ఇస్మార్ట్ గురూ


Sun,October 20, 2019 04:44 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: ప్రజా సమస్యలు వెలుగులోకి తేవాలంటే పత్రికా జర్నలిస్టో.. ఛానల్ రిపోర్టరో కానక్కర్లేదు.. సామాజిక స్పృహ, స్పందించే తత్వం ఉండి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఎంతో సులువుగా మన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రపంచానికి తెలుపవచ్చు. అలా కొందరు షోషల్ జర్నలిస్టుల అవతారం ఎత్తోచ్చు, ఎక్కడేం జరిగినా క్షణాల్లో వార్తలను చేరవేస్తున్నారు. ఓ ఫొటో కొట్టి సమస్యను నాలుగు పదాలతో పోస్టుచేసి అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. అవసరమైతే నేరుగా అధికారులకు, ప్రజాప్రతినిధుల అకౌంట్లకు షేర్ చేస్తున్నారు. ఇలా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ నయా జర్నలిస్టులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియా అంటే కేవలం వినోదాత్మక మాధ్యమమే కాదు. నేడు ప్రజా సమస్యల పరిష్కారానికో వేదిక. అందుకే ఇప్పుడు ఎంతోమంది సోషల్ జర్నలిస్టులు పుట్టుకొస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమపని తాము చేసుకుంటూనే సామాజిక మాధ్యమాల్లో నయా రిపోర్టింగ్ చేస్తున్నారు. సామాజిక స్పృహ, చుట్టూ పరిస్థితులపై అవగాహనతో ఎక్కడ ఏ సమస్య కనిపించినా వెంటనే స్పందిస్తున్నారు. చేతిలోని ఫోన్‌తో ఓ ఫొటో కొట్టి ఆ వెంటనే ఫేస్‌బుక్‌లోనూ, వాట్సప్‌లోనూ, ట్విట్టర్‌లోనూ పోస్టులు పెడుతున్నారు. అవసరమైతే ఏ అధికారికో, ప్రజాప్రతినిధికో పదేపదే షేర్ చేస్తున్నారు. మరి కొందరైతే అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఇంకొందరైతే అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ఖరీదైన వైద్య చికిత్స చేయిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. మరి కొందరేమో కాలనీల పేర, గ్రామాల పేర, పట్టణాల పేర గ్రూపులను ఏర్పాటు చేసి వాటిలో నిత్యం వివిధ సమస్యపై పోస్టులు పెడుతూ ప్రజల్ని మేలుకొలుపుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి మార్గనిర్ధేశం చేస్తూ గ్రూపుల్లో నిత్యం వార్తల సమాహారాన్ని మోగిస్తున్నారు.

అందరూ మేలుకోసమే..
సోషల్ మీడియాలో విద్యార్థులు, యువకుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దాకా ప్రతిఒక్కరూ ఉంటున్నారు. కొందరు ప్రజాసమస్యలపైనా, మరికొందరు సేవా కార్యక్రమాలపైనా దృష్టి సారిస్తుండగా ఇంకొందరు చైతన్యం, మార్పులను ఆశిస్తూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధితో పాటు జనాలకి ఉపయోగపడే సమాచారం చేరవేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజా సమస్యలను తెరపైకి తెస్తున్నారు. గతుకుల రోడ్లు, నత్తనడకన అభివృద్ధి పనులు, అధ్వానపు డ్రెయినేజీలు, వీధుల్లో వెలగని వీధి దీపాలు, తొలగని చెత్త కుప్పులు, కలుషిత తాగునీరు, విద్య, వైద్యంతో పాటు ఎన్నెన్నో సమస్యలు వివాదాలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తున్నారు.

గ్రూపులు, ప్రత్యేక పేజీలు
ఒకే తరహా ఆలోచనలు, లక్ష్యాలు కలిగిన వారంతా ఫేస్‌బుక్, వాట్సప్ వేదికగా గ్రూపులు, పేజీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిలో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ కలిసి వచ్చే వారిని యాడ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రోజువారీ తమ పనుల్లో బిజీగా ఉంటున్నా వాటికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. నమస్తే ఆత్మకూరు, తాజా వార్తలు, నిరుపేదలకు సహాయం, స్పాట్ న్యూస్, జనతాగ్యారేజ్, రాజకీయ ఐ క్యవేదిక, యువసేన, మిత్ర మండలి, ఫర్ యూ, సేవామార్గం, మీకోసం మేము లాంటి ఎన్నో గ్రూపులతో సేవలందిస్తున్నారు. ఇంకా ప్రభుత్వ పథకాల పేర్లతో, గ్రామాల పేర్లతో, పార్టీల పేర్లతో, సంఘాల పేర్లతో, కులాల పేర్లతో, ఉద్యోగ, ఉపాధ్యాయల సంఘాల పేర్లతో, నాయకుల పేర్లతో గ్రూపులు, పేజీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...