శభాష్ కలెక్టర్!

Wed,December 11, 2019 06:25 AM

-టీం వర్క్ సూపర్
-వాసం వెంకటేశ్వర్లును అభినందించిన గవర్నర్
-ప్రశంసించిన సీఎంవో కార్యాలయ అధికారులు
భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన విజయవంతం కావడంపై కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును ఇటు గవర్నర్, అటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు అభినందించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు చేపట్టిన ముందస్తు చర్యలతో పర్యటన విజయవంతం కావడానికి దోహదపడ్డాయని, బోడగూడెంలో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయడంపై సీఎంవో స్పందించింది. వెంకటేశ్వర్లు బృందాన్ని అభినందించింది. కాటారం మండలం నస్తూర్‌పల్లి శివారు బోడగూడెంలో కలెక్టర్ ఒకరోజు ముందే గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడే పరిష్కారానికి కృషి చేశారు. ఒకే ఒక్క రోజులో గ్రామ రూపురేఖలు మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి ఇంజినీర్లతో మాట్లాడి గవర్నర్ పర్యటనను విజయవంతం చేయడానికి కృషి చేశారు. బోడగూడెంలో మంగళవారం గవర్నర్ తమిళిసై పర్యటించి ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై కలెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బోడగూడెంలో ఏర్పాట్లు బాగున్నాయని, కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారని అభినందించారు. గ్రామంలో ఇంటర్ పూర్తి చేసిన వనితకు అప్పటికప్పుడే పార్ట్ టైం ఏఎన్‌ఎం ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించి వెంటనే ఆర్డర్ కాపీ ఇవ్వడంతో కలెక్టర్‌ను కొనియాడారు. గవర్నర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించగా, కలెక్టర్ ఇంజినీర్లను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ఇంజినీర్లు ప్రాజెక్టు గురించి గవర్నర్‌కు వివరించడంలో విజయవంతమయ్యారు. గవర్నర్ నుంచి ప్రశంసల వర్షం కురియగా మరోవైపు సీఎంవో కలెక్టర్‌ను అభినందించింది. జిల్లాలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు టీం వర్క్ చేశారని పేర్కొంది. ఒకరోజు ముందుగా బోడగూడెంలో మకాం వేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని సమీక్షించి, జిల్లా అధికారులందరితో అక్కడే సమావేశం నిర్వహించి ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారానికి కృషి చేయడాన్ని సీఎంవో కార్యాలయం గుర్తించి, అభినందించింది. కాగా, సరస్వతీ (అన్నారం) బరాజ్ సందర్శన పూర్తి చేసుకుని పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్న గవర్నర్ మార్గమధ్యలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి, జిల్లాలో పర్యటన ఏర్పాట్లు బాగున్నాయని అభినందించారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles