్యంగా మత్స్య సంపదతో కొంగు బంగారంగా సాగరం విరాజిల్లుతోంది. మొన్నటి వరకు జలకళను కోల్పోయిన సాగర్ రిజర్వాయర్ పరిధిలో ఉపాధి లేక తల్లడిల్లిన మత్స్యకార్మిక కుటుంబాలు.. రిజర్వాయర్‌లోకి సమృద్ధిగా వచ్చి చేరిన కృష్ణమ్మ చూసి సంబుర పడుతున్నారు. సాగర్ లోతట్టు ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకున్న గంగపుత్రులతో పాటు, చేపల వృత్తే జీవనాధారంగా బతుకుతున్న గిరిజనులకు నదీమతల్లి ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ ఆదెరువునిస్తూ వస్తున్నది. కృష్ణా చేపల్లో ఉన్న కొన్ని రకాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి చేపలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా.. చేతినిండా పని దొరికిందంటూ మత్స్యకారులు ఉత్సాహంగా చేపల వేటకు ఉపక్రమిస్తున్నారు.


ఉమ్మడి చందంపేట మండలం చిన్నమునిగల్ పంచాయతీ పరిధిలోని వైజాగ్ కాలనీలో 300 వరకు మత్స్యకార్మిక కుటుంబాలున్నాయి. సాగర్ డ్యాం నిర్మాణ సందర్భంగా ఆంధ్రాలోని వైజాగ్ నుంచి ఇక్కడకు వలసొచ్చి స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. చేపల వేటను ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇరవైకి పైగా మర బోట్లు, పుట్టీలు ఉండగా వాటిల్లో చేపల వేటకు వెళ్తారు. కుటుంబ సభ్యులంతా ఇదే వృత్తిపై ఆధారపడి నిత్యం రూ.వేలల్లో ఆదాయం పొందుతారు. చేపల వేటకు వెళ్లిన కార్మికులు ఏటి ఒడ్డున గుట్టల ప్రాంతంలో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులపాటు కుటుంబసభ్యులకు దూరంగా గడపాల్సి వస్తుంది. వేటాడిన చేపలు కేరళ, కోల్‌కత్తా తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. గర్ లోతట్టు ప్రాంతం వెంట జీవనం సాగిస్తున్న గిరిజనం సైతం చాలావరకు చేపల వేటను వృత్తిగా చేసుకుని బతుకుదెరువును సాగిస్తున్నది. ప్రభుత్వం వీరికి కూడా లైసెన్స్‌లు జారీచేసి ప్రభుత్వం పరంగా చేయూతనిస్తోంది. సాగర్ నిండటంతో గిరిజనులకు సైతం ఉపాధి మెండుగా కలుగుతున్నది.

చేతి నిండా పని..
కృష్ణా నదిలో మత్స్యకారులు ఏడాదిలో 300 రోజులపాటు చేపల వేటను కొనసాగిస్తారు. కొన్నిచోట్ల పుట్టీల ద్వారా.. మరికొన్ని చోట్ల మర బోట్లలో వేట సాగుతుంది. అయితే మొన్నటి వరకు డ్యాంలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో మత్స్యకార్మికులకు ఉపాధి కరువై ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడిపోయారు. యేటా కొన్ని నెలలపాటు ఉపాధి లేక మత్స్యకార్మిక కుటుంబాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాదిలోనూ కొంతకాలం చేపలవేటకు దూరమైన మత్స్యకారులు రిజర్వాయర్‌లోకి భారీగా వచ్చిన నీటితో తిరిగి చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. వలలను సిద్ధం చేసుకోవడం, పుట్టీలు, మరబోట్లను మరమ్మతులు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ ప్రాంత చేపల్లోని బొచ్చె, బంగారు తీగ, జెల్ల, రవ్వు, కొర్రమీను, బురదమట్ట, పాంప్లేట్లు తదితర చేపల రకాలకు ఇతర రాష్ర్టాల్లో చాలా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మన సరిహద్దు రాష్ర్టాలకు కొన్ని చేపలను ఎగుమతి చేస్తుంటారు. నిన్నమొన్నటి వరకు రోజుకు 4-5కిలోల చేపలను మాత్రమే వేటాడగా.. సాగర్‌లో పెరిగిన నీటిమట్టం కారణంగా రోజుకు 40కిలోల వరకు చేపలు పడుతున్నాయని మత్స్యకార్మికులు సంబురపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాది రిజర్వాయర్‌లోకి భారీగా చేప పిల్లలను వదలడం.. అవి పెరిగి పెద్దవ్వడంతో వలలో పడ్డ ఒక్కో చేప 20కిలోల వరకు ఉండి పుష్కలంగా ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు.

దళారులతో ఆదాయానికి గండి..
కృష్ణా నదిలో భారీ ఎత్తున అక్రమ చేపల వేట సాగుతున్నది. కొన్ని చోట్ల నిషేధిత వలలను వాడుతుండటంతో చిన్న, సన్నకారు మత్స్యకార్మికుల ఉపాధికి అవరోధం కలుగుతున్నది. నేటికీ ఇక్కడి చేపల దందాలో కొందరిదే పెత్తనంగా ఉంటూ వస్తుంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడి మత్స్యకారులకు అప్పులిచ్చి దళారీ వ్యవస్థకు తెర తీస్తున్నారు. రూ.లక్ష మొదలుకుని ఆపైన అప్పుగా నగదు ఇవ్వడంతోపాటు చేపలను వేటాడే వలలను సమకూరుస్తున్నారు. వేటాడిన చేపలను సదరు దళారులకే విక్రయించాల్సి ఉండగా.. చేపల బరువును బట్టి కిలోకు రూ.40 నుంచి రూ.100 వరకు దళారులు మత్స్యకారులకు చెల్లిస్తున్నారు. దీంతో చేపల వేట రూపంలో వచ్చే ఆదాయమంతా దళారుల జేబుల్లోకి వెళ్లిపోతోంది.

చేపల వేట లేకుంటే కూలీ పని..
సాగర్‌లో నీళ్లు లేక చేపల వేట లేని రోజుల్లో కూలీ పనులకు వెళ్తాం. కూలీ పనులకు వెళ్తే వచ్చే రూ.150తో కుటుంబమంతా పొట్ట పోసుకోవాలి. ఒక్కోసారి మా పరిస్థితి చూస్తే మాకే ఏడుపొస్తది. ఇప్పుడు నీళ్లు రావడంతో బతుకుదెరువుకు భరోసా కల్గింది.
- చెల్లూరి పోలేరమ్మ, వైజాగ్‌కాలనీవాసి

230
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...