ఇక బడి బాట..


Tue,May 21, 2019 03:59 AM

నాగర్‌కర్నూల్‌రూరల్‌: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో తప్పకుండా జూన్‌1వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభించాలని డీఈవో ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 2న తెంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆయా పాఠశాలల్లో సన్మానించనున్నారు. పాఠశాలల పునః ప్రారంభం తర్వాత 1నుండి 10వ తరగతి వరకు పాఠశాలల్లో చదువుతున్న 69,172 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు పంపిణి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో ప్రస్తుతం పని చేస్తున్న 650 మంది విద్యా వలటీర్లను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలు మేరకు వారినే కొనసాగించాలని నిర్ణయించారు. సరిపోను విద్యా వలంటీర్లు లేని పక్షంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉంటుంది.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట..
జిల్లాలోని 824 పాఠశాలల్లో జూన్‌ 4నుంచి 12వ తేది వరకు ప్రొఫేసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెంచేలా చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాల గురించి ప్రచారం నిర్వహిస్తారు. ఇక్కడ అందిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి వివరిస్తారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బడిబాట కార్యక్రమాన్ని ఉదయం 7గంటలకు ప్రారంభించి 11 గంటలకు ముగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లోని సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రతి పాఠశాలలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 425 3525ను ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో పెట్టనున్నారు. ఇక బడిబాట కార్యక్రమంలో ఏ రోజు ఏం చేయాలనే వివరాలతో కూడిన ఆదేశాలను మండల, ప్రధానోపాధ్యాయులకు, విద్యాధికారులకు పంపించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందు కోసం జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారి చేశారు.

జూన్‌ 3వ తేదిలోగా బడిబాటకు సంబంధించి కార్యచరణ ప్రణాళికపై అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా అన్ని ఆవాస ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్రీధర్‌లు ఆదేశాలు జారీ చేశారు. బడిబాట కార్యక్రమంలో పాఠశాల ప్రగతికి సంబంధించిన కరపత్రాలు పంపిణి చేమనున్నారు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించి ప్రైవేట్‌ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తామని తెలియపరిచి, బడీడు పిల్లల్ని గుర్తించి బడిలో చేర్పించేందుకు కృషి చేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రత్యేకతలను వివరించి, రోజు వారి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు భాగస్వాములయ్యేలా చూస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించనున్నారు.

బడి బయటి పిల్లలు బడిలో చేర్పించడమే లక్ష్యం
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 386 మంది పిల్లలు ప్రస్తుతం బడి బయట ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వీరి తల్లి తండ్రులకు అవగాహన కలిగించి వారిని బడికి పంపించే ఏర్పాట్లు చేస్తారు. బాల కార్మికులకు విముక్తి కలిగించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజువారి బడిబాట కార్యక్రమ(నమోదైన విద్యార్థులు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు) వివరాలను మండల విద్యాధికారి ద్వారా జిల్లా బడిబాట డెస్క్‌కు ప్రతిరోజు మధ్యాహ్నం 3గంటల్లోగా తెలియజేయాలని ఆదేశించారు. బడిబాట కార్యక్రమాన్ని జూన్‌ 4న ప్రారంభించాకా జూన్‌ 7,10,11,12వ తేదిల్లో ఐదు రోజుల పాటు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ద్వారా పంపిణి చేస్తున్న హెల్త్‌, హైజిన్‌ కిట్ల గురించి వివరించడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరపత్రాల ద్వారా ప్రచారం చేసేందుకు ప్రతి పాఠశాలకు వెయ్యి రూపాయలు మంజూరు చేశారు. ఈ మేరకు కరపత్రాలు పంచుతూ ఆయా పాఠవాలల పరిధిలో ర్యాలీలు నిర్వహించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించి, బాలికలను కేజీబీవీల్లో చేర్పిస్తారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...