గెలుపు బాట


Thu,May 16, 2019 01:55 AM

-మరో విజయం దిశగా టీఆర్‌ఎస్‌
-ప్రాదేశిక పోరులోనూ గులాబీ దూకుడు
-బలమైన అభ్యర్థులతో ప్రతిపక్షాలకు చెక్‌
-అన్నీ తామై పని చేసిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌
-అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు
-టీఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమేనంటున్న గులాబీ నేతలు
-ఉమ్మడి జిల్లాలోని 5 జెడ్పీలను కైవసం చేసుకుంటామని ధీమా
మహబూబ్‌ నగర్‌ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఎన్నికలు ఏవైనా గెలుపు సాధించడమే టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ నేతలు, వెంటనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించుకుని సత్తా చాటారు. అదే దూకుడుతో పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ దూసుకుపోయారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానాల నుంచి పోటీ చేసిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ప్రచారంలో తమదైన స్థాయిలో ప్రజల్లో మమేకమయ్యారు. ఇరువురు సైతం ఖచ్చితంగా విజయం సాధిస్తారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో సాగుతోంది. అసెంబ్లీ, పంచాయతీ, ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత ముగిసిన ప్రాదేశిక ఎన్నిలలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ 5 జెడ్పీలు కైవసం చేసుకునడమే లక్ష్యంగా పనిచేసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ... అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకున్నారు. ఎన్నికలు ఏవైనా విజయం సాధించడం ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జెడ్పీ స్థానాలు తమవే అని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికలను సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశామని చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు
వరుస ఎన్నికల్లో విజయ దుందుబీ మోగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అదే దూకుడు కొనసాగిస్తోంది. ప్రాదేశిక ఎన్నికల్లోనూ అదే జోష్‌ స్పష్టంగా కనిపించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే హవా ప్రదర్శించింది. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీ టికెట్లు ఆశించి అవకాశం రాని వారిని కూడా పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార పార్టీ కాబట్టి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పోస్టుల అవకాశం ఉందని బుజ్జగించారు. అలా ముఖ్యమైన నేతలు పలువురు తమకు టికెట్లు రాకపోయినా పార్టీని వీడకుండా పార్టీ కోసం పనిచేసేలా పార్టీ ముఖ్య నేతలు చక్రం తిప్పారు. దీంతో పార్టీకి ఎంతో కలిసివచ్చింది. మరోవైపు క్రమశిక్షణ కలిగిన గులాబీ సైనికులు పార్టీ అభ్యర్థుల గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్‌ నేత స్వర్ణ సుధాకర్‌రెడ్డి పేరును వ్యూహాత్మకంగా ముందే ప్రకటించి ప్రతిపక్షాలను ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు. మరోవైపు మహబూబ్‌నగర్‌ జెడ్పీ స్థానంపై పార్టీలోని అనేకమంది ఆశలు పెట్టుకున్న పరిస్థితుల్లో అందరికీ ఆమోగ్యమైన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ పేరు ప్రకటించగానే ఎవరూ కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో స్వర్ణమ్మకు పోటీగా ప్రతిపక్షాల నుంచి బలమైన అభ్యర్థిని దింపేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అక్కడే టీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా విజయం సాధించినట్లయింది.

అన్నీ తామైన అమాత్యులు
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల విజయం తమ బాధ్యతగా పనిచేసిన జిల్లా మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌. అదే రీతిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పనిచేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇరువురు మంత్రులు విస్తృతంగా పర్యటించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మంత్రుల ప్రచారంతో అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని 5 జెడ్పీలతో పాటు మొత్తం 71 జెడ్పీటీసీలు, ఎంపీపీలను కైవసం చేసుకోవాలని ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేసిన దిశానిర్దేశం పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ సైతం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ అభ్యర్థులు, ముఖ్యులతో ప్రాదేశిక ఎన్నికలకు ముందే తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందనే సందేశాన్ని ఇచ్చారు. పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రులపై ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శక్తివంచన లేకుండా కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే అభ్యర్థుల గెలుపునకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చివరి జెడ్పీ చైర్మన్‌ స్థానం టీఆర్‌ఎస్‌దే కాగా... కొత్తగా ఏర్పడిన 5 జిల్లాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులే జెడ్పీ చైర్మన్లుగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోయారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...