అసెంబ్లీలో పాలమూరు గళం..


Wed,September 18, 2019 01:40 AM

మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాకు చెందిన ప్రతిపక్ష కాంట్రాక్టర్ పనులు ఆలస్యం చేస్తూ అటు ప్రభుత్వానికి, ఇటు తనకు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. మూసాపేట మండలం వేముల నుంచి దేవరకద్ర వరకు మూడున్నర ఏళ్ల క్రితం రూ. 30 కోట్లతో టెండర్ అయిన డబుల్ రోడ్డు నిర్మాణంపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడారు. వేముల- దేవరకద్ర రోడ్డు నిర్మాణం పూర్తవ్వక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పనులు ప్రారంభిస్తారా.. లేక కాంట్రాక్ట్ రద్దు చేస్తారా అని తాను చేసిన ఫిర్యాదు తర్వాత పనులు ప్రారంభించినట్లుగా చేసి మళ్లీ ఆపేశారని తెలిపారు. హైదరాబాద్ నుంచి వేములకు వస్తున్న క్రమంలో రోడ్డు సరిగా లేక ఓ చిన్నారి ఆటో నుంచి పడిపోయి మృతి చెందిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిపక్షానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఈ పనులు చేస్తున్నారని... ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెచ్చేందుకే కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో పాటు భూత్‌పూర్ నుంచి మహబూబ్ నగర్‌కు వెళ్లే క్రమంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేదని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ అగ్రిమెంట్‌ను రద్దు అయినా చేయాలని లేదంటే త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకునాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే ఆవేదన అర్థం అయ్యిందని...ఆయన సమక్షంలోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...