మనస్పర్థలే దారితీశాయి


Sat,March 16, 2019 02:00 AM

వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న రాఘవేంద్రస్వామిని హత్య చేసిన సంఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వనపర్తి డీఎస్పీ సృజన చెప్పారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 12న రాత్రి జీ గార్డెన్‌లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రాఘవేంద్రస్వామి, అరుణ్‌యాదవ్‌లు గొడవపడ్డారు. ఇదే సమయంలో రాఘవేంద్ర స్వామి అరుణ్ కుటుంబ సభ్యులని కిడ్నాప్ చేస్తానని భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడడంతో రామాలయం వరకు ఘర్షణ పడుతూ వచ్చారు. గొడవ పెద్దగా కావడంతో అక్కడే ఉన్న పెద్ద రాయితో రాఘవేంద్రస్వామి తలపై అరుణ్ మోదాడు. ఘటన జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఐదుగురు ఉన్నారని ఆమె చెప్పారు. వీరంతా ఒకప్పటి మంచి స్నేహితులు చిన్నపాటి మనస్పర్థాలు పెరిగి మనసులో కోపాలు పెంచుకొని హత్య దాకా వెళ్లిందని ఆమె చెప్పారు. సంఘటన స్థలానికి పోలీసులు వెంటనే వెళ్లి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించాం. అప్పటికే రాఘవేంద్రస్వామి మృతి చెందాడు. సీసీ పుటేజీల ఆధారంగా సంఘటన స్థలంలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.

ఈ హత్యలో వనపర్తికి చెందిన అరుణ్‌యాదవ్ ఏ1 ముద్దాయిగా.. హరీష్‌యాదవ్ (బిట్టు) ఏ2, వంశీతేజ ఏ3, ఆశోక్‌కుమార్ ఏ4, జంగిడి ఓంకార్ ఏ5, శ్రీకాంత్‌రెడ్డి ఏ6, ప్రేమ్‌నాథ్‌రెడ్డి ఏ7 ముద్దాయిలుగా కేసులు నమోదు చేశామని ఆమె తెలిపారు. ఏ6 ముద్దాయి శ్రీకాంత్‌రెడ్డి పరారీలో ఉన్నాడని, ఇప్పటికే సమాచారం అందిందని త్వరలో అతనిని కూడా పట్టుకొని ఆరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ సంఘటనలో ప్రత్యక్షంగా ఏ5 వరకు సంబంధం ఉందని, మిగతా ఇద్దరు సహకరించారని చెప్పారు. ఒకరినోకరు బ్లాక్‌మెయిల్ చేసుకుంటూ వీరిద్దరి మధ్య మనస్పర్థాలు పెరిగి హత్య దాకా వెళ్లిందని అన్నారు. పాత కక్షల వల్లనే హత్య జరిగిందని డీఎస్పీ తెలిపారు. వనపర్తిలో తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని, మద్యం, గంజాయి, చెడు అలవాట్లకు దూరంగా ఉంచేలా చూడాలని ఆమె కోరారు. పిల్లలు చేసే ప్రతి పనికి తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటుందని, నేను కూడా ఒక తల్లిగా పిల్లల దురలవాట్లపై మనసు తలుక్కుమంటుందని ఆమె అన్నారు. పిల్లలు మైనర్ అయిన చేసే చెడును బట్టి ఎంతటి వారికైన నేరాన్ని బట్టి పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. విష సంస్కృతికి చరమగీతం పాడాల్సిన అవసరం అసన్నమైందని, నేరాలను ఉపేక్షించేది లేదని ఆమె అన్నారు. పోలీసుల దృష్టికి నేరుగా సమాచారం చేరవేసిన రహాస్యంగా ఉంచి నేరాలను అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్సై నరేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...