నామినేషన్లు షురూ..


Tue,April 23, 2019 12:39 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పరిషత్ ఎన్నికల పోరు ప్రారంభమైంది. సోమవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తొలి విడత నామినేషన్లు దాఖలు చేశారు. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో మంగళ, గురు వారాల్లో నామినేషన్లు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసిన తరుణంలో ప్రస్తుతం ప్రాదేశిక సమరం ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. నామినేషన్లు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై... సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. తొలి రోజు పెద్దగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రాలేదు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద ప్రశాంతంగా నామినేషన్ల పర్వం కొనసాగింది.

జెడ్పీపై ప్రయత్నాలు ప్రారంభం...
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 5 జిల్లాలుగా విడిపోవడంతో కొత్తగా 5 జెడ్పీలు ఏర్పాటు అవుతున్నాయి. దీంతో జెడ్పీ చైర్మన్ల బరిలో అనేక మంది ఆశావహులు బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డిని అధిష్ఠానం ఖాయం చేసింది. ఇప్పటికే ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి ఆమె అభ్యర్థిత్వానికి సానుకూలంగా స్పందించారు. చిన్నచింతకుంట మండలానికి చెందిన స్వర్ణమ్మను దేవరకద్ర నియోజకవర్గానికే చెందిన భూత్ పూర్ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్‌పూర్ నుంచి స్వర్ణమ్మ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. అప్పటికే జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న పలువురు అభ్యర్థులతో సమావేశమై వారిని బుజ్జగించారు. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా అందరూ పనిచేయాలన్నారు. భూత్‌పూర్ నుంచి స్వర్ణ సుధాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు అంతా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ కు స్వర్ణ సుధాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ సరైన వ్యక్తిని జెడ్పీ చైర్మన్ పదవికి ఎంపిక చేసిందని పార్టీ క్యాడర్ అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. మహబూబ్ నగర్ జెడ్పీ పీఠంపై మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.

5 జెడ్పీలు కారువే..
ఉమ్మడి జిల్లాలో 5 జెడ్పీల్లోనూ కారు హవానే కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యంత బలంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 13 ఎమ్మెల్యేలుండగా... కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సైతం త్వరలో కారెక్కనున్నారు. ఈ నేపథ్యంలో 14 నియోజకవర్గాల్లోనూ కారు జోరు కొనసాగనుంది. అన్ని జెడ్పీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించేలా పార్టీ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ఎక్కడెక్కడ ఎవరెవరు అభ్యర్థులు బలమైన వారో గుర్తించి వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మిగతా 4 జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు ఎవరో తెలిసిపోనుంది. ఇప్పటికే అధిష్ఠానం ఈ అంశంపై సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని అందరు వ్యక్తులకు ఆమోదయోగ్యులైన వారికే జెడ్పీ చైర్మన్ పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీకి విధేయులుగా ఉన్నవారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జెడ్పీ అభ్యర్థిత్వం విషయంలో విధేయత నిరూపణ అయ్యింది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...