కారు గెలిస్తేనే అభివృద్ధి


Tue,September 11, 2018 01:47 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగం ఓటమి ఖాయమని.. అదే సమయంలో మర్రి భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని డీకేఆర్ ఫంక్షన్ హాల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నాగం అధికారం కోసమే పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకుముందు బీజేపీలో చేరితే ఆ పార్టీలో పాత, కొత్తలని వేరు చేసి నామరూపాల్లేకుండా చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందన్నారు. తన పుట్టుకే కాంగ్రెస్‌కు వ్యతిరేకతన్న నాగం 40సంవత్సరాల పాటు విమర్శించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ కండువా కప్పుకొని, అదే పార్టీని పొగుడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగం, తాను వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉన్నామన్నారు. ఈ క్రమంలో తనకు మద్దతివ్వాలని నాగం కోరితే ప్రజలు ఛీ కొడతారని.. అందుకే ఆ పార్టీలో ఉండలేక తాను టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గానికి నాగం ఈ

అభివృద్ధి చేశానని ఒక్కటైనా చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ భవనం అసంపూర్తిగా నిర్మించారని, మర్రి దీన్ని ప్రారంభింపజేశారని, కలెక్టరేట్ క్యాంపును తానూ నిధులు మంజూరు చేయించి ప్రారంభింపజేశానన్నారు. గుడిపల్లి గట్టు వద్ద మొసలి కన్నీరు కార్చి ఓట్లు సాధించి కేవలం 1400ఓట్లతో గెలిచారని, 2009ఎన్నికల్లో మీడియాను ముందే పిలిపించుకొని బట్టలు చించుకొని పోలీసులపై బట్ట కాల్చి ప్రజలను మోసగించి నాగం గెలిచారన్నారు. నాగం గెలిచే పరిస్థితులు ఏమాత్రం లేవన్నారు. మర్రి గెలుపు అభివృద్ధికి మలుపు అవుతుందని, తన వంతుగా శాయాశక్తులా కృషి చేస్తానన్నారు.
అనంతరం మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు ప్రారంభింపజేశానని, జిల్లాను సాధించామని, మళ్లీ కారు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల సీఎం కేసీఆర్‌చే వచ్చే ఎన్నికల తర్వాత సాధించి తీరుతానన్నారు. పట్టణంలో భూగ ర్భ మురుగు నీటి వ్యవస్థకు రూ.65కోట్లు మంజూరు చేయించానని, రూ.40కోట్లతో మార్కెట్ యార్డు, రూ.16కోట్లతో మినీ టాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రూ.65లక్షలతో బుద్ధ విగ్రహం, సెంట్రల్ లైటింగ్, డివైడర్, తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో పాలిటెక్నిక్ కళాశాల వస్తుందన్నారు. వట్టెం రిజర్వాయర్ ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానన్నారు. నాగం గెలిచేందుకే పార్టీలు మారుతున్నారన్నారు. ప్రజా బలముంటే, దమ్ముంటే బీజేపీలో ఉండి గెలవచ్చని, నాగం కాలు పెడితే టీడీపీ, బీజేపీ భూస్థాపితమైందని.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో వంద సీట్లు గెలుస్తుందని, కందనూలులోనూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, కేసీఆర్‌ను సీఎంగా చేసుకుందామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, నాయకులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...