నాణ్యతపై నజర్‌

Mon,December 2, 2019 02:46 AM

-మేడారం జాతర అభివృద్ధి పనులపై నిఘా
-నాణ్యత లేని పనులకు బిల్లుల నిలిపివేత
-కలెక్టర్‌ సంతృప్తి చెందితేనే బిల్లుల చెల్లింపు
-విజిలెన్స్‌ అధికారుల సంఖ్య పెంపు
-వారికి ద్విచక్ర వాహనాలు, మొబైల్స్‌
-ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షణ

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: 2020 ఫిబ్రవరిలో జరిగే మేడారం మహా జాతర అభివృద్ధి పనుల నాణ్యతపై కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతరలో భక్తుల సౌకర్యాల కల్పన కోసం భారీ ఎత్తున నిధులను కేటాయిస్తోంది. జాతరకు ముందే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపడుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న జాతరకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు తాత్కాలిక ఉపశమనంగానే మారుతున్నాయి. ఫలితంగా తూతూ మంత్రంగా అభివృద్ధి పనులు జరిగి జాతర అనంతరం అభివృద్ధి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం పకడ్బందీగా నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి పైసాను సద్వినియోగం చేయాలనే లక్ష్యంతో కలెక్టర్‌ నారాయణరెడ్డి మేడారంలో శాశ్వత నిర్మాణాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో నాణ్యత లేని నిర్మాణ పనులకు చెక్‌ పెడుతున్నారు. జాతరలో చేపడుతున్న పనులపై నలుగురి బృందంతో కూడిన క్వాలిటీ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే జాతర సమయంలో 200మందితో కూడిన మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి చేపట్టిన అభివృద్ధి పనులు, జాతర ముగిసిన తర్వాత కూడా పనిచేస్తున్నాయా, లేదా అనే అంశాలను గుర్తించి సంతృప్తి చెందిన అనంతరమే కలెక్టర్‌ బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జాతర సమయంలో మానిటరింగ్‌ చేసే అధికారులకు ద్విచక్రవాహనాలు, సెల్‌ ఫోన్లను కేటాయించనున్నారు. దీంతో అధికారులు ప్రత్యేక యాప్‌ ద్వారా జాతరలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల పనితీరును పర్యవేక్షించి నివేదికలు సమర్పిస్తారు.

అర్హత గల ఏజెన్సీలకు పనుల అప్పగింత..
2020 మహా జాతరకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతరలో అభివృద్ధి పనులను నాణ్యతా(క్వాలిటీ అండ్‌ క్వాంటిటీ) ప్రమాణాలతో చేపట్టేందుకు అర్హత గల ఏజెన్సీలకు ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను అప్పగించడం పూర్తి చేశారు. అర్హత గల ఏజెన్సీలు, వారు సమర్పించిన ఎస్టిమెట్‌ల ప్రకారంగా జాతరలో గ్రామీణ నీటి పారుదల, పారిశుధ్య, రోడ్లు, భవనాలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌, నీటి పారుదల శాఖ, ఎలక్ట్రిసిటీ వంటి ప్రధాన విభాగాలు చేపట్టే పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతకే ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి సంబంధిత ఏజెన్సీలు పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ ప్రారంభించారు. జాతర సమయంలో చేపట్టే కొన్ని పనులు మాత్రమే నామినేషన్‌ ప్రక్రియ ద్వారా తాత్కాలికంగా చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. శాశ్వతంగా చేపట్టే పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే నామినేషన్‌ పనులకు అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు.

నలుగురు బృందంతో పర్యవేక్షణ..
జాతరలో రూ.75కోట్లతో చేపడుతున్న వివిధ రకాల పనులు నాణ్యతా ప్రమాణాలతో, శాశ్వత ప్రాదిపదికన చేపట్టేందుకు కలెక్టర్‌ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. గత జాతరలకు భిన్నంగా ఈ జాతర ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించే విధంగా చేపడుతున్న ప్రతి పనిలో బాధ్యత, జవాబుదారీ తనం ఉండాలని అధికారులను ఆదేశిస్తున్నారు. జాతర పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షణ చేసేందుకు పలు విభాగాలకు చెందిన అధికారులను విజిలెన్స్‌ మానిటరింగ్‌ సెల్‌ కమిటీగా ఏర్పాటు చేసి జాతరకు ముందు చేపడుతున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జాతర సమయంలో సుమారు 200మంది అధికారులతో ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసి జాతర సమయంలో చేపట్టిన పనులు పూర్తి స్థాయిలో భక్తులకు వినియోగంలో ఉన్నాయా..? లేవా..? అనే అంశాలను సంబంధిత అధికారులు పర్యవేక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles