విలీన గ్రామాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్‌


Wed,November 6, 2019 02:04 AM

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాల్టీల్లో విలీనమైన గ్రామాల్లో పురపాలక శాఖ భూ క్రమబద్ధీకరణకు నిర్ణయించింది. దీంతో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి మున్సిపాల్టీల్లోని విలీనమైన గ్రామ పంచాయతీల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. జిల్లాలో నాలుగు మున్సిపాల్టీలు ఉండగా అచ్చంపేట, కొల్లాపూర్‌లో గ్రామాలు గతంలో విలీనమైనా ఆ తర్వాత ప్రజల అభ్యంతరాలతో నిలిపివేశారు. దీనివల్ల కేవలం ఆయా పట్టణ కేంద్రాలు మాత్రమే పురపాలికలుగా ఉన్నాయి. అయితే నాగర్‌కర్నూల్‌లో ఉయ్యాలవాడ, ఎండబెట్ల, దేశిటిక్యాల, నాగనూలుతో పాటు అనుబంధ నెల్లికొండ గ్రామాలు జిల్లా కేంద్రంలో విలీనమయ్యాయి. అదే విధంగా కల్వకుర్తి పురపాలికలో కొడ్ర తండా, తిమ్మరాసిపల్లి, సంజాపూర్‌ గ్రామాల్లో ఇప్పటి వరకు లే ఔట్లు లేని స్థలాలతో పాటుగా ఇదివరకే ప్లాట్లు కొన్న వ్యక్తులు సైతం తమ భూములను అధికారికంగా మున్సిపాల్టీల్లో నమోదు చేయించుకోవచ్చు. కల్వకుర్తి పట్టణంతో పాటు శివారులో కలిసిన గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగింది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌లో విలీన గ్రామాలు కేంద్రంగా పెద్ద ఎత్తున రియల్‌ వెంచర్లు వెలిశాయి.

చాలా లే అవుట్లు గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు కొందరు సరైన రిజిస్ట్రేషన్లు లేకుండా నిర్వహించారు. దీంతో పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు, ఉద్యోగస్తులు సైతం పెద్ద ఎత్తున ప్లాట్లను కొనుగోలు చేశారు. దీనికితోడు ఇటీవల నాగర్‌కర్నూల్‌ మున్సిపాల్టీలో విలీనం కావడంతో ఈ గ్రామాల్లోని స్థలాలు, ప్లాట్లకు ఊహించని ధరలు పెరిగాయి. విలీన గ్రామాల్లోని ఆఖరు వరుస ప్లాట్లకు సైతం గజానికి రూ.5వేలకుపైనే చేరుకోవడం గమనార్హం. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని స్థలాలు, ప్లాట్లు ఇప్పటికే విక్రయాలు పూర్తయ్యాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు విలీన గ్రామాల్లో గతంలోనే కొన్న భూములకు సరైన రిజిస్ట్రేషన్లు లేకుండానే లే అవుట్లు చేసి ప్లాట్లను విక్రయించారు. దీంతో ఇది తెలియక తక్కువ ధరకే ప్లాట్లు వచ్చాయని సంబురపడ్డ ప్రజలకు ఆ తర్వాత బ్యాంక్‌ లోన్ల సమయంలో అసలు విషయం తెలిసి వచ్చి ఆందోళన చెందుతున్నారు. ప్లాట్లు విక్రయించిన వ్యక్తులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో గత రెండేళ్లుగా ఈ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రజలకు పురపాలిక శాఖ ప్లాట్ల క్రమబద్ధీకరణకు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం ఆనందం కలిగించింది. దీనిప్రకారం గత 1985సంవత్సరం నుంచి 2018, మార్చి 30వతేదీ వరకు ఆయా భూములను ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తులకే ఈ క్రమబద్ధీకరణలో అవకాశం ఉంటుంది. కాగా ఈ కాలంలో వేలాది మంది ప్రజలు ఆయా గ్రామాల్లో ప్లాట్లను కొనుగోలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులకు ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ గొప్ప ఊరట ఇవ్వనుంది.

ఇదీ విధానం
విలీన గ్రామాల్లోని ప్రజలు ముందుగా తమ ప్లాట్లను, భూములను మున్సిపాల్టీల్లో నమోదు చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం ముందస్తుగా రూ.10వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆయా భూముల విలువను బట్టి మున్సిపల్‌ అధికారులు సూచించే ఫీజును ఆ తర్వాత ఆరు నెలల కాలంలో మున్సిపాల్టీల్లో జమ చేయాలి. దరఖాస్తుదారులు యాజమాన్య పత్రాలు, గెజిటెడ్‌ సంతకంతో కూడిన లింకు డాక్యుమెంట్లు జత చేయాలి. అలాగే ఇటీవలి ఇసి, మార్కెట్‌ ధర కాపీలు సమర్పించాలి. నోటరైజుడ్‌ ఇండెమినిటీ బాండ్‌, రోడ్డు వెడల్పు చేయడం కోసం అంగీకరిస్తూ అవసరమైన సందర్భంలో ఆయా స్థలాలను మున్సిపాల్టీకి స్థలం అప్పగించేందుకు సంబంధించిన అండర్‌టేకింగ్‌ పత్రాన్ని కూడా అందజేయాల్సి ఉంటుంది. ఇందులో స్థల యజమాని, లైసెన్సుడు సర్వేయర్‌ సంతకాలతో కూడిన ప్లాన్లను కలిపి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇందులో స్థలం ఫోటో, లే అవుట్‌ ప్లాట్‌ నక్షా కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా విలీన గ్రామాల్లో అక్రమ లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్‌ అధికారులు ఆయా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...