వట్టెం నిర్వాసితులకు గట్టి ప్యాకేజీ


Fri,November 15, 2019 03:45 AM

-ఐదు తండాల గిరిజనులకు లబ్ధి
-రూ.53.23కోట్ల పరిహారం
-397మందికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు : రూ.20కోట్లు
-18 ఏండ్లు దాటిన యువత 69మందికి : రూ.3.45కోట్లు
-250 కుటుంబాలకు రూ.29.77కోట్లు
- 66 ఎకరాల్లో 466మందికి ఒకేచోట ఇండ్ల స్థలాలు
- సీఎం కేసీఆర్‌కు నిర్వాసితుల కృతజ్ఞతలు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజవకర్గం వట్టెంలో 16టీఎంసీల సామర్థ్యంలో వెంకటాద్రి రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోంది. బిజినేపల్లి మండలంలోని ఆనెకాన్‌పల్లి, ఆనెకాన్‌పల్లితండా, కారుకొండ తండా, రాంరెడ్డిపల్లి తండా, తిమ్మాజిపేట మండలంలోని గట్టుతండాలో దాదాపుగా 400వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ తండాలన్నీ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్నాయి. దీంతో గిరిజనులకు ప్రత్యామ్నాయంగా ఇం డ్లు, భూములు, ఇతర నిర్వాసిత ఏర్పాట్లను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పరిహారం పట్ల ఆయా తండాల గిరిజనుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దాదాపు రెండు నెలల పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు సైతం నిర్వహించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గిరిజనులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మల్లన్న సాగర్ తరహా పరిహారం ఇప్పించేందుకు హామీ ఇచ్చారు. గిరిజనుల కోరికను మన్నిస్తూ సీఎం కేసీఆర్ పరిహారం మంజూరుకు నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.53కోట్ల పరిహారంతో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు వెలువరించారు. దీని ప్రకారం పళ్లైన కుటుంబాలకు రూ.7.50లక్షలతో పాటుగా డబల్ బెడ్రూం ఇండ్లకు రూ.5.04లక్షలు, 250గజాల స్థలం మంజూరు చేయడం జరిగింది.

గతంలో డబల్ బెడ్రూం ఇండ్లు ప్రకటించలేదు. ఇక ముఖ్యంగా 18ఏళ్లు నిండిన పెళ్లి కాని యువతకు ప్యాకేజీ ప్రకటించడం విశేషం. ఇలా ఆ ఐదు తండాల్లో దాదాపుగా 69మంది ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుండటం విశేషం. ఇలా మొత్తం రూ.3.45కోట్ల రానున్నాయి. ఇందులో భాగంగా 397మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించనున్నారు. దీనికోసం వట్టెం రిజర్వాయర్ కిందనే ఉన్న వట్టెం జవహార్ నవోదయ సమీపంలో 66ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో దాదాపుగా 466ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఆ ఐదు తండాల గిరిజనులందరికీ దాదాపు ఇక్కడే ఇండ్ల నిర్మాణం చేయనున్నారు. దీనివల్ల ఆ ఐదు తండాల స్థానంలో కొత్తగా త్వరలో ఒకే గ్రామం అవతరించే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ అక్కడి నిర్వాసిత గిరిజనుల్లో ఉత్సాహం నింపింది. సీఎం కేసీఆర్‌తో పాటుగా స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు ప్రకటించారు. బిజినేపల్లి మండల కేంద్రంలో గురువారం సీఎం, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వట్టెం నిర్వాసితులకు ఏడాదిలోగా కొత్తగా 397డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం కానున్నాయి.

ఎమ్మెల్యే మర్రి ఈ ఇండ్ల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ కాలనీలో ఇండ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్కూల్, ఆలయాలు, వీధి బల్బులు, సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథతో శుద్ధ జలంలాంటి ఆధునిక సౌకర్యాలున్న ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. వట్టెం రిజర్వాయర్ నిర్వాసితుల ఆందోళనలతో గత ఏడాదిన్నరగా పనుల్లో జరుగుతున్న జాప్యంలో ఇక స్తబ్దత వీడనుంది. ఈ భారీ ప్యాకేజీతో సంతోషంలో ఉన్న గిరిజనులు పనుల ప్రారంభానికి ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని తీర్మానించారు. శుక్రవారం ఆనెకాన్‌పల్లితండాలో ఎమ్మెల్యే మర్రికి, రెవెన్యూ అధికారులకు సన్మానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద మల్లన్న సాగర్ తరహా పరిహారం మంజూరు కావడంతో గిరిజనుల్లో పెల్లుబుకిన సంతోషం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పనుల వేగానికి బాటలు పర్చింది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...