చిలుకలగుట్ట వద్ద రక్షణ

Sun,December 15, 2019 03:03 AM

-చర్యలు చేపట్టిన ప్రభుత్వం
-అపరిచితులు ప్రవేశించకుండా గుట్ట చుట్టూ ప్రహరీ
-సెక్యూరిటీ గార్డుతో నిరంతరం పర్యవేక్షణ
తాడ్వాయి, డిసెంబర్‌14: మేడారం స మ్మక్క-సారక్క గిరిజనుల ఆరాధ్య దైవా లు. ప్రతి రెండేళ్లకోసారి అమ్మవార్ల మహాజాతరను నిర్వహిస్తుంటారు. సీమాంధ్ర పాలనలో అప్పటి ప్రభుత్వాలు మేడారంపై చిన్నచూపు చూసేవి. అరకొర నిధులు అం దించేవి. సమ్మక్క కొలువైన చిలుకలగుట్టను భక్తులు అపవిత్రం చేస్తున్నారని గిరిజన పూజారులు ఆవేదన వ్యక్తం చేసేవారు. గుట్ట చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయించి, జాతరలో సౌకర్యాలు కల్పిస్తున్నది. అందులో భాగంగా గుట్ట చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. ఇతరులు గుట్టపైకి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. ఫెన్సింగ్‌ నిర్మాణం పూర్తి కావడంతో దేవాదాయశాఖ అధికారులు గేట్‌ వద్ద సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసి, చిలుకలగుట్ట పవిత్రతను కాపాడుతున్నారు.

రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క జాతరకు భక్తులు పోటెత్తుతారు. లక్షలాదిగా తరలివచ్చి, మొక్కు లు చెల్లించుకుంటారు. మహాజాతర నేపథ్యంలో చిలుకలగుట్టపై కొలువైన సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చే ఘట్టం అత్యంత కీలకం. అంగరంగ వైభవంగా జరిగే ప్రక్రియలో భాగంగా భక్తుల జయజయ ధ్వానాల మధ్య రాష్ట్ర అధికారులు, ఆదివాసీ పూజారులు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ క్రమంలో వచ్చిన భక్తులు ప్రకృతి ఒడిలో సేదదీరుతారు. పచ్చని అడవిలో చెట్ల కింద విడిది చేస్తారు. కానీ, కొందరు తల్లి కొలువైన చిలుకలగుట్టపైకి వెళ్లేందుకు గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నిస్తారు. గుట్టపై మొక్కలను, చెట్ల కొమ్మలను తీసుకెళ్తుంటారు. గుట్టపైకి ఎక్కి అపవిత్రం చేస్తుంటారు. దీనిని గమనించిన గిరిజన పూజారులు సీమాంధ్ర పాలనలో అప్పటి ప్రభుత్వాల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. గుట్టచుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు. కానీ, ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేడారంలో మంచిరోజులు వచ్చాయి. పలు అభివృద్ధి పనులతో రూపురేఖలు మారిపోయాయి. భక్తులు గుట్టపైకి వెళ్లకుండా, తల్లి కొలువైన గుట్టను అపవిత్రం చేయకుండా గుట్ట చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో గుట్ట ప్రధాన ద్వారం, దానికి ఇరువైపులా ప్రహరీ నిర్మించారు. కొందరు గుట్ట వెనుక భాగంలో నుంచి గుట్ట ఎక్కేందుకు ప్రయత్నిస్తుండడంతో గిరిజన పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించి, మళ్లీ నిధులు మంజూరు చేసింది. ప్రహరీని పూర్తి చేయించింది. ప్రధాన ద్వారం వద్ద గేట్‌ను ఏర్పాటు చేసింది. భక్తులు గేట్‌ దూకి గుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గేట్‌ వద్ద సెక్యూరిటీ గార్డును నియమించింది. దీంతో చిలుకలగుట్టకు రక్షణ ఏర్పడగా, గిరిజన పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles