శ్రీశైలానికి స్థిరంగా వరద


Thu,September 19, 2019 01:37 AM

-211 టీఎంసీలు.. 884 అడుగులు
-లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో

జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 1,24,000 క్యూసెక్కులు, అవుట్ ప్లో 1,18,034 క్యూసెక్కుల నమోదైంది. సోమవారం మూసివేసిన గేట్లు మంగళవారం అర్ధరాత్రి తెరిచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం నాటికి 9గేట్ల ద్వారా 70,113 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి పవర్‌హౌస్‌కు 43,107 క్యూసెక్కల నీటిని విడుదల చేసి 6 టర్బెన్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 1045 అడుగుల ఎత్తులో 9.657టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.22 అడుగుల ఎత్తులో 9.336 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 815 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,100 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 650 క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. వీటితోపాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో రెండు మోటార్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1 ద్వారా 1,300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 59,491 క్యూసెక్కులు కొనసాగుతుండటంతో అదేస్థాయిలో 59,491 క్యూస్కెల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలుండగా ప్రాజెక్ట్ అధికారులు నదిలో 128.19 టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 35,000 క్యూసెక్కులుండగా అవుట్ ఫ్లో 28,320 క్యూసెక్కులు నమోదైంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64టీఎంసీల నీటినిల్వ ఉండగా ప్రాజెక్ట్‌లో 37.46టీఎంసీల నీటిని నిల్వచేసుకొని వచ్చిన నీటిని వచ్చినట్టుగా నదిలోకి విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర డ్యాంకు స్థిరంగా..
అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతం నుంచి వరద తుంగభద్ర జలాశయానికి వచ్చి చేరుతోంది. బుధవారం తుంగభద్ర జలాశయానికి 21,279 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 21,063 క్యూసెక్కులు నమోదైంది. 5 స్పిల్‌వే గేట్ల ద్వారా 8,895 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నా రు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 100.855 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి గాను 1633 అడుగుల నీటి నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువన వానలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తోడు టీబీ డ్యాం నుంచి విడుదల అవుతున్న వరదతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి ప్రవాహం కొనసాగుతున్నది. టీబీ డ్యాం నుంచి 8,895 క్యూసెక్కుల వరద విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 15,860 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 18,840 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 610 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో 291 క్యూసెక్కులు ఆయకట్టుకు చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

సుంకేసులకు తగ్గుతున్న వరద
రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి బుధవారం సాయంత్రానికి 14,500 క్యూసెక్కుల వరద ఇన్‌ప్లో రాగా, మూడు గేట్లను తెరిచిన అధికారులు 13,300 క్యూసెక్కులు దిగువకు వదిలారు. కేసీ కెనాల్‌కు 1050 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

శ్రీశైలానికి స్థిరంగా ప్రవాహం
నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద స్థిరంగా వస్తోంది. జూరాల నుంచి రెండు రోజుల క్రితం తగ్గిన వరద బుధవారం నాటికి మరింత పెరిగింది. సాయంత్రం జూరాల నుంచి 70,113లక్షల క్యూసెక్కుల వరద, సుంకేసుల నుంచి 13,437 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,26,657 క్యూసెక్కుల నీళ్లు చేరుతున్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి మాత్రం కొనసాగుతోంది. అయితే ప్రాజెక్టు గేట్లు మాత్రం తెచుకునే స్థాయిలో నీళ్లు రావడం లేదు. ఇక కుడిగట్టు విద్యుత్ కేంద్రానికి 25,855 క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రానికి 40,259 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకి 2400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 8వేల క్యూసెక్కుల చొప్పున 78,540 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వెళ్తున్నాయి.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...