భూసేకరణ పూర్తి చేయాలి


Fri,October 18, 2019 11:58 PM

-డీ-82 ద్వారా అచ్చంపేటకు నీరందాలి
-జొన్నలబొగుడ రిజర్వాయర్ ఎత్తు పెంచాలి
-నూతన రిజర్వాయర్ల టెండర్ ప్రక్రియను చేపట్టాలి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
-హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో ఎంజీకేఎల్‌ఐ పథకంపై సమీక్ష
-హాజరైన ఎమ్మెల్యేలు గువ్వల, జైపాల్‌యాదవ్

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఎంపిక చేసిన నూతన రిజర్వాయర్లకు టెండర్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. యాసంగి పంటల అనంతరం మిగిలిన భూసేకరణ పనులను పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. డీ-82 కాలువ ద్వారా అచ్చంపేటకు సాగునీరందించాలని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి సాగునీటి అధికారులతో సాగునీటి వినియోగం.. ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎంజీకేఎల్‌ఐ కింద రిజర్వాయర్లను నిర్మించేందుకు సర్వే చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎంజీకేఎల్‌ఐ పథకంలో కేవలం మూడు రిజర్వాయర్లను మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం కొత్త రిజర్వాయర్లకు సర్వే చేయించిందని పేర్కొన్నారు.

ఈ వాటికి వేగంగా టెండర్ల ప్రక్రియను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే, ఎంజీకేఎల్‌ఐ పరిధిలో ఇంకా మిగిలిన భూసేకరణ పనులను ఈ యాసంగి పంటల అనంతరం పూర్తి చేయాలని పేర్కొన్నారు. అచ్చంపేటకు డీ-82 కాలువ ద్వారా సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుకోవాలని, లింగాల సమీపంలో మిగిలిన కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. వంగూరు మండల పరిధిలోని గ్రామాలకు కూడా సాగునీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్యాకేజీ 29, 30లలో మిగిలిన కాలువల పనులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెదకొత్తపల్లి మండల పరిధిలోని ఎంజీకేఎల్‌ఐ 2 లిఫ్టు జొన్నలబొగడలో ఉందని, అక్కడి జొన్నలబొగుడ రిజర్వాయర్ ఎత్తును పెంచాలని మంత్రి చెప్పారు. అలాగే వనపర్తి పరిధిలోని బుద్ధారం కుడి, ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, డిస్ట్రీబ్యూటరి కాలువల పనులను ప్రారంభించాలని చెప్పారు.

బుద్ధారం ఎడమ కాలువను రాజాపేట వరకు పొడిగించాలని మంత్రి చెప్పారు. డీ-5 కాలువను వెడల్పు చేసి ఏదుల రిజర్వాయర్‌ను నింపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్దగూడెం పరిధిలోని ఖాన్ చెరువును నీళ్లిచ్చే ఎంజే 4 కాలువ పనులు పూర్తి చేయాలని, ఎంజే 3 కాలువను శ్రీనివాసాపూర్ వరకు కొనసాగించి వనపర్తి ఈదుల చెరువుకు నీరందించాల్సి ఉందని మంత్రి చెప్పారు. సాగునీటి కాలువలను తెంపినా.. నీటిని వృథా చేసినా సహించేదిలేదని మంత్రి హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలైనా సరే కాలువలకు నష్టం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వీటిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు. కాగా, సమీక్షలో పాల్గొన్న అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్‌లు తమ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరందించాలని కోరారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, సీఈ విజయకరణ్ రెడ్డి, ఎస్‌ఈ అంజయ్య, ఈఈలు రమేశ్, సంజీవరావ్, డీఈ చంద్రునాయక్, సత్యనారయణ గౌడ్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...