జూరాల చెంతకు కృష్ణమ్మ..


Wed,May 15, 2019 02:42 AM

మహబూబ్‌నగర్‌ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి/మక్తల్‌, నమస్తే తెలంగాణ : కర్నాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి దిగువనకు విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం అర్ధరాత్రి జూరాల ప్రాజెక్టుకు చేరాయి. కర్నాటకలోని గూగల్‌, గిరిజాపూర్‌ బ్యారేజీల నుంచి విడుదల చేసిన అనంతరం సోమవారం తెలంగాణ భూభాగాన్ని ముద్దాడిన కృష్ణమ్మ... మంగళవారం కృష్ణా, మాగనూరు, మక్తల్‌, నర్వ, అమరచింత మండలాలను దాటుకుంటూ జూరాల ప్రాజెక్టునకు చేరింది. సాయంత్రం 4 గంటల సమయంలో ముస్లాయపల్లికి చేరుకున్న నారాయణపుర జలాలు.. రాత్రి 8 గంటల సమయంలో అను దాటాయి. ముష్టిపల్లికి రాత్రి 10 గంటలకు, అర్ధరాత్రి 12 గంటల సమయంలో జూరాలకు కృష్ణాజలాలు చేరుకున్నాయి. ఆదివారం కర్నాటక లోని గూగల్‌, గిరిజాపూర్‌ జలాశయాలు దాటి తెలంగాణ సరిహద్దుల్లోకి కృష్ణా నీరు చేరుకున్న విషయం తెలిసిందే. గిరిజాపూర్‌ బ్యారేజీ నుంచి ప్రస్తుతం 3 గేట్లు తెరిచి నిరంతరాయంగా దిగువనకు నీటిని వదులుతున్నారు. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటని విడుదల చేయగా... సుమారు వారం రోజుల పాటు దిగువకు ప్రయాణించి మంగళవారం అర్ధరాత్రి జూరాల జలాశయానికి చేరకున్నాయి. జూరాల ప్రాజెక్టు ఇంజినీర్లు అంచనా వేసిన మాదిరిగానే మంగళవారం నాటికి జూరాల కు నారాయణపుర జలాలు చేరుకున్నాయి. ప్రస్తుతం జూరాలకు పైనుంచి వచ్చి చేరే జలాలతో క్రమంగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని జూరాల ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ హెచ్‌టీ శ్రీధర్‌ తెలిపారు.

సగం మధ్యలోనే...
నారాయణపుర నుంచి వదిలిన నీటిలో గూగల్‌, గిరిజాపూర్‌ బ్యారేజీలకు చేరే క్రమంలో ఆవిరి, ప్రవాహ నష్టాలకే సగం నీరు తగ్గిపోయే అవకాశం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. నారాయణపుర నుంచి దిగువనకు సుమారు 2.5 టీఎంసీ నీటిని వదిలినప్పటికీ అక్కడి నుంచి 90 కిలోమీటర్లు దిగువన ఉన్న గూగల్‌ బ్యారేజీకి చేరుకునేందుకే కొంత మేర ప్రవాహ నష్టం చేకూరుతుంది. అక్కడి నుంచి సుమారు 18 కిలోమీటర్లు దిగువన ఉన్న గిరిజాపూర్‌ బ్యారేజీని చేరుకునే క్రమంలోనూ ఇదే విధంగా జరుగుతుంది. అక్కడి నుంచి తెలంగాణ పరిధిలోని కృష్ణా రోడ్‌ బ్రిడ్జి వరకు చేరుకునేందుకు సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు సైతం అదే పరిస్థితి. అక్కడి నుంచి దిగువనకు వెళ్లే క్రమంలో పెద్ద ఎత్తున నదిలో గోతులున్నాయి. ఈ గోతులన్నింటినీ నింపుకుంటూ కృష్ణా జలాలు ముందుకు సాగాలి. కర్నాటక, తెలంగాణ పరిధిలో పలు చోట్ల పెద్ద పెద్ద మోటర్లతో నదిలోని నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తారు. ఇవన్నీ దాటుకొని జూరాలకు చేరుకునే క్రమంలో నారాయణపుర నుంచి వదిలిన నీటిలో సగం నీరు మధ్యలోనే ప్రవాహ నష్టాల పాలవుతాయి. అయినప్పటికీ కనీసం టీఎంసీ లోపు నీళ్లు వచ్చినా ఈ వేసవి తాగునీటి కష్టాలన్నీ తీరుతాయని అధికారులు చెబుతున్నారు.

జూరాల నీటి కోసం ఎదురుచూస్తున్న రామన్‌పాడు..
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో కేవలం 1.86 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్న తరుణంలో తాగునీటి పథకాలకు నీటి విడుదల కూడా ఎంతో కష్టంగా మారింది. ఉమ్మడి జిల్లా తాగునీటి పథకాలకు గుండెకాయ లాంటి రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. జూరాల నుంచి రామన్‌పాడుకు నీటిని తరలించే ఎడమ కాలువ గేట్ల వద్దకు కూడా రిజర్వాయర్‌లోని నీటిని తరలించడం కష్టంగా మారింది. రామన్‌పాడు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటిన తరుణంలో ఉమ్మడి పాలమూరు ప్రజలకు తాగునీటి కష్టాలు ప్రారంభమ య్యాయి. పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చించి నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు తాగునీటి కోసం 2.5 టీఎంసీల నీటిని వదిలేలా దౌత్యం నడిపిన సంగతి తెలిసిందే.

నారాయణపుర నుంచి వదిలిన 2.5 టీఎంసీలలో గూగల్‌ బ్యారేజీకి 2 టీఎంసీల కంటే తక్కువ నీరే చేరినట్లుగా కర్నాటక అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడి నుంచి జూరాలకు వచ్చే క్రమంలో మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రామన్‌పాడుకు 0.1 టీఎంసీ నీటిని అందించినా ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. పై నుంచి జూరాలకు వచ్చి చేరే నీటి వల్ల జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన మంచి నీటి స్కీములన్నింటికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురిసే వరకు కర్నాటక వదిలిన నీటితో సమస్యలు లేకుండా చూసే అవకాశం ఉంది. జూరాలకు నారాయణపుర నుంచి నీటిని విడుదల చేసి తాగునీటి కష్టాలు తీరేలా కర్ణాటకతో దౌత్యం నడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉమ్మడి పాలమూరు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...