తరలివస్తున్న కృష్ణమ్మ!


Fri,May 10, 2019 03:01 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అధిగమించడానికి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపిన దౌత్యం ఫలించింది. బుధవారం రాత్రి నుంచి నారాయణపుర ప్రాజెక్టు ఒక్క క్రస్ట గేట్ నుంచి జూరాలకు నీటి విడుదలను ప్రారంభించారు. మొదట 500 క్యూసెక్కుల నీటిని వదిలిన డ్యాం ఇంజనీర్లు క్రమేపీ ఔట్‌ఫ్లోను పెంచారు. గురువారం ఉదయం 2 వేల క్యూసెక్కులు, సాయం త్రం నాటికి ఔట్‌ఫ్లోను ఒక్కసారిగా 8 వేల క్యూసెక్కులకు పెంచారు. ఆల్మట్టి నుంచి వచ్చిన సుమారు అర టీఎంసీ నీటిని కిందకు వదులుతున్నట్లు నారాయణపుర ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 8 వేల క్యూసెక్కులను నిరంతరంగా సుమారు 16 గంటలపాటు వదిలితే అర టీఎంసీ నీటి విడుదల పూర్తవుతుందని జూరాల డ్యాం డివిజన్ ఈఈ శ్రీధర్ తెలిపారు. మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నారాయణపుర ప్రాజెక్టుకు మరో టీఎంసీ నీటిని వదిలేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు అక్కడి అధికారుల ద్వారా తమకు సమాచారం అందినట్లు శ్రీధర్ నమస్తే తెలంగాణకు తెలిపారు. అయితే నారాయణపుర ప్రాజెక్టులో మినిమం డ్రా డౌన్ లెవల్ (ఎండీడీఎల్)ను దాటి కేవలం అర టీఎంసీ మాత్రమే ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ నీటిని మాత్రమే కిందకు వదులుతున్నారు. ఈ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరేందుకు కనీసం ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

సీఎం కేసీఆర్ వినతి మేరకు..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జూరాలకు కర్నాటక నుంచి నీటి విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన మేరకు కన్నడ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. అయితే నారాయణపుర ప్రాజెక్టులో నీటి లభ్యత తగినంత లేనందున ఆల్మట్టి నుంచి నీటిని దిగువకు వదిలిన తర్వాత జూరాలకు విడుదల చేసేలా కర్నాటక నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటి విడుదలకు సుమారు వారం రోజుల పాటు జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆల్మట్టి నుంచి నారాయణపురకు చేరుకున్న అర టీఎంసీ నీటిని జూరాల వైపునకు వదులుతున్నారు.

జూరాలకు చేరేంత వరకు..
ప్రస్తుతం నారాయణపుర నుంచి వదిలే నీరు నేరుగా జూరాలకు వచ్చే అవకాశం లేదు. కర్నాటకలోని రాయిచూర్ సమీపంలో ఈ మధ్యనే నిర్మించిన గూగల్ రోడ్ కమ్ బ్యారేజీని దాటి తెలంగాణ సరిహద్దుల్లోకి కృష్ణానీరు రావాల్సి ఉన్నది. అయితే తెలంగాణ తాగునీటి అవసరాల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన దౌత్యం కాబట్టి నారాయణపుర నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు గూగల్ కం బ్యారేజీ వద్ద దిగువనకు వదిలే అవకాశం ఉంది.

గుంతలు దాటుకుంటూ..
నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు సుమారు 160 కిలోమీటర్ల దూరం ఉంది. నదిలో నీటి ప్రవాహం లేక పూర్తిగా ఒట్టిపోయింది. చిన్న పెద్ద గుంతలు, గుండాలు అన్నీ ఎండిపోయాయి. నారాయణపుర నుంచి నీటిని వదలిన తర్వాత దిగువన ఉన్న అన్ని గుంతలు, గుండాలు నిండుతూ ముందుకు రావాలి. మధ్యమధ్యలో అనధికార లిఫ్టు ఇరిగేషన్లు.. నదిలో నీళ్లు కనిపించాయంటే చాలు వారు తోడేస్తారు. ఈ విజ్ఞాలన్నీ దాటుకుని వచ్చిన తర్వాత రాయిచూర్ సమీపంలో నిర్మించిన గూగల్ రోడ్ కం బ్యారేజ్ వద్ద అడ్డుకట్ట పడకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే కర్నాటక సరిహద్దు దాటి నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణా మండలం వద్ద పై నుంచి వదిలిన నీళ్లు జూరాల వైపు వస్తాయి. ఆ మేరకు తెలంగాణ అధికార యంత్రాగం కూడా అన్ని జాగ్రత్త లు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వదిలిన అర టీఎం సీ నీటి ప్రవాహం ఆగకముందే నిరంతరాయంగా మిగతా నీటిని కూడా నారాయణపుర ప్రాజెక్టు నుంచి వదలగలిగితేనే సమస్య లేకుండా జూరాలకు నీరు చేరుకునే అవకాశం ఉంది. ఆ మేరకు తెలంగాణ నుంచి అధికారులు కర్నాటక నీటి పారుదల శాఖ అధికారులతో నిరంతరం చర్చిస్తూనే ఉన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...