ఆరుతడి సాగే మేలు


Sat,December 14, 2019 12:19 AM

-వారబందీ పద్ధతిలో నీరు
-తాగు అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం
-వరి నుంచి రైతుల దృష్టి మళ్లించాలి
-ఐఏబీ సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
-యాసంగికి నీటి కేటాయింపులు పూర్తి
జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: రబీ సీజన్‌లో కాలువల ద్వారా నీరు పొందే రైతులు ఆరుతడి పంటలను తప్పా ఎట్టిపరిస్థితుల్లోనూ వరి సాగు చేపట్టరాదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారుల పైనే ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన సాగునీటి సలహా బోర్డు కార్యక్రమంలో యాసంగికి కేటాయింబోయే నీటి వివరాలను మంత్రి నిరంజన్‌రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రైతులకు ఎత్తిపోతల ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరందాలంటే రైతులు వరిని సాగు చేయరాదన్నారు. వారంబందీ పద్ధతిలో పంట పొలాలకు సాగునీటిని అందించి చివరి ఆయకట్టు వరకూ సాగునీరు చేరేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపడుతారన్నారు. తదుపరి సమావేశం నాటికి ఈ కమిటీ పేరును సాగునీటి సలహా బోర్డ్‌, నీటిపారుదల కమిటీగా నామకరణం చేయాలని మంత్రి సూచించారు. నీటి పారుదుల శాఖ ప్రతిపాదించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది యాసంగి పంటలకు జూరాల ప్రాజెక్ట్‌ కుడి కాలువ ద్వారా 10వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 20వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. ఆర్డీఎస్‌ కాలువ, తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా 20వేల ఎకరాలకు, జవహర్‌లాల్‌ నెహ్రూ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 30వేల ఎకరాలకు, రాజీవ్‌ భీమా ద్వారా 21,650 ఎకరాలకు, కోయిల్‌సాగర్‌ ద్వారా 6వేల ఎకరాలకు, ఎంజీకేఎల్‌ఐ ద్వారా లక్షా 86వేల 300 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు.

కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్ట్‌ నుంచి వరద ఇంకా కొనసాగుతుండటంతో ప్రస్తుత కేటాయింపులను మరింత పెంచేందుకు పునః సమీక్షించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. వీటితో పాటు ఉమ్మడి పాలమూరుకు తాగునీటిని అందించేందేకు ఏర్పాటుచేసిన మిషన్‌ భగీరథ ప్లాంట్‌కు నీటి కొరత రాకుండా మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. రాజోలి బండ పనుల పెండింగ్‌, జమ్ములమ్మ రిజర్వాయర్‌ కాలువ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. రంగసముద్రం, శంకర సముద్రం, ఆర్‌ అండ్‌ ఆర్‌, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గోపల్‌దిన్నెకు సంబంధించి 0.6 మీటర్లు తగ్గించి నిర్మాణం చేసినందుకు నిండటం లేదని దానిని సరిదిద్దుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జూరాల పైభాగంలో ఉన్న 342 ప్యాకేజీని పరిశీలించి అవకాశం ఉంటే జూరాల వరద సమయంలో ఇంకో కాలువను ఏర్పాటుచేసి నేరుగా రామన్‌పాడు నింపుకునేందుకు వీలుగా మరో రిజర్వాయర్‌ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులకు ఆయన సూచించారు. సింగోటం నుంచి గోపల్‌దిన్నెకు లింక్‌ చేయడం ద్వారా గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ నింపేందుకు అవకాశాన్ని పరిశీలించి అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. మునిగల నుంచి చిన్న కెనాల్‌ ఏర్పాటు చేసుకోగలిగితే దాదాపు ఏడువేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఆ దిశగా పరిశీలించాల్సిందిగా ఇరిగేషన్‌ అధికారులకు మంత్రి సూచించారు. కేఎల్‌ఐ నుంచి పెద్దమందండి, అడ్డాకుల సాగునీరు అందించే అవకాశాలను పరిశీలంచాలన్నారు. కార్యక్రమంలో గద్వాల కలెక్టర్‌ శశాంక, వనపర్తి కలెక్టర్‌ శ్వేతా మహంతీ, నీటిపారుదల సీఇ అనంతరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌లు సరిత, స్వర్ణ, లోక్‌నాథ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...