రవాణా వ్యవస్థకు పకడ్బందీ చర్యలు


Tue,October 15, 2019 02:26 AM

నాగర్‌కర్నూల్ టౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు అధికారులు పకడ్భంధీ చర్యలు తీసుకొని ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడపాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చార్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, టికెట్ ధరకంటే ఎక్కువ తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి తిరిగి పున:ప్రారంభం కానున్న పాఠశాలల విద్యార్థులకు ఉద్యోగస్తులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో కలిసి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో, ఆర్టీసీ డివిజనల్ అధికారులు, మేనేజర్లతో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకు అనుగుణంగా బస్సులు నడిపిస్తున్నామన్నారు. కొన్ని చోట్ల టికెట్ ధరకంటే ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్ కంటే ఒక్కరూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి బస్సు ఆయా రూట్లలో ఉండే చార్జీల పట్టికను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రతి డిపోలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్‌శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలని చెప్పారు. బస్సులో డ్రైవర్‌సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్‌రూమ్‌ల నెంబర్లను కూడా ప్రదర్శించాలని సూచించారు.

అదేవిధంగా ఈనెల 21 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండడంతో షెడ్యూల్ ప్రకారం బస్సులను నడిపించేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ బస్సులన్నింటా బస్‌పాస్‌లను యథావిధిగా అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్‌పాసులన్నీ అనుమతించాలని, పాసులు అనుమతించడం లేదనే ఫిర్యాదులు రావద్దని మంత్రి ఆదేశించారు. పదిరోజులుగా ఆర్టీసీ ప్రైవేట్ బస్సులతోపాటు వివిధ వాహనాలను నడిపించి ప్రయాణికులను గమ్యస్థ్ధానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందు లు ఎదురవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక సర్వీసుల సేవలను తాత్కాలిక పద్ధతిన మెకానిక్‌లను ఇతర శాఖల్లో పనిచేస్తున్న డ్రైవర్లను డిప్యూటేషన్ ద్వారా తీసుకోవాలని సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. సమ్మె కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రవాణా సదుపాయాలను ఏర్పటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. వీసీలో జిల్లా ఎస్పీ సాయిశేఖర్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అడిషినల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఆర్డీవో ఎర్రిస్వామి, డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...