ఆత్మరక్షణే ఆలంబన


Thu,December 5, 2019 02:15 AM

-ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు కరాటేలో శిక్షణ
-మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు
-జిల్లాలో 48 ఉన్నత పాఠశాలల ఎంపిక
-రూ.4.32 లక్షలు మంజూరు
-ఒక్కో పాఠశాలకు రూ.9వేలు
-వచ్చేవారం నుంచిప్రారంభంకానున్న శిక్షణలు

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రస్తుత సమాజంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది. కొందరు మృగాల వికృత చేష్టలతో మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఇటీవల శంషాబాద్‌లో దిశ, ఇతర ప్రాంతాల్లో పలువురు మహిళలు ఇలా బలి కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించే చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో విద్యార్థి దశలోనే బాలికలకు మానసిక ైస్థెర్యం కల్పించడంతో పాటు శారీరక దృఢత్వం కల్పించడం, స్వీయ ఆత్మరక్షణ చేసుకునేందుకు చర్యలు చేపట్టేలా విద్యాశాఖను ఆదేశించింది.

ఇందులో భాగంగా డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల పాటు ఉన్నత పాఠశాలలకు చెందిన బాలికలకు ఆత్మరక్షణ విద్యలను నేర్పించనున్నారు. యుద్ధ విద్యలైన కుంగ్‌ఫూ, కరాటే లాంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించింది. ప్రతి పాఠశాలకు రూ.9వేల చొప్పున అందించనున్నారు. ఇలా జిల్లాలో బాలికల యుద్ధ విద్య శిక్షణలకు 48 ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల కోసం జిల్లాలో రూ.4.32లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లాలో మూడు నెలల పాటు విద్యార్థినులకు ఆయా యుద్ధ విద్యలపై ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇస్తారు.

ఈ విద్యల వల్ల బాలికలకు ఆదపలు ఎదురైనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు శారీరకంగా దృఢంగా మారుతారు. మానసికంగానూ బలవంతులయ్యే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం తక్షణం యుద్ధ విద్య తరగతులకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఈ ప్రత్యేక తరగతుల ద్వారా పదివేల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మూడు నెలల కాలంలో ప్రతివారం రెండు తరగతుల చొప్పున విద్యార్థులకు యుద్ధ విద్యలపై తరగతులను నిర్వహిస్తారు. జిల్లాలో వచ్చే వారంలో యుద్ధ విద్య తరగతులను ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే డీఈవో గోవిందరాజులు అన్ని మండలాల విద్యాశాఖాధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహిళలు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో రాణిస్తూ ఉన్నత స్థానంలో ఉంటున్నారు. అయితే ఇతరుల నుంచి దాడులు ఎదురైనప్పుడు ప్రతిఘటించలేకపోతున్నారు.

దీని వల్ల ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపట్టినా, చట్టాలు అమలు చేసినా ఆశించిన స్థాయిలో మహిళలపై అఘాయిత్యాలను నివారించలేక పోవడం జరుగుతుంది. మహిళలు శారీరకంగా, మానసిక ైస్థెర్యం పెంపొందుతే ఇలాంటి దాడులను సమర్ధంగా తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే బాలికలకు ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్య ప్రాధాన్యతను గుర్తించి అమలు చేయనుండడం గొప్ప పరిణామం. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 48 పాఠశాలలో వచ్చే నెల ప్రారంభంకాబోతున్న శిక్షణ తరగతుల కోసం ఈ వారంలో శిక్షకులను నియమించేందుకు మండల విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శిక్షకులను ఎంపిక చేసిన వెంటనే యుద్ధ విద్య తరగతులు ప్రారంభం కానున్నాయి.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...