యథావిధిగా బస్సులు


Sun,October 13, 2019 12:06 AM

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టినా ప్రయాణికులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. అధికారులు తీసుకుంటున్న చర్యలతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది. శనివారం జిల్లాలోని ఆయా రూట్లలో లక్ష మంది వరకు ప్రయాణికులు దాదాపుగా 423 వాహనాల్లో ప్రయాణించారు. ప్రజలు ఎలాంటి ప్రయాస లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు సైతం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుండటంతో జిల్లాలో నడుస్తున్న బస్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడలేదు.అయితే, పోలీసు శాఖ ముందస్తు చర్యగా బస్‌ డిపోలు, బస్టాండ్లతో పాటుగా జిల్లాలో గుర్తించిన 15 జంక్షన్ల వద్ద సీఐలు, ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రైవేట్‌ వాహనాలలోనూ ప్రజలు సజావుగా ప్రయాణం సాగిస్తున్నారు. జిల్లాలో 306 ఆర్టీసీ బస్సులు ఉండగా, ఇందులో 81 హైర్‌ బస్సులు ఉన్నాయి. అయితే, ఇందులో 225 ఆర్టీసీ బస్సులకు గాను శనివారం 184 ఆర్టీసీ బస్సులు, 81 హైర్‌ బస్సులు కలిపి 265 బస్సులు ప్రయాణికులను చేరవేశాయి. అలాగే, నాలుగు స్కూల్‌ బస్సులు, మరో నాలుగు క్యారేజ్‌ బస్సులకు తోడుగా 150 ట్యాక్సీలు శనివారం రోడ్లపై తిరిగాయి. ఆర్టీసీ సమ్మెకు ముందు కంటే అధికంగా 423 వాహనాలు శనివారం ఒక్కరోజే జిల్లాలో దాదాపు లక్ష మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేశాయి. ఇక విద్యా సంస్థలకు ప్రభుత్వం వారం రోజులపాటు సెలవులను పొడిగించింది. ఈనెల 19వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులను ఇవ్వడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిపై విద్యార్థుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం రాబోయే రోజుల్లో శాశ్వత చర్యలు తీసుకుంటుండటంతో ప్రజలు సైతం మద్దతు పలుకుతున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...