ఉత్కంఠకు తెర


Fri,March 22, 2019 02:37 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఉమ్మడి మహబూబ్ నగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. మహబూబ్‌నగర్ నుంచి ప్రముఖ ఫార్మా కంపెనీ యజమాని సోదరుడు మన్నె శ్రీనివాస్ రెడ్డికి, నాగర్ కర్నూలు నుంచి మాజీ మంత్రి పి. రాములుకు పార్టీ అధిష్ఠానం టికెట్లు కేటాయించింది. గత కొన్ని రోజులుగా ఒకటే చర్చకు దారితీసిన మహబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్‌ను సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని, కొత్త అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించడం విశేషం. నాగర్ కర్నూల్‌లో గత ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌కు సైతం అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వలేదు. ఈ విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు సైతం కొత్తవారికే కేటాయించారు. సోమవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా... నాలుగు రోజుల తర్వాత అభ్యర్థులను ప్రకటించారు. ఈ నెల 25వ, తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. కాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థులు శుక్రవారం నాడు నామినేషన్లు వేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన వెంటనే ప్రచారం ప్రారంభించనున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా ప్రచారం కోసం ఎదురుచూస్తున్నారు.

గెలుపు గుర్రాల ఎంపిక..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్ఠానం అత్యంత జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన జితేందర్ రెడ్డి, నాలుగు సార్లు ఎంపీ అయిన మందా జగన్నాథ్‌ను కాదని కొత్త వారికి ఇచ్చేందుకు నిర్ణయించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న జితేందర్ రెడ్డిని కాదని... మన్నె శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం విశేషం. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జితేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. సీఎం కేసీఆర్‌తో చెదిరిపోని అనుబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషిచేస్తామని ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం గూరుకుంట గ్రామానికి చెందిన ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి సోదరుడు మన్నె శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్‌నగర్ ఎంపీ టిక్కెట్ ప్రకటించారు.

సొంత జిల్లాకు చెందిన అభ్యర్థికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడం ప్రస్తుత విశేషం. ఇప్పటికే ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఫార్మా కంపెనీ వ్యవహారాలు చూసుకునే శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే రాజకీయంగా అనుభవం ఉంది. సొంత గ్రామం నుంచి ఒకసారి ఎంపీటీసీగా పనిచేశారు. ఎంపీటీసీ నుంచి ఎంపీ సీటు సాధించే వరకు ప్రజల మధ్యే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఎంపీ టిక్కెట్ రావడంతో ఏడు నియోజకవర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం లభించబోతోందన్నారు. ఇప్పటికే గూరుకుంట గ్రామంతోపాటు నవాబ్ పేట మండలంలో ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంఎస్‌ఎన్ కుటుంబం ప్రజల్లో ఉంది. ఇప్పుడు నేరుగా ఎంపీ టిక్కెట్ లభించడంతో వారికి మరింత ప్రజాసేవ చేసేందుకు అవకాశం లభించినైట్లెంది. తనకు టిక్కెట్ కేటాయించిన సీఎం కేసీఆర్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలంతా మన్నె అభ్యర్థిత్వానికి జై కొట్టిన తరుణంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అత్యధిక మెజారిటీ సాధించే అవకాశం కనిపిస్తోంది.

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు
మహబూబ్‌నగర్ ఎంపీ టిక్కెట్‌ను స్థానిక ఎమ్మెల్యేలంతా మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించమని కోరినట్లు ప్రకటించారు. స్థానికుడైన శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఇప్పటికే ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసింది. ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మన్నెకు టిక్కెట్ లభిస్తుందని సెగ్మెంట్‌లో ప్రచారం నడిచింది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ గురువారం ఆయనకే టిక్కెట్ ప్రకటించారు. శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ కేటాయించడంపై పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తంచేశారు. ప్రగతి భవన్ బయట ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని వారు వెల్లడించారు. గతంలో ఎప్పుడు లేనంత మెజారిటీతో ఎంపీ అభ్యర్థిని గెలుపిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు.

కింది స్థాయి నుంచి కష్టపడిపైకి వచ్చారు. పాలమూరుకు సాగునీరు తీసుకువచ్చి బాగు చేసేందుకు వీరి వంతు ప్రయత్నం చేసేందుకు ఎంపీగా ప్రయత్నించేందుకు మంచి అవకాశమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. లక్షల మంది వలసలు పోయే జిల్లా అని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలందరి అభ్యర్థన మేరకే సీఎం కేసీఆర్ బీ ఫారం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని మంత్రి అన్నారు.

సీఎం, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు : ఎంపీ అభ్యర్థి రాములు
నాకు నాగర్‌కర్నూల్ ఎంపీ టిక్కెట్ కేటాయించిన సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌లకు కృతజ్ఞతలు. రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటుగా పార్లమెంటరీ పరిధిలోని ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని, సహకారం తీసుకొంటూ ముందుకు సాగుతాను. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసం నాకు బలం. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయి. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన ప్రజలందరూ టీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలలందరూ తమ గెలుపుగా భావించి ప్రజలను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించేలా కృషి చేయాలి. శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలతో కలిసి నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో నామినేషన్ వేస్తున్నాను. నాయకులు, అభిమానులు స్వచ్ఛందంగా రావాలి.

మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి;మన్నె శ్రీనివాస్‌రెడ్డి బయోడేటా పూర్తిపేరు: మన్నె శ్రీనివాస్‌రెడ్డి
పుట్టినతేదీ: 1959
తల్లిదండ్రులు: మన్నె సోమేశ్వరమ్మ, అచ్చిరెడ్డి
చిరునామా: గ్రామం గురుకుంట, మండలం నవాబ్‌పేట, జిల్లా మహబూబ్‌నగర్
భార్యలు: గీత, లక్ష్మమ్మ
పిల్లలు: ముగ్గురు కుమార్తెలు సోమశ్రీ, వేదశ్రీ,మనుశ్రీ
విద్య: డిగ్రీ... బికాం, ప్రాథమిక విద్య గురుకుంట, పాఠశాల ఉన్నత విద్య యన్మన్‌గండ్ల పాఠశాల, ఇంటర్, డిగ్రీ ఎంవీస్ కళాశాల, మహబూబ్‌నగర్
చేపట్టిన పదవులు: 2004లో సింగిల్ విండో డైరెక్టర్, 2006 నుంచి 2010 వరకు గురుకుంట ఎంపీటీసీగా పని చేశారు
నివాసం: ప్రస్తుతం హైదరాబాద్.
కుటుంబ నేపథ్యం: వ్యవసాయ కుటుంబం., అన్న.. మన్నె సత్యనారాయణరెడ్డి(ఎంఎస్‌ఎన్)ఫార్మా కంపెనీల అధినేత. అన్న ప్రోద్భలంతో రాజకీయాల్లో రాణింపు.
నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు బయోడాటా..
-నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబంలో 1952లో రాములు జన్మించారు.
-తల్లిదండ్రులు: ఎల్లమ్మ, నాగయ్య
-భార్య: భాగ్యలక్ష్మి
-కూతురు, కొడుకులు: ప్రశాంతి, రాజేంద్రప్రసాద్, భరత్‌ప్రసాద్
-కల్వకుర్తి, జడ్చర్లలో చదివిన ఆయన మార్కెటింగ్ శాఖలో కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మాజీ మంత్రి, గాంధేయవాది మహేంద్రనాథ్ స్ఫూర్తిగా 1994లో రాజకీయాల్లోకి వచ్చారు.
-నాడు తెలుగుదేశం నుంచి అచ్చంపేట అసెంబ్లీకి పోటీ చేసిన రాములు వరుసగా 1994, 1999, 2004లోనూ గెలుపొందారు. టీడీపీ హయాంలో 2001-2004మధ్య కాలంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రిగానూ పని చేశారు.
-గత 2014ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాములు ప్రజాభిప్రాయం, అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరారు. గతేడాది టీఆర్‌ఎస్‌లో చేరిన రాములు పార్టీకి విధేయులుగా ఉంటూ వస్తున్నారు. రాములు పనితీరును గుర్తించిన సీఎం కేసీఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో జరిగే పార్టీ సమావేశాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...