నేటితో రెండో విడత ప్రచారం బంద్


Wed,May 8, 2019 02:33 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలోని 212ఎంపీటీసీ, 20జెడ్పీటీసీ స్థానాలకు గాను తొలి విడతలో ఏడు మండలాల్లోని జెడ్పీటీసీ, 212ఎంపీటీ స్థానాలకు సోమవారం పోలింగ్ విజయవంతంగా ముగిసింది. దీంతో ఈనెల 10వ తేదీన కల్వకుర్తి, వెల్దండ, తాడూరు, తెలకపల్లి, ఊర్కొండ మండలాల్లోని 52ఎంపీటీసీ, 5జెడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలపై రాజకీయ వర్గాలతో పాటు అధికారులు దృష్టి సారించారు. రెండో విడతకు గాను ఈనెల 26నుంచి 28వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కాగా ఈనెల 2వ తేదీన ఉపసంహరణ తర్వాత 165మంది ఎంపీటీసీ స్థానాలకు, 20మంది జెడ్పీటీసీ స్థానాలకు పోటీలో నిలిచి అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు గత వారం రోజుల నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్‌తో పాటుగా పలువురు నాయకులు చేసిన ప్రచారం మంచి ఆదరణ తీసుకొచ్చింది. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో గెలుపుపై నమ్మకం పెంచింది.

ఫలితంగా ప్రచారం ఇతర పార్టీల అభ్యర్థులను మించి సాగింది. ఎట్టకేలకు బుధవారంతో ప్రచారం ముగియనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులంతా శుక్రవారం నాటి పోలింగ్‌పై దృష్టి సారించనున్నారు. వారం రోజుల పాటు చేపట్టిన ప్రచారంతో తమకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందననే అంచనాల్లో మునిగిపోనున్నారు. పార్టీల గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదిలా ఉంటే అధికారులు సైతం ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు.

ఈ విడతలోని మొత్తం 290పోలింగ్ కేంద్రాలు ఉండగా పురుషులు 72,233మంది ఓటర్లు, మహిళలు 70,434మంది చొప్పున 1,42,673మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 15 వెబ్ కాస్టింగ్ నిర్వహించనుండగా మిగిలిన పోలింగ్ బూత్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యం పంచాయతీ అధికారులు ఎన్నికలకు చర్యలు చేపడుతున్నారు.

2,3విడతల్లో 432మంది అభ్యర్థులు
ఇక మూడో విడత ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఒక్క అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 8మండలాల్లోనే ఈనెల 14న చివరి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందులో 69ఎంపీటీసీ స్థానాలకు గాను 208మంది, 8జెడ్పీటీసీ స్థానాలకు గాను 39మంది బరిలో నిలిచారు. ఇందులో మొత్తం 394పోలింగ్ కేంద్రాలుండగా 1,98,886మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు గ్రామగ్రామాన కలియతిరుగుతున్నారు. పార్టీల్లో చేరికలను ఆహ్వానిస్తూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు ఇస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో 91ఎంపీటీసీ, 7జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ముగియగా ఈనెల 10, 14వ తేదీల్లో జరిగే ఎన్నికల్లో 121ఎంపీటీసీ, 13జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రెండు విడతలకు కలిపి 373మంది ఎంపీటీసీ పదవులకు, 59మంది జెడ్పీటీసీ పదవులకు పోటీలో నిలిచారు. తొలి విడత ఎన్నికలు పూర్తవ్వడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఈనెల 27న జిల్లా కేంద్రంలోని గీతాంజలి, పాలెం డిగ్రీ కళాశాలల్లో కౌటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం మీద పరిషత్ పోరాటం కీలక దశకు చేరింది. గ్రామాల్లో పరిషత్ పోరాటం రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. గ్రామాల్లో ఎటు చూసినా అభ్యర్థుల గెలుపు, ఓటములపైనే చర్చలు సాగుతున్నాయి. తొలి దశలో ఎన్నికలు ముగియడంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు మిగతా ప్రాంతాల్లో పోలింగ్ తేదీలపై నిలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...