ఈవీఎంలో అభ్యర్థుల భవితవ్యం


Sun,April 14, 2019 02:44 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి గురువారం ఎన్నికలు పూర్తయ్యాయి. మూడు జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15.87లక్షల మంది ఓటర్లకు గానూ 9.92లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. మొత్తం 1936 పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు వేసేందుకు ఎన్నికల అధికారులు ఈవీఎంలను సమకూర్చారు. ఇలా 2,419 బ్యాలెట్ యూనిట్లు, 2,23 0 కంట్రోల్ యూనిట్లు, 2,336 వీవీ ప్యాట్లు ఈ ఎన్నికల్లో వినియోగించడం జరిగింది. ఈ యంత్రాలను పోలింగ్ ముగిశాక గురువారం రా త్రి పోలింగ్ సిబ్బంది ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాగర్‌కర్నూల్‌కు చేర్చారు. ఆయా సెక్టోరల్ అధికారులు సంబంధిత పీవోల నుంచి లిఖిత పూర్వకంగా ఈవీఎంలను సేకరించారు. క ల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్ ఈవీఎంలు ఉయ్యాలవాడ శివారులోని మోడెర్న్ బీఈడీ కళాశాల (స్ట్రాండ్ రూం)కు చేర్చగా నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల ఈవీఎంలను నెల్లికొండ శివారులోని వ్యవసాయ గోదాం(స్ట్రాంగ్ రూం)కు తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల దేశవ్యాప్తంగా జరగాల్సి ఉండటంతో ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.

దీంతో అభ్యర్థుల భవితవ్యం వెలువడేందుకు దాదాపు 40రోజుల సుదీర్ఘ సమయం పట్టనుంది. దీనివల్ల ఈవీఎంలను అప్పటి వరకూ జాగ్రత్తగా రక్షించేందుకు పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. 24గంటల పాటూ పోలీసు పహారా కొనసాగనుంది. సెంట్రల్, ఆర్ముడ్ ఫోర్స్ బృందాలతో పాటు సివిల్ పోలీసు బలగాలచే ఎన్నికల ఫలితాల వరకూ ఈవీఎంలను రక్షించనున్నారు. నాగర్‌కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగనుంది. ఎన్నికలకు సంబంధించిన ముఖ్య అధికారులు, అనుమతి ఉన్న వ్యక్తులకే ఇందులోకి అనుమతించనున్నారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను స్విచాఫ్ చేయడంతో పాటు అధికారుల సమక్షంలో సీల్ వేశారు. మే 23వ తేదీ రోజునే ఈవీఎంలను తిరిగి తెరుస్తారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు గురువారం నుంచే రక్షణ ప్రారంభమైంది.

అంచనాల్లో అభ్యర్థులు, నేతలు
ఇక ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులతో పాటు రాజకీయ నాయకుల్లోనూ అంచనాలు మొదలయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు, 2014ఎన్నికలతో పోలిస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ బాగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 82శాతం ఉండగా 2014పార్లమెంట్ ఎన్నికల్లో 74శాతం పోలింగ్ జరిగింది. ఈ తగ్గిన పోలింగ్ ఎవరికి లాభం కలిగిస్తుందో, ఎవరికి నష్టం కలిగిస్తుందోనన్న చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే నాయకుల ప్రచారం కూడా చాలా వరకు తగ్గింది. ఒక్క టీఆర్‌ఎస్ అభ్యర్థి రాములు తరపునే గ్రామ స్థాయిలో ఇంటింటి ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఒంటరి ప్రచారం మొక్కుబడిగా సాగింది. ఇక మండే ఎండలకు తోడు వలస ఓటర్లు రాకపోవడం, పట్టణాల్లోనూ ఓటింగ్ వేసేందుకు ఓటర్లు ముందుకు రాకపోవడంతో పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది. పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానమైన అలంపూర్‌లో అత్యధికంగా 66.98శాతం పోలింగ్ జరగడం గమనార్హం. ఆ తర్వాత గద్వాలలో 66.30, వనపర్తిలో 60.91శాతం పోలింగ్ జరగగా కొల్లాపూర్‌లో అత్యల్పంగా 56. 16శాతం పోలింగ్ నమోదైంది. గ్రామాల వారీగా కూడా ఈ వివరాలు బహిర్గతం కావడంతో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితు లు ఓటింగ్ పెరగడం, తగ్గడంలాంటి అం శాలపై ప్రభావం చూపిందో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు తమ గ్రామస్థాయి నేతల ద్వారా సేకరిస్తున్నారు. ఈ ప్రభావం మే 23నాటి ఫలితాలపై ఎలా ఉంటుందోనని అభ్యర్థులు, రాజకీయ నాయకులు బేరీజు వేస్తున్నారు. ఈ అంశంలో స్పష్టత రావాలంటే ఇంకా 40రోజుల వరకు ఎదురు చూడాల్సిందే.

స్ట్రాంగ్ రూంను పరిశీలించిన రాములు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భద్రపర్చిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు శు క్రవారం సందర్శించారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ శివారులో ఉన్న స్ట్రాంగ్ రూంను పరిశీలించి జాగ్రత్తలపై అధికారులతో ఆరా తీశారు. నెల రోజులకు పైగా ఈవీఎంలను భద్ర పర్చాల్సి ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈవీఎంల వద్దకు చేరుకొని వాటికి వేసిన సీల్‌ను పరిశీలించారు. ఆయన వెంట తనయుడు భరత్, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...