చకచకా..!


Mon,May 13, 2019 03:38 AM

- వేగంగా భీమా కాల్వల లైనింగ్ పనులు
- పునరుద్ధరణకు రూ.31.47 కోట్లు మంజూరు
- 46వ ప్యాకేజీకి రూ.24.40 కోట్లు, 47 ప్యాకేజీకి రూ.7.7 కోట్ల నిధులు
- పూర్తి స్థాయిలో 8.125 కి.మీ. అభివృద్ధి
- హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
మక్తల్, నమస్తే తెలంగాణ : నారాయణపేట జిల్లాలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్ కాల్వలకు మహర్దశ పట్టింది. వర్షాకాలంలో ఈ రిజర్వాయర్ల నుంచి కృష్ణా నీటిని అందించేందుకు 46, 47వ ప్యాకేజీ కాల్వల పునరుద్ధరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ పనుల కోసం రూ.31.47 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం కాల్వల లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మక్తల్ మండలం పంచదేవ్‌పహాడ్ గ్రామ సమీపంలోని కృష్ణానది నుంచి అప్రోచ్ కెనాల్, సొరంగ మార్గం ద్వారా పంచలింగాల సమీపంలోని భీమా స్టేజ్-1కు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి కాల్వల ద్వారా రిజర్వాయర్లకు తరలిస్తారు. అభివృద్ది చేసి నీటి ప్రవాహాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో లైనింగ్ పనులను ప్రారంభించారు.

46వ ప్యాకేజీకి రూ.24.40 కోట్లు
భీమా స్టేజ్-1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించే 46వ ప్యాకేజీ కెనాల్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.24. 40 కోట్లను మంజూరు చేసింది. కెనాల్‌కు లైనింగ్‌తోపాటు బెడ్ స్లాబ్ పనులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు 40 శాతం పూర్తయ్యాయి. 46వ ప్యాకేజీలోని 5.125 కి.మీ. మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వేసవి ముగిసే లోగా పనులు చేయాలనే లక్ష్యంతో సంబందిత గుత్తేదారులు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. పనులు నిరంతరం కొనసాగుతున్నాయి.

47వ ప్యాకేజీకి రూ.7.07 కోట్లు..
భీమా స్టేజీ-1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు మక్తల్ పట్టణంలోని సమీపంలోని తిరుమల్లయ్య చెరువు కట్ట వద్ద స్టేజ్-2 పంప్‌హౌజ్ నుంచి రిజర్వాయర్లకు నీటిని తరలించే 47వ ప్యాకేజీ అభివృద్ధికి రూ.7.07 కోట్లు మంజూరయ్యాయి. 3.85 కి.మీ. పొడవు కాల్వ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 47వ ప్యాకేజీలోని కాల్వ 28 కి.మీ. (అప్రోచ్ కాల్వ 2 కి.మీ. కలుపుకొని) పొడవు ఉండగా.. 3.85 కి.మీ.ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఇప్పటి వరకు 20 శాతం మేర పూర్తయ్యాయి.

ఎమ్మెల్యే చిట్టెం ప్రత్యేక చొరవ..
చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి ఇప్పటి వరకు రెండు పంటలకు సాగునీరు అందించారు. అయితే చివరి ఆయకట్టు వరకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో 46, 47 ప్యాకేజీల అభివృద్ధికి నిధుల మంజూరులో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. కాల్వల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో కాల్వల లైనింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఆనందంగా ఉంది
ఎన్నో ఏళ్లుగా సాగునీరు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కృషితో రిజర్వాయర్‌ను పూర్తి చేసి సాగునీరు అందించడం ఆనందంగా ఉంది. రైతన్నలు ఎంతో సంతోషంగా పంటలను సాగు చేసుకుంటున్నారు. అదే తరహాలో రానున్న వానకాలం పంట సీజన్‌లో సైతం సాగునీరు అందించేందుకు కాల్వను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే కాల్వల ద్వారా సాగునీరు పూర్తి స్థాయిలో అందనున్నది.
- దేవరింటి నర్సింహారెడ్డి, రైతు, మక్తల్

రైతులు రుణపడి ఉంటాం..
భీమా స్టేజ్ -1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటిని తీసుకెళ్లే 46,47వ ప్యాకేజీ కాల్వలను అభివృద్ధి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రిజర్వాయర్ల ఆయకట్టు కింద ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఈ ప్రాంత రైతులంతా ఆయనకు రుణపడి ఉంటాం..
- రవిశంకర్‌రెడ్డి, రైతు, మక్తల్

వేగంగా లైనింగ్ పనులు
చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కృష్ణానది నుంచి నీటిని తరలించే కాల్వ లైనింగ్ పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టి మే నెల చివరి వరకు పనులను పూర్తి చేస్తాం. జూన్ మాసంలో వర్షాలు ప్రారంభమవుతున్న సందర్భంగా నది నుంచి రిజర్వాయర్‌కు నీటిని నింపే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అంత వరకు లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
- విజయానంద్, ఈఈ, మక్తల్

ప్రతి ఎకరాకూ సాగునీరు
మా నాన్న చిరకాల స్వప్నమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆయకట్టులోని రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కృష్ణానది నుంచి రిజర్వాయర్లకు నీటిని తరలించే 46,47వ ప్యాకేజీ కాల్వలలను అభివృద్ధి చేసి జూన్ నెలలో వరద నీటిని రిజర్వాయర్‌లోకి తీసుకెళ్లేందుకు వీలుగా కాల్వలలను అభివృద్ధి చేస్తున్నాం. గత వానాకాలం సీజన్‌లో నియోజకవర్గంలో భీమా కాల్వ అనుసంధానం ద్వారా 108 చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించాం. ఈ వానకాలం సీజన్‌లో నియోజకవర్గంలోని అన్ని చెరువులను కృష్ణా నీటితో నింపి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం
- చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, మక్తల్

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...