యురేనియంపై శాశ్వత పరిష్కారం


Tue,September 17, 2019 02:55 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ: నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి నల్లమలకు శాశ్వత పరిష్కారం చూపించినట్లయిందని రైతు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహార్ అన్నారు. సోమవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా యురేనియం తవ్వకాలకు డీబిర్స్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంతో పదర, అమ్రాబాద్ మండలాల్లో బోర్లు వేసి శాంపిల్స్ సేకరించారని గుర్తు చేశారు. అప్పట్లో టీఆర్‌ఎస్ పార్టీ అడ్డుకొని నల్లమల ప్రజలకు అండగా నిలిచిందన్నారు. అనుమతులు ఇచ్చి బోర్లు వేయించిన కాంగ్రెస్ ఇప్పుడొచ్చి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు టీఆర్‌ఎస్ పార్టీపై రుద్దడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఉనికి చాటుకునేందుకు యురేనియాన్ని రాజకీయం చేయాలని చూస్తే అసలు రంగు బయటపడిందన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేయించేందుకు ప్రధానభూమిక వహించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎక్కడ గత్యంతరం లేక తన ఉనికి కోసం యురేనియం పేరుతో ప్రజల్లో లేనిపోని అపోహాలు సృష్టించి భయందోళన వాతావరణాన్ని పెంపొందించి పైశాచిక అనందాన్ని పొందారని అన్నారు. నల్లమల ప్రజలు స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారని అన్నారు. మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో యురేనియానికి వ్యతిరేకంగా తీర్మానం చేయించి కేంద్రానికి పంపడం ద్వారా నల్లమల ప్రజలు ఇక మనోధైర్యంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే పనితీరుపై ఈ ప్రాంత ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. మున్సిపల్ చైర్మన్ తులసీరాం మాట్లాడుతూ నల్లమల ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగించేలా తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. నల్లమల ప్రజల పక్షాన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విప్ గువ్వల, ఎంపీ రాములుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఎంపీపీ శాంతలోక్యనాయక్, జెడ్పీటీసీ మంత్రియా, మాజీ ఎంపీపీ పర్వతాలు, కౌన్సిలర్లు అంతటిశివ, బాల్‌రాజు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేష్‌రావు నాయకులు ఖలీల్, రహమత్, శంకర్, ఉస్సేన్, రాజు, తిర్పతియాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...