ఒక్క క్షణం ఆలోచించండి


Mon,May 13, 2019 03:34 AM

-ఆత్మహత్యలు.. పరిష్కారం కాదు
-మానవ జీవితంలో గెలుపోటములు సహజం
-ఫెయిలైతే కుంగిపోవడం సరికాదు
- ఓటమే గెలుపునకు నాంది
-నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు
ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే మానవ జన్మ దక్కుతుందని పెద్దలు అంటుంటారు.. అలాంటిది చిన్న చిన్న విషయాలకే జీవితం నాశనమైనట్లు ఆత్మహత్యలు చేసుకంటున్నాం.. ఎన్నో పుణ్యకార్యాల ప్రతిఫలంగా లభించే మానవజన్మను సార్థకం చేసుకోవాలి కానీ.. నాన్న తిట్టాడనో.. ప్రేమ ఒప్పుకోలేదనో.. మార్కులు తక్కువొచ్చాయనో.. పక్కింటొళ్లు ఎమనుకుంటారనో.. పరీక్షల్లో ఫెయిలయ్యాననో బలవన్మరణం చేసుకోకూడదు. మన జీవితాన్ని మన తల్లిదండ్రులు మనకు ఇచ్చిన గొప్ప అవకాశం.. దానిని మనమే పూలపాన్పుగా మలుచుకొని తల్లిదండ్రులకు సార్థకతను కల్పించాలి. అర్ధాంతరంగా మనం తనువుచాలించి వారికి కడుపుకోతను మిగల్చడం అవివేకమవుతుంది. గెలుపోటములనేవి మానవ జీవితంలో సహజం.. వాటిని మనసులో తీసుకొని కుంగిపోవడం.. పొంగిపోవడం ఎవ్వరికీ మంచిదికాదు. విజయం, ఓటమిని సమానంగా చూసినవాడే జీవితంలో ఉన్నతంగా రాణించగలడు.

పరీక్షల్లో ఫెయిలైతే..
నేటి సమాజంలో పిల్లల్లో ఆత్మనూన్యతా భావం బాగా పెరిగిపోయింది. యాంత్రిక జీవితాలకు అలవాటు పడి పిల్లలకు ఎన్నో విషయాలను నేర్పించలేకపోతున్నాం. పాఠశాలలు, కళాశాలలు సహితం వారి గొప్పలు చాటుకోవడానికి పిల్లలను యంత్రాల్లా తయారు చేస్తున్నారే తప్ప.. వారిలో ఆత్మైస్థెర్యం, ఆత్మవిశ్వాసం నింపలేకపోతున్నారు. దీంతో మార్కులు తక్కువొచ్చినా.. పరీక్షల్లో ఫెయిలయ్యామనే చిన్న చిన్న విషయాలకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వందేళ్ల భవిష్యత్‌ను మొగ్గ దశలోనే చిదిమేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుశోకం మిగులుస్తున్నారు. గెలుపోటములకు కుంగిపోకుండా పిల్లలకు ఎప్పుడైతే ఆత్మైస్థెర్యం, తనపై తనకు విశ్వాసం కల్పిస్తామో అప్పుడే పిల్లల్లో ఆత్మవిశ్వాసం తొలగిపోతుంది. పిల్లలకు తగినంత సమయం కేటాయించి వారి గెలుపోటములను భుజం తట్టి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.

మార్కులు.. కొలమానం కాదు
పరీక్షల్లో విజయం.. అపజయం సర్వసాధారణం. ఫెయిల్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి మొదలైనటువంటి కారణాలతో కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో తప్పవచ్చు. అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మనిషి ప్రతిభను చాటుకోవడానికి మార్కులే కొలమానం కాదు. ఒక్కసారి ఫెయిలైతే జీవితమే కోల్పోయినట్లు కాదు.. సరైన బాణం.. సరైన సమయంలో ఎక్కుపెడితే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

పదో తరగతి విద్యార్థులకు సూచనలు
-గొప్పతనానికి మార్కులే ప్రాతిపదిక కాదు.
-తక్కువ జీపీఏ సాధించిన వారు భవిష్యత్‌లో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
-పదో తరగతి జీవిత ప్రయాణంలో ఒక చిన్న గమ్యం మాత్రమే.
-ఎవరి జీపీఏ వారిదే, ఒక విద్యార్థి ఇంకో విద్యార్థి జీపీఏతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు.
-ఎక్కువ జీపీఏ వచ్చిన వారు గొప్పలు చెప్పుకోవడం సరికాదు, దీంతో తక్కువ జీపీఏ వచ్చిన వారు కుంగిపోయే అవకాశం ఉంటుంది.
-తక్కువ జీపీఏ వచ్చిన వారు నిరాశపడొద్దు.
-విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల జీపీఏను ఇతర పిల్లల జీపీఏతో పోల్చొద్దు.
-తమ పిల్లలకు వచ్చిన జీపీఏనే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే విద్యార్థులకు బలం చేకూరుతుంది.
-పదో తరగతి పరీక్షమీదనే జీవితం ఆధారపడి ఉండదని గ్రహించాలి.
-10 కి 10 వచ్చిన వారు గొప్పవారు కాదు.
- తక్కువ వచ్చిన వారు మామూలు వారు కాదు.
- పదో తరగతి పరీక్షల కంటే జీవితం విలువైంది.
-పరీక్షలపై తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కల వారు పిల్లలపై ఒత్తిడి కలిగించొద్దు.
- ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోతుందని భావించొద్దు.
-ఆత్మహత్యలు జీవితానికి పరిష్కారం కాదని ప్రతి విద్యార్థి గ్రహించాలి.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...