నిషేధిత మావోయిస్టు పార్టీకి కొరియర్‌గా వ్యవహరిస్తున్న ఇద్దరి అరెస్టు


Thu,October 17, 2019 02:21 AM

గద్వాల క్రైం : నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి కొరియర్‌గా వ్యవహరిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్యం, డాక్యు మెంట్స్, పెన్‌డ్రైవ్, మెమొరీ కార్డు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు తెలిపారు. గద్వాల ప్రాంతంలో గత కొంత కాలంగా నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు మద్దతు నిస్తూ ప్రభుత్వ నిషేధిత సంస్థలను ఏర్పాటు చేసుకొని రహస్యంగా యువత, విద్యార్థులను మావోయిస్టు పార్టీ వైపు ఆసక్తి చూపేలా వ్యవహరిస్తున్న వారి వివరాలను సేకరించినట్లు ఆమె తెలిపారు. ఏఎస్పీ కృష్ణతో కలిసి గద్వాలలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ మాట్లాడారు.

గద్వాల ప్రాంతంలో గత కొంత కాలంగా మావో యిస్టు సానుభూతిపరులు తిష్టవేసి యువతను మావో యిస్టు పార్టీ వైపు మరల్చేందుకు రహస్యంగా సమావేశాలు, నిధుల సేకరణ, నియామకాలపై దృష్టి పెట్టినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింద న్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన గద్వాల శివారులోని మేలచెర్వు రోడ్డు వద్ద గద్వాల టౌన్ ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నాడన్నారు. అదే సమయంలో మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన పులిగ నాగరాజు పోలీసులను చూసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడన్నారు. ఇది గమనించిన పోలీసులు రెప్పపాటులో నాగరాజుపై అనుమానం వచ్చి అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారన్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు నాగరాజు వేసుకున్న బ్యాగును పరిశీలించగా అందులో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి సంబంధించినవి, ప్రభుత్వ వ్యతిరేక విప్లవ సాహిత్య పుస్తకాలు లభించాయన్నారు. ఇంకా లోతుగా పోలీసులు నాగరాజును విచారించి తెలంగాణ విద్యార్థి వేదిక అనే నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి సంబం ధించిన ప్రభుత్వ వ్యతిరేక అనుబంధ సంస్థలో పని చేస్తూ, టీవీవీ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నట్టు గుర్తించామన్నారు.

అయితే నాగరాజుతో పాటు ఇతనికి పరిచయం ఉన్న టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు మద్దిలేటి (అంబేద్కర్ నగర్, మక్తల్, నారాయణపేట జిల్లా), రాష్ట్ర కమిటీ సభ్యుడు వైనమోని బలరాం (వెంకటేశ్వర వీధి, పెబ్బేరు, వనపర్తి జిల్లా), స్టూడెంట్ మార్చ్ మాస పత్రిక ఎడిటర్ కాంతి జగన్ (కేతిరెడ్డిపల్లి గ్రామం, బాచన్నపేట్ మండలం, జనగాం జిల్లా), సీఎంఎస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ చుక్కల శిల్ప (చక్రిపురం, ఈసీఐఎల్, మేడ్చల్ జిల్లా), చైతన్య మహిళా సంఘం రాష్ట్ర సభ్యురాలు గుంత రేణుక (పార్చర్ల గ్రామం, ధరూర్ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా), తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనరల్ సెక్రటరీ మెంచు రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలు కూడా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు మద్దతిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో నిషేధిత పార్టీ వ్యవహారాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఎనిమిది మందిపై గద్వాల టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్టు ఇన్‌చార్జి ఎస్పీ వెల్లడించారు.

వీరిలో ఇప్పటికే పులిగ నాగరాజు, వైనమోని బలరాం, కాంతి జగన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. బండారి మద్దిలేటి, నలమాస కృష్ణలను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదవగా ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇంకా చుక్కల శిల్ప, గుంత రేణుక, మెంచు రమేశ్‌లు పరారీలో ఉన్నట్టు ఆమె తెలిపారు. వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కీలకమైన ఆధారాలతో అరస్టైన నిందితుల నుంచి మావోయిస్టు విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, సర్క్యులర్లు, డాక్యుమెంట్లు, విధ్వేష పూరిత సాహిత్యం, పెన్ డ్రైవ్, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడినా, ఉసిగొల్పినా ఎట్టి పరిస్థితుల్లో ఊరు కునేది లేదని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు ఈ సందర్భంగా హెచ్చరించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...