కేసీఆర్ తప్పక ప్రధాని అవుతారు


Sun,March 17, 2019 02:39 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తప్పకుండా ప్రధాన మంత్రి అవుతారని... ప్రస్తుతం సమీకరణలన్నీ అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర ఎక్సైజ్, యువజన, క్రీడా శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో కొందరు ఇదే తీరుగా ప్రధాన మంత్రులు అయ్యారని... సరైన మెజారిటీ లేని పార్టీ సైతం కర్ణాటకలో సీఎం పదవిని చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహబూబ్ నగర్‌లో ఆయన జన్మదిన వేడుకల అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రంలో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి మొత్తం 17 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో చక్రం తిప్పేది టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. ఇంత వరకు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను ఎదగనివ్వలేదని... ఇకపై ఆ పరిస్థితి ఉండబోదన్నారు. కేసీఆర్‌ను మించిన పరిపాలన దక్షత దేశంలో మరెవరికీ లేదన్నారు.

కేసీఆర్ తప్పకుండా పీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 70 ఏళ్ల పాలన చూశామని... తమకు ఓ 20 ఏళ్లు చాలని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. పీఎం అయితే గోదావరి నీటిని కృష్ణాకు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను అభివృద్ధి ప్రదాతగా కొనియాడారు. ప్రజలు ఎటు వైపు ఉంటారో, వారికి ఏం కావాలో తెలుసుకుని టీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తోందని తెలిపారు. అందుకే ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీలోకి వస్తున్నారని వివరించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సైతం తమ ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లోకి వస్తే పార్టీ ఆహ్వానిస్తుందని స్పష్టం చేశారు. చేరికలపై కొందరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని జనం ఊరుకోరని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వారికి ప్రజల చేతిలో భంగపాటు తప్పదన్నారు. ప్రతిపక్షాల పనితీరు బాగా లేదు కనుకే ప్రజలు తిరస్కరిస్తున్నారని... దీనిపై వారు పునరాలోచించుకునాలని సూచించారు.

పాలమూరు ఎత్తిపోతలతో సస్యశ్యామలం చేస్తాం...

రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వనపర్తి ప్రాంతంలో ఒకప్పుడు బీడుగా ఉన్న భూములన్నీ నేడు పచ్చని చేలుగా మారాయని... భవిష్యత్తులో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రస్తుతం కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే పాలమూరు మొత్తం పచ్చగా కనపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లేవారని... ప్రస్తుతం ఇక్కడికే వలసలు వస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరులో పేదరికాన్ని పోగడతామని... రాష్ర్టాన్ని, పాలమూరును నెంబర్ వన్ గా నిలుపుతామన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికేసులు వేసినా... కేంద్రంలో మనం చక్రం తిప్పితే ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకుంటాయని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయన్నారు. దేశంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పైనే చర్చ జరుగుతోందన్నారు.

సారు గుర్తు కారే కదా...

రాష్ట్రంలో ఎవరిని అడిగినా సారు గుర్తు కారే కదా అంటున్నారని... అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. ప్రతిపక్షాలకు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే అవుతుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఎన్నికలప్పుడే ప్రతిపక్షాలకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మన రాష్ట్రం భవిష్యత్తు కోసమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. కేసీఆర్ భావజాలంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడుగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. కేటీఆర్ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోందన్నారు. కేటీఆర్‌ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. త్వరలో మహబూబ్ నగర్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సన్నాహక సమావేశం జరుగుతుందని మంత్రి తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...