కృష్ణమ్మ గలగల !


Sat,May 18, 2019 05:56 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : కర్నాటక నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ గలగల చేస్తోంది. ఈ ప్రాజెక్టులోకి నీళ్లు చేరడంతో శుక్రవారం రామన్‌పాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. నీళ్లు లేక పూర్తిగా అడుగంటిపోయే దశలో ఉన్న రామన్‌పాడుకు జూరాల నుంచి నీటిని విడుదలతో మళ్లీ జలకళ సంతరించుకోనున్న ది. ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ఇన్‌ఫ్లో తో 0.445 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి జూరాలకు నీటి రాక ప్రారం భం కాగా.. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 0.445 టీఎంసీల మేర నీటి మట్టం పెరిగి.. ప్రాజెక్టు లో 2.295 టీఎంసీలకు చేరుకున్నది. జూరాలకు శుక్రవారం సాయంత్రం 850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. సుమారు అర టీఎంసీ మేర నీటి మట్టం పెరగడం శుభపరిణామంగా అధికారులు భావిస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో వల్ల మిషన్ భగీరథ, ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు సమస్యలు తీరినట్లు చెప్పొ చ్చు. శుక్రవారం నుంచి జూరాల ఎడమ కాలువ ద్వా రా రామన్‌పాడుకు నీటి విడుదల కొనసాగుతోంది. శనివారం ఉదయం నాటికి జూరాల నీళ్లు రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. అయితే ప్రస్తుతం కేవలం 50 క్యూసెక్కులకుపైగా మాత్రమే నీటిని విడుదల చేస్తున్నందున మార్గమధ్యలో రైతులు నీటిని లిఫ్టు చేయవద్దని రామన్‌కుపాడుకు వెళ్లేందుకు సహకరించి, తాగునీటి ఇబ్బందులు తీరేలా చూడాలని అధికారులు కోరుతున్నారు.

రామన్‌పాడుకు నీటి విడుదల
జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడు రిజర్వాయర్‌కు శనివారం ఉదయం 9:30 గంటల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో 2.295 టీఎంసీల నీటి మట్టానికి చేరుకునడంతో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఎడమ కాలువ గేట్లు తెరచి నీటిని దిగువనకు విడుదల చేశారు. శుక్రవారం అర్ధరాత్రి రామన్‌పాడు రిజర్వాయర్‌కు జూరాల నీళ్లు చేరాయి. రామన్‌పాడు రిజర్వాయర్ పూర్తి నీటి నిలువ సామర్థ్యం 299.471 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లు కాగా.. శుక్రవారం సాయంత్రం నాటికి కేవలం 33.299 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం జూరాల నుంచి రామన్‌పాడుకు నీటిని విడుదల చేస్తుండటంతో క్రమంగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నది. రామన్‌పాడు రిజర్వాయర్‌కు ఉమ్మడి జిల్లాకు గుండె కాయలాంటిది. ఈ రిజర్వాయర్ నిండుగా నీటితో కళకళలాడుతున్నప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తాగు నీటి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరందించే పరిస్థితి ఉండేది. అయితే గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో ప్రస్తుతం రామన్‌పాడు నీటి కొరతతో విలవిలలాడుతోంది. వర్షాభావం, విపరీతమైన ఎండలు, జూరాలలో నీటి నిల్వలు అడుగంటిపోవడం తదితర కారణాలతో రిజర్వాయర్ దాదాపుగా ఎండిపోయే స్థితికి చేరుకున్నది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, వనపర్తి పట్టణ వాసులు రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా రిజర్వాయర్ నీటి కటకటతో ఈ పట్టణాలకు నీటి విడుదల కష్టంగా మారింది. ఈ తరుణంలోనే ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో మాట్లాడి జూరాలకు నారాయణపుర ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయించారు. ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ ఆల్మట్టి నుంచి నారాయణపుర, గూగల్, గిరిజాపూర్ మీదుగా జూరాల ప్రాజెక్టుకు ఎగువ జలాలు వచ్చాయి.

ఒక టీఎంసీలోపు వచ్చినా చాలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నాటక సీఎంతో మాట్లాడిన మేరకు అక్కడి అధికారులు 2.5 టీఎంసీల నీటిని దిగువనకు వదులుతున్నట్లు జూరాల అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే నారాయణపురలో నీటి నిల్వలు తగినంత లేనందున ఆల్మట్టి నుంచి తొలుత నారాయణపురకు నీటిని విడుదల చేశారు. అయితే అక్కడి రైతులు కొందరు ఆల్మట్టి నుంచి నీటి విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అవసరాలకు నిల్వ చేసిన నీటిని తెలంగాణకు ఎలా ఇస్తారని నిరసనకు దిగారు. అయినా రెండు రాష్ర్టాల సంబంధాలకు సంబంధించిన విషయమని అధికారులు నచ్చజెప్పి దిగువనకు నీటిని విడుదల చేశారు. నారాయణపుర నుంచి నీటిని దిగువనకు వదిలేందుకు కర్ణాటక నీటిపారుదుల శాఖ అధికారులు ఆలస్యం చేశారు. మే 8వ తేదీ అర్ధరాత్రి నుంచి జూరాలకు నీటిని విడుదల చేశారు. అయితే నారాయణపుర నుంచి నీటిని దిగువనకు విడుదల చేసినా.. మధ్యలో ఉన్న చిన్న బ్యారేజీలు గూగల్, గిరిజాపూర్ విజ్ఞాలను దాటుకుని జూరాల వచ్చేందుకు సమయం పట్టింది. ఈనెల 14న అర్ధరాత్రి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పై నుంచి వదిలిన నీళ్లు వచ్చి చేరాయి. అయితే నీటి మట్టం క్రమంగా పెరిగింది. ఈ నెల 14వ తేదీన జూరాల ప్రాజెక్టులో 1.853 టీఎంసీలు ఉండగా.. 15వ తేదీన 1.950 టీఎంసీ, 16వ తేదీన 2.19 టీఎంసీలకు చేరుకుంది. కాగా.. శుక్రవారం 2.295 టీఎంసీలకు చేరుకోగా.. మొత్తం 0.445 టీఎంసీల నీరు జూరాలకు వచ్చి వచ్చింది.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...