ఇద్దరు వ్యక్తులు బలి


Fri,March 22, 2019 02:35 AM

అమరచింత : అతి వేగం ఇద్దరు వ్యక్తులను బలి తీసుకుంది. ఈ ఘటనల్లో బైక్‌పై వచ్చిన వారు ఒకరు.. డ్రైవింగ్ చేస్తూ మరొకరు మృత్యువాతపడ్డారు. మరొకరు త్రీవ గాయాల పాలయ్యారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ సంజయ్ పరారీలో ఉన్నాడు.

అమరచింత ఎస్‌ఐ రామస్వామి తెలిపిన వివరాల మేరకు.. అమరచింతకు చెందిన బీఎల్‌ఎఫ్ మండల కన్వీనర్ తిమ్మోతి, ప్రకాశంలు ద్విచక్ర వాహనంపై ఆత్మకూర్‌కు వెళ్లి పనులు ముగించుకొని స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వేగంగా వచ్చిన టీఎస్ 08 యూఎఫ్ 0734 నంబర్ కలిగిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. ఆపకుండా వెళ్లి పోయింది.

ఈ ప్రమాదంలో తిమ్మోతి, ప్రకాశం తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా రాత్రి 11 గంటల సమ యంలో మార్గమధ్యలోనే తిమ్మోతి తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ప్రమాదానికి కారణమైన కారు వివరాలు సేకరించగా అమరచింతకు చెందిన పృద్వీదని గుర్తించారు. అయితే కారు నడిపింది సంజయ్ అని తెలుసుకొని తిమ్మోతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు సంజయ్ కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కారును ఆత్మకూర్ శివారులో ఆపి పరారయ్యాడని ఎస్‌ఐ పేర్కొన్నారు.

నిందితుడిని వెంటనే అరెస్టు చేయ్యాలి
ప్రమాదానికి గురై మృతి చెందిన తిమ్మోతి మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి గురువారం అమరచింతకు తరలించగా కుటుంబ సభ్యులు, బీఎల్‌ఎఫ్, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిందితుడు సంజయ్‌ను వెంటనే అరెస్టు చేయాలని అతని ఇంటిముందు మృత దేహాన్ని ఉంచి ధర్నా చేపట్టారు. స్థానిక ఎస్‌ఐ రామస్వామి నిందితుడిని వెంటనే అరెస్టు చేస్తామని గాలింపు చర్యలు ముమ్మరం చేశామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో అజయ్, ఎస్.రాజు, అబ్రహం, దామోదర్, సుదాకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...