లక్ష్యం 27 లక్షల టన్నులు


Sun,October 13, 2019 12:08 AM

- జిల్లాలో 29 ధాన్యం కేంద్రాలు
- నవంబర్‌లో కొనుగోళ్లు ప్రారంభం
- గ్రేడ్‌-ఏ రకం క్వింటాల్‌కు రూ.1,835
- రెండో గ్రేడ్‌కు రూ.1,815

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో నవంబర్‌ నుంచి ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ముందస్తు సన్నాహాలు చేస్తున్నది. వ్యవసాయ శాఖ సాధారణ సాగు అంచనాకు మించి వాస్తవికంగా పంటలను పండించిన పంట ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలతో వరి పంట సాగు చేసిన రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

29 కొనుగోలు కేంద్రాలు
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో రైతులు వరి పంటను సాగు చేశారు. ముఖ్యంగా కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌తో పాటు కల్వకుర్తి మండలంలోనూ వరి పంటను అధికంగా పండించారు. జిల్లాలో ఎంజీకేఎల్‌ఐ ద్వారా నీటి వనరుల లభ్యత పెరిగింది. గత ఐదేండ్లుగా ఎంజీకేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి చెరువులను నింపుతూ పొలాలకు నీళ్లను మళ్లిస్తున్నారు. భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో చెరువులు, బోర్ల ద్వారా జిల్లాలో ఐదేండ్లుగా వరి సాగు గణనీయంగా పెరుగుతున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ ఖరీఫ్‌లోనూ వరి సాధారణసాగు 11,089హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, దీనికి భిన్నంగా దాదాపు 7వేల హెక్టార్లు అదనంగా 18,375 హెక్టార్లలో వరి సాగు జరగడం గమనార్హం. వరి పంట అధిక శాతం పండించడంతో మార్కెటింగ్‌ కోసం ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ముందస్తు చర్యలకు ఆదేశించింది. దీని ఆధారంగా జిల్లాలోనూ అధికారులు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మండలాల్లోని దాదాపు 29 సంఘాల సహకారంతో కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఇందుకోసం వరి ధాన్యాన్ని రెండు గ్రేడులుగా విభజించడం జరిగింది. క్వింటాల్‌ ఏ గ్రేడ్‌కు రూ.1,835ను చెల్లించనున్నారు.

రెండో గ్రేడ్‌కు రూ.1,815 చొప్పున రైతులకు మద్దతు ధర చెల్లించనున్నారు. రైతుల నుంచి ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. దీంతో రైతులకు న్యాయమైన మద్దతు ధర అందే అవకాశం ఉంది. 2016 సంవత్సరం యాసంగిలో 7796 హెక్టార్ల సాధారణ సాగుకు 9321హెక్టార్ల సాగు జరిగింది. 2017 వానాకాలంలో 10847హెక్టార్లకు 8272 హెక్టార్లు, యాసంగిలో 10,012హెక్టార్లకు 16,577 హెక్టార్లు, 2018 వానాకాలంలో 10216 హెక్టార్లకు గాను 15,791హెక్టార్లు, యాసంగిలో 11,923హెక్టార్లకు 11,445 హెక్టార్ట పంట సాగయ్యింది. ప్రస్తుత వానాకాలంలో 11,089హెక్టర్లకు 18,375హెక్టార్లలో వరి సాగైంది. జిల్లాలో మొత్తం పంటల సాధారణ సాగు 2,16,703 హెక్టార్లు ఉండగా, 89.34శాతంతో వాస్తవికంగా 1,93,599 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో పత్తి 1,06,728 హెక్టార్లకు 1,23,055 (115శాతం), జొన్న 3,873 హెక్టార్లకు 4,470 హెక్టార్లు (115.40శాతం), మొక్కజొన్న సాధారణ సాగు 75,134 కాగా,కేవలం 42శాతంతో 31,930హెక్టార్లలో సాగైంది.అధికారుల లెక్కల ప్రకారం 27, 80,031మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. పెద్దఎత్తున మార్కెట్‌ యార్డులకు ధా న్యం వస్తుందని భావించిన అధికారులు కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ కేంద్రాలు నవంబర్‌ రెండో వారం నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నారు. మొత్తం మీద అధికారుల చర్యల పట్ల రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ధాన్యం విక్రయానికి చర్యలు
జిల్లాలో ఈ సంవత్సరం అధిక శాతం వరి సాగు జరిగింది. దీనివల్ల 27లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నాం. ధాన్యం విక్రయం కోసం రైతులు ఇబ్బందులకు గురికాకుండా జిల్లాలో 29కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వరి ధాన్యాన్ని రెండు గ్రేడులుగా విభజించి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. రైతులు తమ ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టి తీసుకొస్తే ఏ గ్రేడ్‌ కింద క్వింటాల్‌కు రూ.1,835చొప్పున చెల్లిస్తాం.
- బాలమణెమ్మ, మార్కెటింగ్‌ అధికారి

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...