మరింత పటిష్టంగా పట్టణ పాలన


Wed,November 13, 2019 02:42 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త మున్సిపల్‌ చట్టంలో ఎన్నికయ్యే కౌన్సిలర్లకు ప్రత్యామ్నాయ వ్యవస్థను కూడా తయారు చేసింది. వార్డు కమిటీలకు కీలక బాధ్యతలు అప్పగించి పరోక్షంగా ప్రజాప్రతినిధుల కాళ్లకు బంధాలు వేసే చర్యలు చట్టంలో పెట్టింది. మున్సిపల్‌ ఎన్నికలకు ముందే కీలకమైన వార్డు కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలంటూ మున్సిపల్‌ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సూచనా ప్రాయమైన ఆదేశాలు అందగా తొందరలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అచ్చంపేట, జడ్చర్ల మినహాయించి వనపర్తి, ఆత్మకూరు, పెబ్బేర్‌, కొత్తకోట, అమరచింత, నారాయణపేట, మక్తల్‌, కోస్గి, మహబూబ్‌నగర్‌, భూత్పూర్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, గద్వాల్‌, అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కొత్త మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌ 17, 30, 31 ప్రకారం వార్డు కమిటీల ఎన్నిక, విధులు, బాధ్యతలను పొందుపర్చింది. సెక్షన్‌ 7 ప్రకారం ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు ఎన్నిక చేయాల్సి ఉంటుంది. ఒక్కో కమిటీకి గరిష్టంగా 15 మంది సభ్యులు ఉంటారు. ఏడాది పదవీకాలం ఉంటుంది. ప్రతి డివిజన్‌కు యూత్‌, మహిళ, సీనియన్‌ సిటిజన్‌, ఇతర ప్రముఖులతో నాలుగు కమిటీలు ఉంటాయి. యూత్‌ కమిటీకి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులు, మహిళా కమిటీకి మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌ కమిటీలో 60 సంవత్సరాలపై బడిన వారు, ప్రముఖుల కమిటీలో రిటైర్డ్‌ ఉద్యోగులు, కార్మికులు, వార్డుల్లో పేరున్న వారు అర్హులుగా ఉంటారు. ఈ కమిటీల్లో కాలనీల అభివృద్ధి కమిటీలు, సామాజిక సంఘాలకు కూడా అవకాశం ఉంటుంది.

కమిటీలకు కీలకమైన బాధ్యతలు..
మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, వార్డుల వారు అనుకునే పనులకే నిధులు కేటాయింపజేసుకోవడం, ఇష్టానుసారంగా పనులు చేయించడం చేస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కౌన్సిలర్లకు మనరుగా మారింది. బున్యాది తవ్వారంటే, గోడలు కట్టారంటే అనుచరులను పంపించి వసూళ్లకు పాల్పడటం ఆనవాయితీగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో అన్ని అనుమతులు ఉన్నా కొందరు కౌన్సిలర్లకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉండేది. కనీసంగా రూ.10 వేల నుంచి రూ.లక్షల వరకు వసూళ్లు నిర్వహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంలో టౌన్‌ప్లానింగ్‌ శాఖలో పలు మార్పులను సూచించిన మున్సిపల్‌శాఖ నిర్మాణాలపై పర్యవేక్షణ బాధ్యతలను కమిటీలకే అప్పగించింది. పారిశుధ్యం, సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, మొక్కలు నాటడం, 85 శాతం మొక్కలను పరిరక్షించడం, మంచినీటి సరఫరా, పార్కులు, ఆట స్థలాలు, మార్కెట్‌ ప్రాంతాల నిర్వహణ, పన్నుల వసూళ్లకు సహకరించడం, వార్డుల పరిధిలో అనుమతిలేని నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించడంలో సంబంధిత శాఖతో కలిసి పని చేయడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేలా చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలను, క్రీడలను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. వీటిలో మున్సిపల్‌ చట్టం సెక్షన్‌ 31 (2)లో మరో కీలకమైన అధికారాన్ని కూడా అప్పగించారు. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించుకోవడంతో పాటు సమావేశంలోని చర్చల సారాంశాన్ని మున్సిపల్‌ కమిషనర్‌కు నివేదిస్తే కమిషనర్‌ తప్సనిసరిగ్గా మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశాల్లో ఎజెండాగా చేర్చాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌ ముందా.. తరువాత..
జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలకు ముందే వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ నిర్వహించేలా సూచనా ప్రాయమైన ఆదేశాలు అందాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన డీఎంఏ ఆదేశాల మేరకు కమిషనర్లు ఇప్పటికే అని విధాలుగా సంసిద్ధమవుతున్నారు. నిబంధనల మేరకు మున్సిపల్‌ ఎన్నికల ముందా లేక తరువాత అనే విషయంపై స్పష్టత రాగానే ప్రక్రియను ప్రారంభించేలా అధికారులు సమాయత్తమై ఉన్నారు. ఈ కమిటీలకు ఆధార్‌ కార్డులు, ఓటర్‌ ఐడీ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా కమిటీల్లో ఉండే బాధ్యతలు, ప్రాధాన్యతల విషయంలో ప్రచారం లేకపోవడంతో ఎవ్వరికీ ఈ విషయాలు తెలియకుండా పోతున్నాయి. ఒక్కో వార్డుకు 4 కమిటీలు అంటే ఒక వార్డుకు 60 మంది కమిటీ సభ్యులు ఉంటారు. పది వార్డులు కల్గిన మున్సిపాలిటీల్లో 600 మంది వార్డు కమిటీ సభ్యులకు అవకాశం ఉంటుంది. ఒక్కొ వార్డులో వివిధ విభాగాల నుంచి 60 మంది వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సూచనా ప్రాయమైన ఆదేశాలు అందినప్పటికీ స్పష్టమైన ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. స్పష్టత రాగానే ప్రజా ప్రతినిధులకు ప్రత్యామ్నాయంగా ఉండేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలి.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...