అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధం


Wed,April 24, 2019 02:09 AM

-సోమవారం రాత్రి 11 గంటలకు ప్రమాదం
-రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసిన రెవెన్యూ అధికారి
-బాధితుడిని పరామర్శించిన పలువురు నాయకులు
ఇటిక్యాల : మండలంలోని సాతర్ల గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తులు బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సులేమాన్ తన (చుట్టూ బండలు నిలిపి జమ్ముతో వేసిన) గుడిసెకు తాళం వేసి సోమవారం సాయంకాలం గద్వాలలో తమ బంధువుల శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అయితే రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పివేయడానికి గ్రామస్తులు ఎంతగా ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎండాకాలం కావడం, గాలి ఉదృతంగా ఉండటంతో మంటలు వ్యాపించి అదుపు చేయడానికి సాధ్యం కాలేదని గ్రామస్తులు తెలిపారు. దీనికి తోడు గుడిసెలోని గ్యాస్ సిలిండర్ మంటల వేడికి పెద్దశబ్దంతో పేలింది. గుడిసెలో మరో సిలిండర్ ఉందని తెలిసి గ్రామస్తులు మం టలను అదుపు చేయడానికి భయపడ్డారు.

జిల్లా కేంద్రం నుంచి అగ్నిమాపక యంత్రం వచ్చి మంటలను ఆర్పివేసినా అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిమాపక యంత్రం సకాలంలో రావడం చేత గ్రామంలోని ఇతరుల గుడిసెలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సులేమాన్‌కు చెందిన దాదాపు రూ.2 లక్షల నగదు, తిండి గింజలు, టీవీ, బుల్లెట్ మోటర్‌సైకిల్, వంట సామగ్రి, కట్టుబట్టలు, బీరువా, కట్టుమిషన్, వాషింగ్ మిషన్, బంగారు నగలు పూర్తిగా కాలిపోయాయి. పూర్తి స్థాయిలో ఆస్తినష్టం జరిగి నిలువనీడ లేకుండా రోడ్డున పడ్డానని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నాడు. సంఘటనపై ఆర్‌ఐ సుదర్శన్‌రెడ్డి, వీఆర్‌వో మద్దిలేటి పంచనామా నిర్వహించి సుమారు రూ.12 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. సంఘటన విషయం తెలుసుకొన్న ఎంపీపీ హన్మంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా సభ్యుడు రాందేవ్‌రెడ్డి, షేక్‌పల్లె సర్పంచ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమవంతుగా ఒక్కొక్కరు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...