అన్నాసాగర్‌లో..ప్రేమికుల ఆత్మహత్య


Fri,March 22, 2019 02:31 AM

భూత్పూర్ : మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామ సమీపంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. భూత్పూర్ సీఐ పాండు రంగారెడ్డి, ఎస్‌ఐ పర్వతాలు తెలిపిన వివరాల మేరకు.. అన్నాసాగర్‌కు చెందిన నాగరాజు(30), రామేశ్వరి(23) ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించు కున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో వీరి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే రామేశ్వరికి 10 నెలల క్రితం మండల పరిధిలోని కర్వెనకు ఇచ్చి వివాహం చేశారు. కేవలం రెండు నెలలే అక్కడున్న రామేశ్వరి తనకు కాపురం చేయడం ఇష్టం లేదని తల్లిగారింటికే వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో నాగరాజుతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని నాగరాజు, రామేశ్వరి నిర్ణయించుకున్నారు. అయితే వివాహితురాలైన రామేశ్వరిని పెళ్లి చేసుకోవాలంటే కోర్టు ద్వారా ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోవాలని గ్రామస్తులు కొందరు సూచించారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన నాగరాజు, రామేశ్వరిలు బుధవారం రాత్రి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి గుళకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించామని సీఐ పాండు రంగారెడ్డి, ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు. మృతురాలి తండ్రి కంపిలి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...