యధావిధిగా ప్రయాణాలు


Mon,October 21, 2019 01:39 AM

-అదనంగా సిబ్బందిని నియమించేందుకు చర్యలు
-రోడెక్కిన 130 బస్సులు, 56 హెయిర్ బస్సులు
-స్కూల్ బస్సులు 4, టూరిస్టులు 4, ట్యాక్సీలు 150
-జిల్లా వ్యాప్తంగా గమ్యానికి 80 వేల ప్రయాణికుల
- పాఠశాలల ప్రారంభంతో ప్రత్యేక చర్యలు

నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెచేపట్టి రెండు వారాలు మించినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చ ర్యలు తీసుకుంటుంది. ఆదివారం కావడంతో ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా 80 వేల మంది ప్రయాణికులు ప్రయాణాన్ని కొనసాగించారు. సమ్మెలో భాగంగా శనివారం బంద్ చేపట్టడంతో గ్రామీణ ప్రాంతాలకు నడపాలనుకున్న బస్సులను నడవలేదు. కేవలం ప్రైవేట్ వాహనాల్లోనూ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. సోమవారం నుంచి పాఠశాలలను పున:ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులను నడిపించి పాఠశాలలు, కళాశాలలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రూట్లలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఎక్కువగా ఉన్నారనే విషయాలపై ఇప్పటికే అధికారులు అంచనాలు వేసి ఆయా రూట్లలో బస్సులను పంపింపించనున్నారు. సోమవారం పల్లెల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అదేవిధంగా పల్లెలకు వెళ్ళే ప్రైవేట్ స్కూల్, కళాశాలల బస్సుల్లోనే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పిల్లలను నాగర్‌కర్నూల్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బస్సులను నడిపించాలంటే మరింత మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు సోమవారం జిల్లా వ్యాప్తంగా కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి డిపోల పరిధిలో మరింత మంది సిబ్బందిని నియమించి బస్సులను నడిపించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని ఆయా డిపోల పరిధిలో ప్రైవేట్ సిబ్బందిని విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. సమస్యల పరిష్కారానికై ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు చేపట్టిన నిరసనలు ఆదివారం సైతం కొనసాగించారు. జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల నాయకులు ధర్నా, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు.

జిల్లాలో 344 బస్సులు యథాతథం
జిల్లా వ్యాప్తంగా నాలుగు డిపోల పరిధిలో ఆదివారం యథాతదంగా 344 వాహనాలను నడిపించారు అధికారులు. పెద్దగా రద్దీ లేకపోయినా 130 ఆర్టీసీ బస్సులను నడిపించారు. రోజు మాదిరిగానే 56 హెయిర్ బస్సులు, 150 ట్యాక్సీలు, నాలుగు స్కూల్ బస్సులు, నాలుగు టూరిస్టులను నడిపించి ప్రయాణికులను తమ గమ్యస్ధానాలను చేర్చారు. డిపోలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, పోలీస్ అధికారుల పర్యవేక్షణలోనే నడిపిస్తూ ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్విహించగా, వారికి వామపక్ష పార్టీల నాయకుల, ఉపాధ్యాయ సంఘాలు, ఆయా పార్టీల నాయకులు మద్ధతు ధర్నాలు, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు.

కొనసాగిన సమ్మె..
ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారం యథావిధిగా కొనసాగింది. వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో, బస్టాండ్ సమీపంలో ధర్నా, మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా సమ్మె చేపట్టి మూడు వారాలు కావస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు వద్ద చేపట్టిన దీక్షలను ఉద్యోగ, కార్మికులు యథావిధిగా కొనసాగించారు. పలువురు మహిళా ఉద్యోగులు దీక్షలో పాల్గొని నిరసన తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...