ఎత్తిపోతల పథకాలన్నింటికీ ప్రాధాన్యం


Fri,March 15, 2019 01:59 AM

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఒకప్పుడు వలసలకు పేరుగాంచిన పాలమూరు జిల్లాకే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే రోజులు త్వరలో వస్తాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ భగీరథ యత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల కొనియాడారు. దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించేందుకు ఇప్పటికే మంజూరీ అయిన పలు ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టడంతో పాటు నెల్విడి ఎత్తిపోతల పథకం మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీరు అందించేందుకు అవకాశం ఉందని సీఎం దృష్టికి తీసుకుపోగా వీటికి అనుమతి లభించిందని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) కార్యాలయంలో ఎండీ లకా్ష్మరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. 3 వేల ఎకరాలకు సాగునీరు అందించే నెల్విడి ఎత్తిపోతల పథకం సరైన నిర్వహణ లేక రైతులకు సాగునీరు అందించలేక పోతున్నట్లు ఎమ్మెల్యే ఆల పేర్కొన్నారు. ఈ లిఫ్టు పరిధిలోని కాలువల మరమ్మతులు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు. పేరూర్, పర్ధీపూర్, అమ్మాపూర్ లిఫ్టుల వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, వీటికి త్వరలో అంచనాలు రూపొందించాలని ఆయన సూచించారు. అమ్మాపూర్ లిఫ్టు నుంచి 2వేల ఎకరాలు, పర్ధీపూర్ లిఫ్టు నుంచి 5వేల ఎకరాలకు సాగునీరు అందనుందని ఆల వెంకటేశ్వర్ రెడ్డి వివరించారు. పర్ధీపూర్ లిఫ్టు నుంచి లాల్‌కోట, పల్లమర్రి, పర్ధీపూర్, నెల్లికొండి, వడ్డెమాన్ గ్రామాలకు సాగునీటి అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటికే మంజూరీ అయిన లిఫ్టులకు త్వరలో అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. పాలమూరు జిల్లాలోని ఎత్తిపోతల పథకలాన్నింటికీ తగిన ప్రాధాన్యం ఇచ్చి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తి చేస్తామని ఐడీసీ ఎండీ లకా్ష్మరెడ్డి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ఐడీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...