నియామకంలో నిర్లక్ష్యమెందుకు..?


Fri,February 22, 2019 12:21 AM

- విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సమాచారం ఇవ్వని అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ శ్రీధర్
- ఎన్నికల నిర్వాహణ, విధులపై అధికారులతో సమీక్ష
- 18మంది జిల్లా అధికారులు నోడల్ అధికారులుగా నియామకం
- సమాచారం లేని సిబ్బంది జీతాలు నిలిపివేయాలి
- ట్రెజరీ అధికారికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
నాగర్‌కర్నూల్ టౌన్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వాహణ కోసం అవసరమైన ఉద్యోగుల నియామకంలో నిర్లక్ష్యం తగదని జిల్లా అధికారులపై కలెక్టర్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహణ, అన్ని శాఖల్లో పనిచేసే సిబ్బంది వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఉద్యోగుల డేటా ఇవ్వాలని సూచిస్తున్నా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్ ఒక్కసారిగా మండిపడ్డారు. పది రోజుల నుంచి ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగుల సంఖ్య 6858మంది ఉంటే కేవలం నేటి వరకు 4556మంది సమాచారాన్ని అందించినందుకు గానూ సంబంధిత జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రానికి పూర్తిస్థాయి సమాచారం 41 కాలం ప్రొఫార్మాలో ఉద్యోగుల వివరాలను అందించకుంటే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాస్థాయి అధికారిని ఎన్నికల విధుల్లో ప్రొసిడింగ్ లేదా అసిస్టెంట్ ప్రొసిడింగ్ అధికారిగా నియమిస్తానన్నారు.

నేటి సాయంత్రానికి సమాచారం అందించకుంటే ఆయా శాఖల అధికారుల జీతాలు నిలిపి వేయాలని జిల్లా ట్రెజరీ అధికారిని ఆదేశించారు. శుక్రవారం ఆయా మండలాల ప్రత్యేకాధికారులు సందర్శించి పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటరు జాబితా వివరాలు పరిశీలించాలన్నారు. నేటి నుంచి ప్రారంభంకానున్న చునావ్ పాఠశాల కార్యక్రమంలో పాల్గొని ఈవీఎంలపై ఎలక్ట్రానిక్ వేటింగ్‌మిషన్ యంత్రాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు 18మంది జిల్లాస్థాయి అధికారులను జిల్లా నోడల్ అధికారులుగా నియమించారు. వీరు తమకు కేటాయించిన పనుల్లో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ ఎన్నికల నోడల్ అధికారులు బైరెడ్డి సింగారెడ్డి, అనిల్‌ప్రకాశ్, మోహన్‌రెడ్డి, గోవిందరాజులు, సుధాకర్, ప్రజ్వల, మోహన్‌బాబు, అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...