15,88,746 తేలిన పార్లమెంట్ ఓటర్ల లెక్క


Sat,February 23, 2019 02:10 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు చర్యలు వేగంగా తీసుకొంటున్నారు. రాబోయే ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన ఓటర్ల నమోదు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. దీంతో అధికారులు నోటిఫికేషన్ విడుదల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని ఏడు అసెంబ్లీలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాలుండగా గద్వాల కేంద్రంతో పాటుగా అలంపూర్ అలాగే వనపర్తి నియోజకవర్గ కేంద్రంతో కూడిన నియోజకవర్గాల్లో మొత్తం 15,88,746మంది ఓటర్ల ఉన్నారు. ఈ ఓటర్లంతా ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా ప్రకారంగా చూస్తే 15,00,981మంది ఉండగా ఈ జాబితా ప్రకారంగా కొత్తగా 87,765 ఓటర్లుగా నమోదయ్యారు.

ఇక అత్యధికంగా వనపర్తి అసెంబ్లీ పరిధిలో 2,46,976మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో 2,14,095మంది ఓటర్లు ఉండటం గమనార్హం. ఇక 35మంది మూడో రకం ఓటర్లు ఉన్నారు. పురుషులు, మహిళలతో పోలిస్తే ఓటర్ల సంఖ్యలో కూడా చాలా స్వల్ప తేడా 9,653మంది మాత్రమే ఉన్నారు. పురుషులు 7,99,182మంది ఉండగా, మహిళా ఓటర్లు 7,89,529మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, జిల్లాల పునర్విభజన జరిగాక తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూల్ పట్టణ కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలతో పలు దఫాలుగా నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో పార్లమెంట్ ఎన్నికల నోడల్ అధికారి, కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఓటర్ల జాబితాతో పాటుగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల వివరాలనూ సేకరిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12వేల మంది ఉద్యోగులు అవసరమని అధికారులు గుర్తించారు. 18మంది జిల్లా స్థాయి అధికారులను జిల్లా నోడల్ అధికారులుగా నియమించడం జరిగింది.

ఆయా జిల్లాల్లో శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. రాజకీయ పార్టీల సమావేశాలు కూడా జరిగాయి. ఈ ఎన్నికలకు అవసరమైన సామాగ్రి తరలించేందుకు నాగర్‌కర్నూల్‌లో మూడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, వనపర్తిలో ఒకటి, గద్వాలలో రెండు, రంగారెడ్డి జిల్లాలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి ఎన్నికల సామాగ్రిని పార్లమెంట్ పరిధిలోని 1937పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తారు. ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ శివారులోని వ్యవసాయ మార్కెట్, ఉయ్యాలవాడ శివారులోని మోడ్రన్ బిఈడీ కళాశాలలకు ఈవీఎం మిషన్లను తరలించి లెక్కింపు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి శ్రీధర్ మూడు జిల్లాల్లోని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కీలకమైన ఓటర్ల జాబితా ఎట్టకేలకు ఖరారు కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం పూర్తయ్యింది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...