పరిషత్ పోరుకు సై


Wed,April 17, 2019 01:27 AM

-మే నెలలో నిర్వహించేందుకు సమాయత్తం
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 71 జెడ్పీటీసీ, ఎంపీపీ, 790 ఎంపీటీసీ స్థానాలు
- జనం గుండెల్లో నిలిచిపోయిన కారు గుర్తు
- గెలుపు ధీమాలో గులాబీ పార్టీ నేతలు
- ఎమ్మెల్యేలపై అభ్యర్థుల గెలుపు బాధ్యత
- 5 జెడ్పీ పీఠాలపై పాగా వేయడమే లక్ష్యంగా..
-దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్, కేటీఆర్
-ఉత్సాహంగా కదులుతున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నాడు అసెంబ్లీ పోరు.. తర్వాత సర్పంచ్ ఎన్నికలు.. పోరు ఏదైనా కారుదే పైచేయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకుగాను 13 అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని సత్తా చాటింది. మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలతో పాలమూరు అగ్రభాగాన నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సర్పంచుల పోరులోనూ టీఆర్‌ఎస్‌దే పైచేయి అయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 90 శాతం సర్పంచ్ స్థానాలు టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. వరుస వెంట జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటుతున్న గులాబీ పార్టీ.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేయడంతో మిగతా పక్షాలకు అందని రీతిలో ఎన్నికలను ముగించింది.

అదే ఉత్సాహంతో ఇప్పుడు స్థానిక సంస్థల పోరుకు సిద్ధమవుతోంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైన తరుణంలో టీఆర్‌ఎస్ నేతలు మరోపోరుకు సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కనీసం పార్టీ గుర్తు లేకున్నా గులాబీ పార్టీ బలపర్చిన అభ్యర్థులే సింహభాగం విజయం సాధించగా.. ఇప్పుడు పార్టీ గుర్తులతో జరుగుతున్న స్థానిక పోరులో కారు దూసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిషత్ పోరుకు సంబంధించి పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేయడంతో కేడర్ మరింత ఉత్సాహం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేసే బాధ్యతను జిల్లాల వారీగా పార్టీ అధిష్టానం అప్పగించేందుకు సిద్ధమవుతోంది. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చి స్థానిక పోరులోనూ విజయ బావుటా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని 5 జెడ్పీలు, 71 ఎంపీపీలు, 71 జెడ్పీటీసీలు, 790 ఎంపీటీసీలను కైవసం చేసుకునేందుకు గులాబీ నేతలు సన్నద్ధం అవుతున్నారు.

జెడ్పీ పీఠాలన్నింటిపై గులాబీ పాగా వేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జెడ్పీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులంతా క్రమశిక్షణతో పనిచేయాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 13న హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన సమీక్షలో కేటీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జెడ్పీలతోపాటు మొత్తం 71 జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునాలని నేతలకు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపిన కేటీఆర్.. స్థానిక పోరులోనూ అదే స్థాయి కసరత్తు చేపట్టారు. ఈనెల 20వ తేదీలోపు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో నేతలంతా తమ తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్ సైతం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ అభ్యర్థులు, ముఖ్యులతో ఈనెల 15న సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే జెడ్పీ, ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకునేలా పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీల్లో టీఆర్‌ఎస్ గెలుపు బావుటా ఎగురవేయాలని పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి పాలమూరు పరిధిలో ఉన్న 5 జెడ్పీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే కైవసం చేసుకోవాలని పార్టీ సమాయత్తమవుతోంది. జెడ్పీటీసీ, ఎంపీపీలను కైవసం చేసుకునే బాధ్యత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు అప్పగించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు సైతం పలు చోట్ల బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు సాధించారు. అదే వ్యూహాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అనుసరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

కారు గుర్తే వజ్రాయుధం
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బంపర్ మెజార్టీతో ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకుగాను 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఎక్కడికి వెళ్లినా సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే చర్చ జరిగింది. అభ్యర్థులెవరనేది చూడకుండా ఓటర్లు సింహభాగం కారు గుర్తుపై తమ మమకారాన్ని చూపించారు. ఈ నేపథ్యంలో కారు గుర్తు ఉంటే విజయం సాధించడం నల్లేరుపై నడకే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులు కాకుండా సాధారణంగా గుర్తులు కేటాయిస్తారు. అలా కేటాయించినా పార్టీ బలపర్చిన అభ్యర్థులనే పెద్ద ఎత్తున ఓటర్లు గెలిపించారు. కారు గుర్తు లేకున్న తాము విజయం సాధించామని ఇప్పుడు స్థానిక సంస్థల పోరులో కారు గుర్తుతో తమ పార్టీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని పలువురు టీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ నుంచి పోటీ అంటేనే విజయం కైవసం చేసుకున్నట్లే అన్న భావన వ్యక్తమవుతోంది.


అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎలాగైనా టిక్కెట్ సాధించాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు.. పేరిట పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టిన ప్రచారం ప్రజల్లోకి దూసుకువెళ్లింది. ఓటర్లు మూకుమ్మడిగా కారు గుర్తుపై ఓటేశారు. కారు గుర్తు అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కారు గుర్తు అన్న విధంగా ప్రజల్లోకి అంత బ్రహ్మాండంగా వెళ్లింది. కారు గుర్తు జనం గుండెల్లో నిలిచిపోయింది. అందుకే ఈ గుర్తును ఛేదించడం ప్రతిపక్షాల తరం కావడం లేదు. టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు అందుకే కారు గుర్తు ఓ వజ్రాయుధంలా మారిందని చెప్పొచ్చు. అందుకే పార్టీ నేతల్లో గతంలో కంటే ఎక్కువగా గెలుపు ధీమా కనిపిస్తోంది.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...