ఇక నామినేషన్ల పర్వం..


Mon,March 18, 2019 02:17 AM

-నేటి నుంచే ఎంపీ నామినేషన్ల స్వీకరణ
-ఈనెల 25వరకు అవకాశం
-కలెక్టర్ ఛాంబర్‌లో కేంద్రం
-డిపాజిట్‌గా రూ.12,500
-ఏడు అసెంబ్లీలు : 16.01లక్షల ఓటర్లు
-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-ఇంకా ఖరారుకాని అభ్యర్థులు
-మరో ఎన్నికల సమరాంగణం
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నాగర్‌కర్నూల్(ఎస్సీ రిజర్వుడు) ఎంపీ స్థానానికి సోమవారం ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలుండగా, గద్వాలలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు, వనపర్తి జిల్లా అసెంబ్లీ నియోజర్గం కూడా ఉంది. ఇందులో మొత్తం 16,01లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

25వరకు నామినేషన్లు
సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఛాంబర్‌లోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మొత్తం 8రోజులకు గాను 21వ హోలితో, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం కావడంతో మూడు రోజులు మినహాయించగా ఐదు రోజులు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లకు సమయం కేటాయించడం జరిగింది. దీనికోసం కలెక్టరేట్ నుంచి 100మీటర్ల హద్దును కూడా నిర్ధారించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటుగా ఐదుగురు మద్దతుదారులు మాత్రమే లోపలికి అనుమతించబడుతారు. ఇక 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ గడువు ఉంది. వచ్చే నెల 11వ తేదీన సరిగ్గా పాతిక రోజుల్లో పోలింగ్ ఉంటుంది. అనంకపం ఆయా అసెంబ్లీల నుంచి ఈవీఎం యంత్రాలను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి తరలిస్తారు. అనంతరం 41రోజుల తర్వాత మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. నాగర్‌కర్నూల్ స్థానం ఎస్సీకి రిజర్వుడు అయి ఉన్నందున ఇక్కడ నామినేషన్లు వేసే అభ్యర్థులు రూ.12,500చొప్పున నామినేషన్లతో పాటుగా డిపాజిట్ చెల్లించాలి. ఒకే డిపాజిట్‌పై ఒక అభ్యర్థి నాలుగు సెట్ల వర కు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఇక ఎన్నికల్లో గరిష్టంగా రూ.70లక్షల వరకు ఖర్చు చేసేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ప్రతీరోజూ అభ్యర్థి ఖర్చులను ఎన్నికల అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

నాగర్‌కర్నూల్‌లోనే నామినేషన్లు..
ఎంపీ ఎన్నికల కోసం నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ పార్లమెంట్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మొత్తం 16.01లక్షల ఓటర్లకు గాను ఏడు అసెంబ్లీల్లో 1936పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గత నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రకారం 15.88లక్షల మంది ఓటర్లు ఉండగా ఈనెల 15వ తేదీతో కొత్తగా 12,275మంది ఓటర్లు పెరిగారు.

2600 యంత్రాలు
ఈఎన్నికల కోసం 975 కంట్రోల్ యూనిట్లు, 1300బ్యాలెట్ యూనిట్లు, 1056వీవీ ప్యాట్ యంత్రాల చొప్పున మొత్తం 2600యంత్రాలను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేపట్టనున్నారు. ఇక ఎన్నికల కోసం 12వేల మంది ఉద్యోగుల అవసరం ఉండగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పీవో, ఏపీవోలకు శిక్షణలు, ఇతర సిబ్బంది నియామకం చేపడుతున్నారు. మొత్తం 265సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలీసులను కూడా బందోబస్తుకు నియమించేందుకు కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే ఆయా జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఆర్డీవోల్లాంటి అధికారుల సమావేశాలు జరిగాయి. రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించారు. ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్నికలను పర్యవేక్షించేందుకు 12మంది జిల్లా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. సీ విజిల్ యాప్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలనూ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా అనుమతులు తీసుకునేందుకు ఆన్‌లైన్ సువిధ అప్లికేషన్‌ను తీసుకొచ్చారు. ఒక్క వాహనాల అనుమతి తప్ప ఇతర అనుమతులన్నీ ఆయా అసెంబ్లీల్లోనే తీసుకోవచ్చు.

తేలని అభ్యర్థుల స్పష్టత
ఎన్నికల అధికారులు ఎన్నికల కోసం చర్యలు దాదాపు పూర్తి చేసుకున్నా ఆయా రాజకీయ పార్టీల్లో మాత్రం అభ్యర్థుల ఖరారు జరగలేదు. నామినేషన్ల గడువు ప్రారంభమైనా ప్రధాన పార్టీలు ఇంకా అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడంతో రాజకీయంగా ఆసక్తి కలుగుతోంది. ఆయా పార్టీల నుంచి ఇద్దరు,ముగ్గురు చొప్పున పేర్లు ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. దీంతో ఎవరికి టిక్కెట్లు దక్కుతాయోననే ఉత్కంఠ ఆయా ఆశావహులతో పాటుగా రాజకీయ వర్గాలు, ప్రజల్లోనూ కనిపిస్తోంది. అయితే అధికార టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో కనిపిస్తోంది. ఇటీవలే వనపర్తిలో పార్లమెంటరీస్థాయి సన్నాహక సమావేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఇతర పార్టీల్లో మా త్రం నిస్సత్తువ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. తాజా ఎంపీ నంది ఎల్లయ్య ప్రజలకు దూరంగా ఉండటంతో పాటుగా స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వవద్దనే ఆం దోళన జరుగుతోంది. పార్లమెంట్ పరిధిలోని కాం గ్రెస్ నాయకుల్లోనూ టిక్కెట్ల అంశం వివాదం తీసుకొచ్చింది. దీంతో ఆ పార్టీ నామినేషన్‌కు ముందే నైరాశ్యంలో ఉంది. ఇదిలా ఉంటే పలువురు స్వతంత్రులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే స్వతంత్రులకు పది మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది.

అభ్యర్థులూ ఇవీ సూచనలు
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోమవారం నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఏప్రిల్ 11న ఎన్నికలు, మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. దీంతో ఆయా పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులూ ఎంపీ ఎన్నికల్లో పోటీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని నియమావళిని వెల్లడించింది. దీని ప్రకారం...వివరాలిలా ఉన్నాయి.
-నామినేషన్ వేసే అభ్యర్థులకు ఫారం 2, ఫారం 26లు ముఖ్యమైనవి. ఫాలం 2 ఎన్నికల కార్యాలయంలో ఉచితంగా అందజేయబడుతుంది. ఫారం 26 అఫిడవిట్‌కు సంబంధించింది. ఇందులో పాన్‌కార్డు వివరాలు సమర్పించాలి.
-నామినేషన్ పత్రాలపై ప్రతి పేపర్‌పై అభ్యర్థి సంతకం ఉండాలి. ఏ కాలంలోనూ ఖాళీగా ఉంచరాదు. ఆయా కాలమ్ నింపాల్సి లేకుంటే వర్తించదు అని రాయాలి.
-అభ్యర్థికి సంబంధించిన నేరచరిత్రను తప్పకుండా పేర్కొనాలి. ఈ వివరాలను మూడు విడతల్లో ఈనెల 29నుంచి ఏప్రిల్ 8లోపు పత్రికలు, టీవీల్లో ప్రచురించాలి. అలాగే ఇతర పన్నులు, బకాయిలు లేవనే ధృవీకరణ పత్రం సమర్పించాలి.
-ఎస్సీ రిజర్వుడు స్థానానికి రూ.12,500, ఇతర స్థానాలకు రూ.25వేల చొప్పున డిపాజిట్‌గా చెల్లించాలి.
-నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయానికి 100మీటర్ల వరకు మాత్రమే మూడు నాహనాలకు అనుమతి ఉంటుంది. రిటర్నింగ్ కేంద్రంలోనికి అభ్యర్థితో పాటుగా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది.
-ప్రతిపాదించే వ్యక్తి తప్పనిసరిగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లో ఓటరు అయి ఉండాలి.
-ఎస్సీ రిజర్వుడు స్థానంలో అభ్యర్థులు కులం సర్టిఫికెట్ తప్పనిసరిగా జతపర్చాలి.
-అభ్యర్థి దేశంలో ఎక్కడి నుంచైనా ఓటరుగా ఉండవచ్చు.
-నామినేషన్లు ఈనెల 21,23,24తేదీల్లో ఉండవు. మిగతా రోజుల్లో ప్రతీరోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు వేయాలి.
-పోటీ చేసే రాజకీయ అభ్యర్థులకు ఒక్కరే ప్రతిపాదించాలి. అయితే దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు మాత్రం కలిగి ఉండాలి. ఇక స్వతంత్ర అభ్యర్థులకు అదే లోక్‌సభ పరిధిలోని పది మంది ప్రతిపాదించాలి. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ఫారం-2బీ, పార్ట్-3లో సీ కాలం ఎదురుగా కేటాయించాల్సిన గుర్తులను మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో పేర్కొనాలి.
-ఇక అభ్యర్థులు నామినేషన్‌తో పాటుగా ఓటరు జాబితా ప్రతినిని అందజేయాలి.
-నామినేషన్‌తో పాటుగా నాలుగు కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక స్టాంపు సైజ్ ఫోఫొటో సమర్పించాలి. ఫొటో వెనకాల అభ్యర్థి సంతకం చేయాలి. ఈ ఫొటోల్లో మెడపై ఎలాంటి కండువాలు, పార్టీ గుర్తులు, పార్టీ టోపీలు, నల్ల కళ్లద్దాలు ఉండవద్దు. మొత్తం 20ఫొటోలను సమర్పించాల్సి ఉంటుంది. ఫోటోలు తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌తో కూడి ఉండాలి. వెనకాల ఎలాంటి రంగుల్లో ఉండకూడదు.
-నామినేషన్‌కు 48గంటల ముందు అభ్యర్థి తన పేరున కొత్త బ్యాంకు ఖాతా తెరవాలి. ఇంతకు ముందు తెరిచిన ఖాతాలు అనుమతించబడవు. అలాగే రిటర్నింగ్ అధికారి నుంచి చెల్లించిన మొత్తానకి రశీదు పొందాలి.
-స్క్రూట్నీకి హాజరయ్యేందుకు నోటీసు, ఎన్నికల వ్యయాలను నమోదు చేసేందుకు రిజిష్టర్ పొందాలి. కరపత్రం, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర సామగ్రి ముద్రించేందుకు ప్రజాప్రతినిధ్య చట్టంలో సెక్షన్-127ఏ సూచనలు, ప్రతిజ్ఞ, శపథం చేసినట్లు ధ్రువీకరణ పత్రం, నామినేషన్ పత్రంలోని లోపాలు, జతపర్చాల్సిన చెక్‌మెమో సరిచూసుకోవాలి.
-ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలో అన్ని వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. చరాస్తులు, స్థిరాస్తులు, ఏమైనా కేసులు, తదితర వివరాలన్నీ నమోదు చేయాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాలపై తప్పనిసరిగా నిర్దేశించిన సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా నామినేషన్ తిరస్కరించబడుతుంది.
-ఇక ఈనెల 18,19,20,22,25తేదీల్లో మాత్రమే ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
-ఈనెల 21న హోళీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారాలు ఉండటంతో నామినేషన్ల స్వీకరణ ఉండదు.
-పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.70లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...