పోలింగ్ 62.51


Fri,April 12, 2019 02:11 AM

- ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు
- కల్వకుర్తిలో అత్యధికంగా 66శాతం..
- కొల్లాపూర్‌లో 56.16శాతం నమోదు
- వనపర్తిలో ఓటేసిన మంత్రి సింగిరెడ్డి, అచ్చంపేటలో అభ్యర్థి రాములు..
- ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
- పర్యవేక్షించిన ఎన్నికల అధికారి శ్రీధర్
- అర్ధరాత్రి వరకు నాగర్‌కర్నూల్ చేరిన ఈవీఎంలు
- మే 23న ఎన్నికల ఫలితాల ప్రకటన
- ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిత
- ఊపిరి పీల్చుకొన్న అధికారులు

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్‌కర్నూల్(ఎస్సీ) పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. పార్లమెంటరీ పరిధిలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాల్లోని 1936పోలింగ్ బూత్‌ల పరిధిలో 15,87,281 మంది ఓటర్లు ఉండగా 62.51శాతం చొప్పున మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 66.60శాతం, గద్వాలలో దాదాపు అంతే స్థాయిలో 66.30శాతం ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో 56.16శాతం ఓటింగ్ నమోదైంది. ఇక పార్లమెంట్ వ్యాప్తంగా ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, వీవీ ప్యాట్‌ల్లో చిన్నచిన్న సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలు ప్రాంతాల్లో కొద్ది నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇలా 33బ్యాలెట్ యూనిట్లు, 33కంట్రోల్ యూనిట్లు, 107వీవీ ప్యాట్ యంత్రాలను సరి చేసి పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ ద్వారా ఎన్నికలను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని సంఘమిత్ర స్కూల్‌లోని మోడల్ పోలింగ్ బూత్‌ను సందర్శించారు. కాగా పోలింగ్ గత 2014లో 75శాతం నమోదు కాగా ఈసారి కేవలం 61శాతం మాత్రమే కావడం గమనార్హం. ప్రతి గంటకు ఒకసారి అధికారులు పోలింగ్ శాతాన్ని సేకరించారు.

ఉదయం 9గంటల వరకు (తొలి రెండు గంటల్లో) కేవలం 9.76శాతం మాత్రమే పోలింగ్ కాగా 11గంటలకు 20శాతం ఆ తర్వాత మధ్యాహ్నం 1గంట వరకు మరో 25శాతం చొప్పున పెరిగి మొత్తం 45.82శాతానికి చేరుకొంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పోలింగ్ ముగిసే సరికి కేవలం 15శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఓవైపు ఎండ వేడిమి, మరోవైపు ప్రజలు రాకపోవడంతో చాలా ప్రాంతాల్లో పోలింగ్ బూతులు బోసిపోయి కనిపించాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగింది. సాయంత్రం తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్‌లాంటి యంత్రాలను పోలింగ్ సిబ్బంది నాగర్‌కర్నూల్‌కు తీసుకొచ్చారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేటల ఈవీఎంలను నెల్లికొండ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాం(స్ట్రాంగ్ రూం)కు, గద్వాల, అలంపూర్, వనపర్తి, కల్వకుర్తి ఈవీఎంలను ఉయ్యాలవాడ శివారులోని మోడర్న్ విద్యా సంస్థలు (స్ట్రాంగ్ రూం)కు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకూ సిబ్బంది ఈవీఎంలను తీసుకు వచ్చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ దగ్గరుండి ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచే వరకూ పర్యవేభించారు. ఇక ఆయా జిల్లాల్లోని ఎన్నికలను కలెక్టర్ శ్వేతా మహంతి, జేసీలు, ఆర్డీఓల్లాంటి అధికారులు నిరంతరం పరిశీలించారు.

ఈవీఎంలలో భవిత
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బరిలో ఉన్న 11మంది అభ్యర్థుల భవిత ఇక ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. అప్పటి వరకు నెల రోజులకుపైగా గడువు ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక తగ్గిన పోలింగ్ సరళి ఎవరికి లాభం, ఎవరికి నష్టం కలిగిస్తుందోననే అంచనాలతో అభ్యర్థులు, నాయకులు చర్చలు సాగిస్తున్నారు. దాదాపు మూడు వారాల పాటు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో అభ్యర్థులతో పాటుగా అధికారులు సైతం ఊపిరి పీల్చుకొన్నారు. సాయంత్రమే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా గత పది రోజులుగా నియోజకవర్గాల్లోనే మకాం వేసిన ఎమ్మెల్యేలు కూడా పట్నం బయలుదేరారు. ఈవీఎంలకు స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సెంట్రర్, ఆర్ముడ్ రిజర్వుడు, సివిల్ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు చేపట్టారు. మే 23వరకు అనుమతి పొందిన అధికారులకు మాత్రమే అక్కడికి ప్రవేశం ఉంటుంది. అప్పటి వరకూ స్ట్రాంగ్ రూంలను తెరవకుండా చర్యలు తీసుకొన్నారు. మొత్తం మీద నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగియడం విశేషం.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...