మహిమాన్విత క్షేత్రం సిరుసనగండ్ల


Sun,April 14, 2019 02:54 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ/చారకొండ : మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న సిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దండకారణ్య ప్రాంతంలో భాగంగా సిరుసనగండ్ల గ్రా మం ఉండేది. గ్రామానికి సమీపంలో దాదాపు 300 అ డుగుల ఎత్తున 70ఎకరాల విశాలమైన బండపై దత్తాత్రేయ ఆశ్రమం ఉండేది. జననీ సీతాదేవిని అన్వేశిస్తూ దండకారణ్యం చేరిన రామలక్ష్మణులు దత్తాత్రేయ ఆశ్రమాన్ని సందర్శించి సేదదీరారు. ముని కోరిక మేరకు రామలక్ష్మణులు సీతా సహితంగా అర్చవతార మూర్తులుగా అక్కడ వెలిశారని క్షేత్ర మహత్య కథనం. త్రేతాయుగంలో రాక్షసుల తలలు తెగనరికి వాటితో ఆంజనేయుడు బంతి ఆట ఆడుకున్న అనవాళ్లు ఉన్నాయని అందుకే శిరస్సు, తలలు కలిసి సిరుసనగండ్ల పేరు వచ్చిందని పురాణ కథ ఉంది. శిరస్సు అంటే పైభాగం గండ్లు అంటే రాళ్ల మధ్య నీళ్లు ఉండే ప్రదేశం. భూమికి ఎత్తైన ప్రదేశంలో రాళ్ల మధ్య నీళ్లు ఉన్నాయి కనుక సిరుసనగండ్ల పేరు వచ్చిందనే కథనం కూడా ఉంది. 600 సంవత్సరాల క్రితం చరికొండ సీమలో భాగంగా ఉన్న శిరుసనగండ్ల సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని రాచకొండ పద్మనాయకులు అభివృద్ధి పరిచారని చరికొండ ధర్మన్న తన చిత్ర భారతంలో పేర్కొన్నాడని చరిత్రకారులు చెబుతున్నారు.

రామాయణంతో సంబంధం..
స్వయం వ్యక్త క్షేత్రంగా రామాయణంతో సంబంధం ఉన్న సిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి శతాభ్ధాల చరిత్ర ఉంది. ఆలయ వైభవం గు రించి శ్రీమరి సింగకవి సిరుసనగండ్ల రామచరిత్ర అనే పద్య కావ్యంలో సవివరంగా రచించారు. మూడున్నర శతాబ్ధాల క్రితం సిరుసనగండ్ల సీతారామ చంద్రస్వామి ఆలయ ప్రతిష్ట జరిగినట్లు పద్య కావ్యం వల్ల వెల్లడవుతుంది. ప్రకృతి సిగలో ఎటు చూసిన ఆహ్లాదకరమైన వాతావరణం వెల్లివిరిసే సుందరమైన ప్రదేశంలో భూ మికి దాదాపు 300అడుగుల ఎత్తున 70ఎకరాల విశాలమైన బండపై పుణ్యక్షేత్రం విస్తరించి ఉంది. ఏక ప్రా కారాంతనిర్మిత శ్రీ సీతారామాలయం షోడస స్థంభాలతో అలరాడుతుంది. గర్భాలయంలో శ్రీ సీతారామలక్ష్మణులు విగ్రహాలు ఉండగా జానకీరాములు ఏకమకరతోరణ యుక్తంగా విరాజిల్లడం ఈ దేవాలయం ప్ర త్యేకత. రామలక్ష్మణుల నేత్రాలు, కిరీటం, కవచాలు తి రునామాలతో ఉంటాయి. రామలక్ష్మణులకు మీస కట్టు ఉండటం ఈ ఆలయాల విగ్రహాల విశేషం. ఇక జానకీమాత సకల కలల సౌభాగ్యవతిగా దర్శనమిస్తుంది. ముఖారవిందానికి పసుపు పూయబడి పట్టు వస్ర్తాలను ధరించి జగదేక మాతగా గోచరిస్తుంది.

సంవత్సరం పొడవున ఉత్సవాలు..
అపర భద్రాదిగా పేరున్న సిరుసనగండ్ల శ్రీరామ క్షేత్రంలో సంవత్సరం పొడవున ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రోత్సవాలు, అష్టమి నుంచి పౌర్ణమి వరకు బ్ర హోత్సవాలు, ధ్వజారోహన, ఎదురుకోళ్లు, కల్యాణోత్స వం, గరుడసేవ, హనుమాన్‌సేవ, పెద్ద రథం, చక్రతీర్థం వంటి కార్యక్రమాలు కనుల పండువగా సాగుతాయి. భద్రాద్రిలో ప్రతిష్టించాల్సిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఇక్కడికి తీసుకువచ్చి ప్రతిష్టించారని ప్రతీతి. ఈశ్వరుడు క్షేత్ర పాలకుడుగా విరాజిల్లుతున్న శిరుసనగండ్ల శ్రీరామ క్షేత్రంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఆంజనేయ మందిరం, నాగసన్నిది, మైసమ్మ మం దిరం, నవగ్రహ మండపాలు ఉన్నాయి. ఒకప్పుడు దత్తాత్రేయ ఆశ్రమంగా విరాజిల్లినా శ్రీరామ క్షేత్రంలో దత్తాత్రేయ మహర్షి సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. దత్తాత్రేయ మందిరానికి ఎదురుగా రామకోటి స్థూపం ఉంటుంది. రామ భక్తులు నియమ నిష్టలతో శ్రీరామ నామాన్ని పుస్తకాలలో రాసి స్వామి వారికి సమర్పిస్తారు. ఈ పుస్తకాలను స్తూప అంతర్భాగంలో నిక్షిప్తం చేస్తారు. దత్తాత్రేయ మందిరానికి కుడి వైపున సీతారాములు కల్యాణోత్సవాన్ని నిర్వహించే కల్యాణ మం డపం ఉంటుంది. రామాలయానికి చేరువలో రామలింగేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. పక్కనే ఏకశిలతో మలిచిన సింధూర లేపిత ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. శ్రీరామ నవమి నుంచి 15రోజులు స్వామి వారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో విశేష పూజలు జరుగుతాయి. ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు గండ్ర దీపాలతో(తలపై దీపాలు పెట్టుకుని) ప్రదక్షిణలు చేయడం ప్రత్యేకత. ముక్కిడి మైసమ్మ ఆలయం మరో ప్రత్యేకత. మైసమ్మ అమ్మవారు ఏకాక్షిగా(ఒకే కన్నుతో) గోచరించడం విశేషం.

భారీగా హాజరవనున్న భక్తులు ..
శ్రీరామ నవమిని పురస్కరించుకుని సిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే జానకీరాముల కల్యాణోత్సవానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా కల్వకుర్తి, దేవరకొండ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది.

బ్రహ్మోత్సవాల వివరాలు..
- ఈ నెల13న శనివారం ధ్వజారోహణం, అభిషేకం, అలంకరణ, సహస్రనామర్చన, మధ్యాహ్నం 12 గంటలకు మాస కళ్యాణం
- 14న ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు కల్యాణోత్సవం, రాత్రికి గరుడ సేవ, చిన్నరథం (పూలతేరు)
- 15న సోమవారం హన్‌మాన్ సేవ
- 16న మంగళవారం అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, రాత్రికి పెద్దరథం (బ్రహ్మోత్సవం)
- 17న బుధవారం అభిషేకాలు, అర్చనలు, నాగబలి, పూర్ణహూతి, రాత్రికి దోపోత్సవం
- 18న గురువారం చక్రతీర్థం, పల్లకీసేవ, రాత్రికి ద్వాదశారాధన ఏకాంత సేవ
- 19న శుక్రవారం ఉదయం అభిషేకం, శివదత్తాత్రేయపరుశరామ, పోచమ్మ దేవాలయల్లో ప్రత్యేక అర్చనాదులు, రాత్రికి నామ సంకీర్తనలు

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...