హోరాహోరీగా ఫుట్‌బాల్‌ పోటీలు


Sun,October 13, 2019 12:06 AM

వనపర్తి క్రీడలు : ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆడినప్పుడే ఉన్నతంగా ఎదుగుతారని వనపర్తి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడామైదానంలో ఎస్జీఎఫ్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 65 రాష్ట్ర స్థాయి అండర్‌-17 ఫుట్‌బాల్‌ బాలికల పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ పోటీలను మూడోరోజులో భాగంగా జిల్లా అథ్ల్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మయ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతున్న క్రీడాకారిణీలను పరిచయం చేసుకుని ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు ఉన్నత స్థాయిలో ఎదగాలంటే ఆత్మవిశ్వాసంతోపాటు పట్టుదల ఉండాలన్నారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్రీడల్లో మహబూబ్‌నగర్‌ జట్టు ప్రత్యేక స్థానంలో ఉటుందని పేర్కొన్నారు. ఈ ఫుట్‌బాల్‌ పోటీలలో జాతీయ స్థాయికి ఎంపికైన తెలంగాణ బాలికల జట్టు క్రీడాకారిణీలు మొదటి స్థానంలో నిలిచే విధంగా కృషిచేసి విజయం సాధించి జిల్లాతోపాటు రాష్ర్టానికి మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.

సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌ వివరాలు
65వ రాష్ట్ర స్థాయి అండర్‌-17 విభాగంలో అంతర్‌ జిల్లాల బాలికల ఫుట్‌బాల్‌ పోటీలలో భాగంగా మూడోరోజు సెమీ ఫైనల్‌లో నిజామాబాద్‌ జట్టుతో వరంగల్‌ జట్టుపై తలబడి 2గోల్స్‌ చేసి నిజామాబాద్‌ జట్టు గెలిచింది. అలాగే మహబూబ్‌నగర్‌ జట్టుతో రంగారెడ్డి జట్టు పోటీపడగా నిర్ణీత సమయంలో ఒకగోల్‌ తేడాతో మహబూబ్‌నగర్‌ జట్టు ఫైనల్‌ చేరింది. ఫైనల్‌ మ్యాచ్‌లో నిజామాబాద్‌ జట్టుతో మహబూబ్‌నగర్‌ జట్టు పోటీపడి ఒక గోల్‌తో నిజామాబాద్‌ జట్టు విజయం సాధించింది. ఈ పోటీలలో ప్రథమ స్థానంగా నిజామాబాద్‌ జట్టు, ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్‌ జట్టు నిలువగా.. తృతీయ స్థానంలో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఈ పోటీలలో గోల్‌ కీపర్‌గా మంచి ప్రతిభ కనబరిచిన అక్షిత, మణి, సుగుణకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి గణేశ్‌, పీఈటీలు తిరుపతయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మణ్యం, షబ్బీర్‌, ఆయా జిల్లాల ఫుట్‌బాల్‌ కోచ్‌లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిణిలు
ఈనెల 21, 27 తేదీల్లో రాజాస్థాన్‌లోని అజ్మీర్‌లో నిర్వహించనున్న 65వ జాతీయ స్థాయి ఎస్జీఎఫ్‌ ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారిణిలు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారిణిలు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రావణి, శివాణి, రస్మిక, సోనాలిక, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రక్షిత, మంగ, శైలజ, కృష్ణవేణి, వరంగల్‌ జిల్లాకు చెందిన లీసా, శ్వేత, రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్వీ, మౌనిక, నల్గొండ జిల్లాకు చెందిన అలే ఖ్య, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కావ్య, హైదరాబాద్‌ జిల్లాకు చెందిన పావని, ఖమ్మం జిల్లాకు చెందిన ఉషారాణి, మెదక్‌ జిల్లాకు చెందిన అంజలి, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన గౌరిదేవి, స్టాండింగ్‌ బై క్రీడాకారిణిలు ఖమ్మం జిల్లాకు చెందిన దివ్య, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సుజాత, రంగారెడ్డి జిల్లాకు చెందిన యాన, కరీంనగర్‌ జిల్లాకు చెందిన సౌమ్య, హైదరాబాద్‌ జిల్లాకు చెందిన హైమావతి ఎంపికయ్యారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...