ఏర్పాట్లు వేగిరం


Sun,March 24, 2019 01:07 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నాగర్‌కర్నూల్(ఎస్సీ) లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. మూడు జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 16లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 37వేల మంది దివ్యాంగ ఓటర్లు కూడా ఉన్నారు. ఈ ఓటర్లందరికీ 1936పోలింగ్ బూతుల్లో ఓట్లు వేసేందుకు కావాల్సిన చర్యలను తీసుకొంటున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, డీఆర్‌ఓలు, ఆర్‌డీఓల్లాంటి అధికారుల సమావేశాలు జరిగాయి.

9,265మంది ఉద్యోగులు
ఎన్నికల నిర్వహణకు 9,265మంది ఉద్యోగులను గుర్తించారు. ఇందులో దాదాపు 2వేల మంది పీఓ, ఏపీఓలకు ఆదివారం జిల్లా కేంద్రం నాగర్‌కర్నూల్‌లోని మూడు ఫంక్షన్ హాళ్లల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా విడతల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో ఈవీఎంల వినియోగం, పీవోల విధులు, బాధ్యతలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ, పోలింగ్ అనంతరం సామగ్రిని చేర్పించుటలాంటి తొమ్మిది అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయ్యేలా కలెక్టర్ ఆయా ఎన్నికల శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బందోబస్తు పటిష్టం
ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. వంద మీటర్లలోపు 144సెక్షన్ అమలు పర్చడంతో పాటుగా 265సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ప్రత్యేక బలగాలను మోహరించడంతో పాటుగా ఫ్లయింగ్ స్కాడ్‌లను, స్టాటిస్టిక్స్ సర్వే లైన్స్, వీడియో సర్వే లైన్స్, వీడియో వ్యూ టీమ్, అసిస్టెంట్ ఎక్స్‌పెండీచర్ టీమ్స్‌లను రంగంలోకి దించారు. వాహనాలను తనిఖీలు చేస్తూ నగదు, మద్యం పంపిణీ జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఓటర్లకు అభద్రతా భావం తొలగేలా ఆయా ప్రాంతాల్లో పోలీసు కవాతులు నిర్వహిస్తున్నారు. పోలీస్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానిస్తూ ఏదైనా సంఘటన జరిగితే 15నిమిషాల్లో బలగాలు కేంద్రాలకు చేరుకునే ఏర్పాట్లు చేపట్టారు. 1950టోల్ ఫ్రీ ద్వారా, సీ విజిల్ ద్వారా సమస్యలను సేకరిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా 08540-230201, 230202, 230204టోల్ ఫ్రీ నెంబర్లు ద్వారా 24గంటలూ సమస్యలను సేకరిస్తున్నారు. సువిధ ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరిస్తూ అనుమతులు జారీ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లోని కమాండ్ కంట్రోల్ ద్వారా ఎన్నికల పర్యవేక్షణను కలెక్టర్ నేతృత్వంలో జరగనుంది. పోలింగ్ కోసం సామగ్రిని పంపిణీ చేయడంతో పాటుగా ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించడం, ఎన్నికల తర్వాత తిరిగి నాగర్‌కర్నూల్‌లోని కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీపాట్‌లు తీసుకొచ్చే వరకు తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను వీడియో ద్వారా చిత్రీకరించనున్నారు. దాదాపు 100కుపైగా కేంద్రాల్లో జరిగే పోలింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏకే.మోరియా ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకొని అధికారులతో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల సమావేశాలు కూడా పూర్తి చేశారు. ఈవీఎంలపై అవగాహన కల్పించి అనుమానాలను నివృత్తి చేశారు. ఇలా ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు, ఏర్పాట్లను శరవేగంగా చేపడుతున్నారు.

రేటితో నామినేషన్ ఆఖరు
ఇక నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగియనుంది. ఈనెల 18న సోమవారం రోజు నోటిఫికేషన్ రాగా ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ నుంచి పోతుగంటి రాములు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి బంగారు శృతిలతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బుద్దుల శ్రీనివాసులు మాత్రమే ఇప్పటి వరకు నామినేషన్లు వేయడం గమనార్హం. సోమవారం నాడు నామినేషన్ల ఘట్టం పూర్తి కానుండటంతో అధిక సంఖ్యలో స్వతంత్రుల నుంచి వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా మరికొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో సోమవారం నామినేషన్ కేంద్రం వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేయనున్నారు. టీఆర్‌ఎస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో వనపర్తిలో సన్నాహక సమావేశం జరగగా నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెఢ్డి పర్యవేక్షణలో సమావేశాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి రాములు సెంటిమెంట్‌గా నాగర్‌కర్నూల్ మండలం పుల్జాల గ్రామం నుంచి శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడిప్పుడే ప్రచారం ప్రారంభించగా బీజేపీ ప్రచారం ప్రారంభం కాలేదు. మొత్తం మీద సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే పోటీలే ఉండే అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఇక రాజకీయ వర్గాలు, ప్రజలు కూడా ఎవరెవరు పోటీలో ఉంటారోనని ఎదురు చూస్తున్న ఉత్కంఠ సోమవారం వీడనుంది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...