తరలొచ్చింది..!


Mon,May 13, 2019 03:36 AM

-తెలంగాణను ముద్దాడిన కృష్ణమ్మ
-కృష్ణ రోడ్ బ్రిడ్జి వద్ద గలగలలు
-మరో రెండ్రోజుల్లో జూరాలకు..
- నారాయణపుర గేట్ల మూసివేత
-2.5 టీఎంసీల నీటి విడుదల
-తీరనున్న తాగునీటి సమస్య
-ఉమ్మడి జిల్లావాసుల హర్షం
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నాటక ముఖ్యమంత్రితో నడిపిన దౌత్యం ఫలించిన సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా ఐదు రోజుల కిందట నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయగా ఆదివారం తెలంగాణ భూ భాగానికి చేరుకున్నాయి. బసవసాగర్ నారాయణపుర ప్రాజెక్టు నుంచి బుధవారం నీటి విడుదల ప్రారంభించగా.. ఆదివారం మధ్యాహ్నం కర్నాటకలోని గూగల్ బ్యారేజ్‌కు చేరుకున్నాయి. మధ్యాహ్నం అక్కడి నుంచి దిగువకు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ దిగువనకు నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి మన రాష్ట్ర సరిహద్దులోకి అడుగిడాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని రాయిచూరు- హైదరాబాద్‌పై ఉన్న కృష్ణా బ్రిడ్జి వద్దకు నీళ్లు చేరాయి. దీంతో మరో రెండ్రోజుల్లోపే ఈ నీళ్లు జూరాలకు చేరే అవకాశం ఉంది. 2.5 టీంసీల నుంచి మధ్యలో కొంత నీరు గుంతలు పూడ్చుకుంటూ రావడం, కర్నాటక పరిధిలో రైతులు, తాగునీటి అవసరాలకు అనధికారికంగా వినియోగించుకున్నా కనీసం 2 టీఎంసీల లోపు అయినా జూరాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటితో పాలమూరు తాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో మ్మడి పాలమూరు జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నీటిని విడుదల చేయాల్సిందిగా కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ అభ్యర్థించగా.. 2.5 టీఎంసీల నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే..

మంగళవారం నాటికి..
ఐదు రోజుల కిందట బుధవారం రాత్రి బసవసాగర్ నారాయణపుర రిజర్వాయర్ నుంచి జూరాల దిశగా నీటిని విడుదల చేశారు. నారాయణపుర రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో అంతకుముందు అల్మట్టి నుంచి రెండు టీఎంసీల నీటిని నారాయణపురకు విడుదల చేశారు. నారాయణపుర మినిమం డ్రా డౌన్ లెవల్ (ఎండీడీఎల్)కు చేరుకున్న తర్వాత అవుల్ ఫ్లో కొనసాగింది. బుధవారం రాత్రి ఐదువందుల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా గురువారం ఉదయం ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని నిరంతరాయంగా శుక్రవారం సాయంత్రం వరకు నిలుపుదల చేశారు. శనివారం 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు 7200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అనంతరం నారాయణపుర ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. కర్నాటక సీఎం కుమారస్వామి పేర్కొనట్లు సుమారు 2.5 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు వదిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నారాయణపుర నుంచి జూరాలకు చేరుకునే క్రమంలో మధ్యలో 2.5 టీఎంసీల నుంచి కనీసం అర టీఎంసీ తగ్గినా సుమారు రెండు టీఎంసీల మేర జూరాలకు చేరే అవకాశం ఉందని అంచనా..

తరలివచ్చిందిలా..
నారాయణపుర ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయగా.. కృష్ణమ్మ తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతూ తరలివస్తోంది. నారాయణపుర నుంచి నీటి విడుదల జరగగా.. అక్కడి నుంచి గూగల్ రోడ్డు కం బ్యారేజీకి చేరుకున్నాయి. అక్కడి విద్యుదుత్పత్తిని చేసి దిగువరకు నీటిని విడుదల చేయగా.. గిరిజాపూర్‌లోని బ్యారేజీ మీదుగా తెలంగాణ సరిహద్దుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి జూరాల వైపు కృష్ణమ్మ తలివెళ్తున్నది.

నారాయణపుర నీటితో తీరనున్న తాగునీటి కష్టాలు
నారాయణపుర నుంచి జూరాల ప్రాజెక్టుకు రానున్న కృష్ణా జలాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సుమారు రెండు, మూడు రోజులపాటు జూరాలలో నీటి మట్టం పెరిగిన తర్వాత ఎడమ కాలువ ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టు నీటిని విడుదల చేయనున్నారు. రామన్‌పాడు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని అన్ని నీటి తాగునీటి పథకాలకు నీటిని అందించే ఏర్పాటు చేయమన్నారు. నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు కృష్ణా జలాలు తీసుకువచ్చి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు తాగునీటి కష్టాలు తీరుస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...