అమరులకు కన్నీటి నివాళి..


Sun,February 17, 2019 03:01 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడితో ప్రజలు రగిలిపోతున్నారు. దేశ రక్షణ కోసం 49మంది భారత సైనికులు మృతి చెందగా పాతిక మంది వరకు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సంఘటనతో ప్రజల్లో పాక్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కుటుంబాలను లెక్క చేయకుండా పగలు, రాత్రీ అనకుండా ఎండా, వానాచలికాలం అనే తేడాలు లేకుండా వర్షం వచ్చినా, మంచు కురిసినా, శరీరాన్ని కొరికి తినేలా చలి గాలులు వీచినా దేశ రక్షణ కోసం సైనికులు పహారా కాస్తూ తమ ప్రాణాలను దేశమాత సేవలో అర్పిస్తున్నారు. భారత దేశం సహనాన్ని పరీక్షించేలా గతంలో ముంబై మారణ హోమం, పార్లమెంట్‌పై దాడితో పాటుగా హైదరాబాద్ గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లాంటి పలు తరహా విధ్వంసాలకు ఉగ్రవాదులు పాల్పడుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా ప్రాణాలు అడ్డంగా పెట్టి రక్షిస్తోన్న వీర జవాన్లు ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా పుల్వామాలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా యుద్ధాన్ని తలపించేలా ఓ ఉగ్రవాది 49మందిని హతమార్చిన ఘటన ప్రజల్లో ఆగ్రహావేశాలను తెప్పిస్తోంది.

దీన్ని ప్రజలు తమ కార్యక్రమాల ద్వారా చాటుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ నిరసన ర్యాలీలు చేస్తున్నారు. జాతీయ జెండాలను చేతబట్టుకొని జై జవాన్, జోహార్ సైనికా అంటూ నినాదాలు చేస్తున్నారు. విద్యార్థులు, యువకులు, వృత్తిదారులు, న్యాయవాదులు...ఒకటేమిటి అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్ తీరు పట్ల మండిపడుతున్నారు. సర్వమత సమ్మేళనం, శాంతికి నిలయమైన భారత దేశాన్ని అస్థిరపరిచే పాక్ ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఇలా ఉగ్రవాదులతో చేయించే కుట్రలను ఛేదించాలని ప్రజలు తమ కార్యక్రమాల ద్వారా మద్దతు ఇస్తున్నారు. సైనికుల త్యాగాలకు నివాళి అర్పిస్తున్నారు. జవాన్ల కుటుంబాలకు దేశమంతా సంఘీభావంగా ఉంటుందనే సందేశాన్ని పంపిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ జాతీయ భావాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ప్రైవేట్ వాహనదారుల సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పాక్, ఉగ్రవాద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయా మండలాల్లోనూ పాక్ తీరుకు నిరసనగా, సైనికులకు సంఘీభావ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, దానికి దేశ ప్రజలంతా వెన్నంటి నిలుస్తారని హామీ ఇస్తున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...