ఆదిలాబాద్‌లో తొలిసారి..వికసించిన కమలం


Fri,May 24, 2019 02:22 AM

-ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ కైవసం
-ఆ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు విజయం
-టీఆర్‌ఎస్ అభ్యర్థి నగేశ్‌పై 58,493 ఓట్ల ఆధిక్యత
-మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్
-సోయం గెలుపుతో బీజేపీ శ్రేణుల సంబురాలు

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని తొలి సారిగా బీజేపీ దక్కించుకుంది. ఇప్పటి వరకు పలుమార్లు ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినా.. తొలి సారి విజయం నమోదైంది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటి పరిధిలో 2079 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ లోక్‌సభ స్థానంలో 10,63,235 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు 3,77,194 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి గొడాం నగేశ్‌కు 3,18,701 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు 3,14,061 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు.. టీఆర్‌ఎస్ అభ్యర్థి గొడాం నగేశ్‌పై 58,493ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 11మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. కేవలం ముగ్గురు మధ్యలో పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి బాపురావు విజయం సాధించగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గొడాం నగేశ్ నిలిచారు. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ ఉండగా.. స్వతంత్ర అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

సిర్పూర్(టి), ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లు..
ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ, రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు అధిక ఓట్లను పొందారు. బోథ్, ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు అధికంగా ఓట్లు సాధించారు. సిర్పూర్(టి), ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎక్కువ సంఖ్యలో ఓట్లను సాధించింది. ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు 58,493 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలిచారు. ఇక వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్దగా ఓట్లను పొందలేకపోయారు. నోటాకు 13,031 ఓట్లు పడ్డాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా.. మిగతా ఎనిమిది మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించడంతో.. ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...