నేటినుంచి తొలినామినేషన్లు


Tue,April 23, 2019 12:36 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలోని ఏడు మండలాల్లోని ఏడు జెడ్పీటీసీ, 91ఎంపీటీసీ స్థానాలకు గాను జరగబోయే ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ ఛాంబర్లలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు, అదే ప్రాంతంలో ప్రత్యేకంగా క్లస్టర్ల వారీగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు స్వీకరించనున్నారు. దీనికోసం రిటర్నింగ్ అధికారులను కూడా ఇప్పటికే నియమించడం జరిగింది. ఈసారి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్లు దరఖాస్తు చేసే అవకాశం కల్పించడం ప్రత్యేకత. అయితే ఆన్‌లైన్ కాపీని తీసుకొని మద్దతుదారులతో కలిసి మండల కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఈనెల 25న పరిశీలన, 27న ఫిర్యాదులను స్వీకరిస్తారు. 28వ తేదీన ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. మే 6వ తేదీన ఈ స్థానాల పోలింగ్ ఉండగా 27వ తేదీన ఫలితాల లెక్కింపు ఉంటుంది. ఆ రోజే అభ్యర్థుల తుదిజాబితా ఖరారు చేయడంతో పాటుగా స్వతంత్రులకూ గుర్తు కేటాయింపు ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులకూ ప్రచార వ్యయ పరిమితిని విధించారు. జెడ్పీటీసీలు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఇక ఎంపీటీసీకి పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్‌గా రూ.1,250, జనరల్ అభ్యర్థులు రూ. 2,500చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రూ.2,500 ఉండగా జనరల్ అభ్యర్థులకు రూ.5వేలుగా నిర్ణయించడం జరిగింది. బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీలకు గులాబీ రంగు, జెడ్పీటీసీలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఓటర్లు తొలుత ఎంపీటీసీలకు ఓటు వేశాక జెడ్పీటీసీలకు వేయాల్సి ఉంటుంది. ఎడమ చేతి మధ్య వేలుపై సిరా గుర్తు వేస్తారు. మొత్తం 71స్థానాలకు గాను బిజినేపల్లిలో అత్యధికంగా 21ఎంపీటీసీ స్థానాలతో పాటుగా 55,935మంది ఓటర్లు ఉన్నారు. ఇక పెంట్లవెల్లిలో అత్యల్పంగా 6ఎంపీటీసీ స్థానాలతో పాటుగా 16,686మంది ఉండటం గమనార్హం. ఇక ఈ ఎన్నికల నిర్వహణ పరిశీలనకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఐఏఎస్ అధికారి ఎల్.శర్మన్‌ను నియమించడం జరిగింది. మొత్తం మీద 20మండలాలకు గాను 7మండలాలకు జరిగే తొలి విడత ఎన్నికల్లో 2.39లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగ 1,176పోలింగ్ కేంద్రాలతో పాటుగా స్ట్రాంగ్ రూంలను కూడా గుర్తించి తగిన విధంగా సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ మొగులప్ప, డీపీఓ సురేష్ మోహన్, తదితర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేలా సూచనలు ఇచ్చారు.

పార్టీల్లో హడావుడి
సర్పంచ్ పదవుల తర్వాత గ్రామస్థాయిలో జరగనున్న ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ గుర్తులతో జరగనుండటంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సహా ఇతర పార్టీలు గెలుపు గుర్రేలను బరిలో నిలిపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ ఎన్నికల ఇంఛార్జ్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతుగంటి రాములును నియమించింది. ఇప్పటికే నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల ఎన్నికల్లో గెలుపునకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు, ఇతర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డితో పాటుగా ఎంఎల్‌సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు నియోజకవర్గాల్లో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి మండల ముఖ్య నాయకుల సలహాలు తీసుకొంటూ అభ్యర్థుల ఖరారుపై చర్చిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సంతోషం నింపుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌లో ఒక్కో స్థానానికి నలుగురైదుగురు ఆశావహులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులే దొరకని పరిస్థితులు ఉన్నాయి. దీంతో వెతికి మరీ అభ్యర్థులను బరిలో నిలిపి పరువు కాపాడుకునేందుకు ఆయా నియోకవర్గ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. తొలివిడత జరిగే పరిషత్ ఎన్నికలకు గాను సోమవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...